వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి
ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ వెంటనే విడుదల చేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి
నవతెలంగాణ-సూర్యాపేట
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి ఐకెేపీ కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని కాంట వేసి లిఫ్ట్ చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి ప్రభుత్వాన్ని కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్‌లో శనివారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతాంగం ఆరు గాలం కష్టపడి పంట పండించి ఐకేపీ కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చి నెలలు గడుస్తున్నా కాంటాలు వేయలేదన్నారు. ప్రభుత్వం తక్షణమే ఐకెేసీ కేంద్రాలకు వచ్చింది వచ్చినట్టు ధాన్యాన్ని కాంటాలు వేసి మిల్లులకు తరలించాలన్నారు. ఇటీవల కురిసిన తుఫాన్ కార ణంగా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో వరి,పత్తి, మిర్చి, మొక్కజొన్న, ఇతర వాణిజ్య పంటలతోపాటు కూరగాయలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు.
వరి పంటకు ఎకరాకు రూ.30వేలు, పత్తి పంటకు ఎకరాకు రూ.50వేలు, ఇతర వాణిజ్య పంటలకు రూ.70వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజురీయింబర్స్ మెంట్, స్కాలర్‌షిప్‌ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని 1800 ప్రయివేట్ కాలేజీలో చదివే 14 లక్షల మంది విద్యార్థులకు మొత్తం రూ.9,966 కోట్ల ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ పెండింగ్ ఉందని తెలిపారు. ఇప్పటివరకు ప్రభుత్వం రూ.300 కోట్లు మాత్రమే విడుదల చేసిందన్నారు. తక్షణమే ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మిగతా రూ.900 కోట్లు విడుదల చేయాలని కోరారు. సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, కోట గోపి ఉన్నారు.



