Wednesday, October 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనాలి

ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనాలి

- Advertisement -

సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే జూలకంటి డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఐకేపీ కేంద్రాల ద్వారా వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రైతుసంఘం ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వారం రోజుల నుంచి వరికోతలు ప్రారంభమయ్యాయని తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాలకు తరలిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే ఎక్కడికక్కడ రాసులు పోసుకుని వానలకు తడుస్తూ, ఎండలకు ఎండుతూ నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఐకేపీ కేంద్రాలను హడావుడిగా రిబ్బన్లు కట్‌ చేసి ప్రారంభించారని పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు కాంటా వేసి ధాన్యం ఎక్కడా కొనటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఐకేపీ కేంద్రాల్లో టార్బాల్స, కరెంటు, మంచినీరు, వసతి వంటి కనీస సౌకర్యాలు కల్పించడం లేదని తెలిపారు.

గత్యంతరం లేక ధాన్యం ఐకేపీ కేంద్రాలే కాకుండా రోడ్ల వెంబడి ఎక్కడ పడితే అక్కడ రాసులు పోసుకుని రాత్రి వేళల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాపలా ఉంటున్నారని వివరించారు. ఫలితంగా తీవ్ర అనా రోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. రైతులు వారి గోడును ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి దాపురించిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఒక్క గింజ లేకుండా ఖరీదు చేస్తామంటూ ప్రకటనలు చేస్తూ కాలం గడుపుతున్నదని విమర్శించారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సకాలంలో సరఫరా చేయడంలేదనీ, ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనడం లేదని తెలిపారు. రైతులంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అంత అలుసా? అని ప్రశ్నించారు. పాలకులకు రాజకీయ ప్రయోజనాలు తప్ప రైతుల ప్రయోజనాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని కదలించి ఐకేపీ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలనూ కల్పించి వెంటనే ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -