Wednesday, April 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరేపటి నుంచి పెద్దఎత్తున గ్రామసభలు జరపాలి

రేపటి నుంచి పెద్దఎత్తున గ్రామసభలు జరపాలి

- Advertisement -

జూన్‌ 2 నుంచి కొత్త పథకాల అమలు గురించి వివరించాలి : వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లకు ఉప ముఖ్యమంత్రి భట్టి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గ్రామసభలను పెద్దఎత్తున నిర్వహించాలని కలెక్టర్లను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) కె రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు. గ్రామసభలను రాష్ట్రవ్యాప్తంగా ఒకే తరహాలో నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. మొదట ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సందేశం వినిపించి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పెద్ద ఎత్తున చదివి వినిపించాలని సూచించారు. రైతు భరోసా లబ్ధిదారుల పేర్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాను సాధ్యమైనంతవరకు గ్రామసభలో చదివి వినిపించాలని సూచించారు. ఇప్పటివరకు ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, జూన్‌ రెండు నుంచి అందరికీ జీవిత బీమా అమలు చేయబోతున్న విషయాన్ని వివరించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం ఆ కార్యక్రమంలో భాగంగా మూడు రోజులపాటు గ్లాస్‌ పాలు, మూడు రోజులపాటు రాగి జావా అందిస్తున్న విషయాన్ని వివరించాలన్నారు. ఇంటర్‌ కళాశాలల విద్యార్థులకు కొత్తగా మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న విషయం అందరికీ తెలిసేలా చెప్పాలని అన్నారు. వాటిని వివరించే క్రమంలో సాంస్కృతిక శాఖ, పౌర సంబంధాల శాఖ సహాయ సహకారాలు తీసుకోవాలని వివరించారు. గ్రామపంచాయతీలకు పెద్దఎత్తున నిధులు విడుదల చేస్తున్నామనీ, గ్రామాల వారీగా విడుదలైన నిధులను అందుబాటులో పెట్టుకుని గ్రామసభ రోజు ఆ గ్రామానికి ఎన్ని నిధులు వచ్చాయో ప్రకటించాలని చెప్పారు. ప్రజా పాలన కార్యక్రమాన్ని విజయవంతం అవుతున్న తీరును ఎప్పటికప్పుడు సీఎస్‌, ప్రణాళికా శాఖ జిల్లా కలెక్టర్ల నుంచి సమాచారం సేకరిస్తారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకే పరిమితం కాదనీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సేవా రంగాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు పోతున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.

గ్రామసభలు విజయవంతం చేయండి : అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం
”ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్‌ 2న నిర్వహించ నున్న గ్రామసభలు విజయవంతమయ్యేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని పంచాయతీరాజ్‌ శాఖమంత్రి దనసరి అనసూయ (సీతక్క) అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పంచాయతీరాజ్‌ అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గ్రామసభల్లో ప్రజల అభిప్రాయాలను నేరుగా తెలుసుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, గ్రామస్థాయి సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారాలు కనుగొనడం, ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. లబ్ధిదారుల అభిప్రాయాలను సేకరించడం ద్వారా పాలనను మరింత పారదర్శకంగా, బాధ్యతాయుతంగా మార్చవచ్చని చెప్పారు. గ్రామసభల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాలు, రైతులు, యువత, స్వయం సహాయక సంఘాల సభ్యులు, వివిధ పథకాల లబ్ధిదారులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. విస్తృత ప్రచారం చేపట్టి గ్రామప్రజలందరూ హాజరయ్యేలా చూడాలన్నారు. సభా ప్రాంగణంలో తాగునీరు, మహిళలు, వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. సభల అజెండాను స్పష్టంగా ప్రజలకు తెలియజేసి, ప్రభుత్వ పథకాలపై సమగ్ర చర్చ జరిగేలా చూడాలని సూచించారు. 2026-27 బడ్జెట్‌లో ప్రతిపాదించిన నూతన పథకాల కోసం అర్హులను గుర్తించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి గ్రామసభలో విధిగా ఫిర్యాదు బాక్సులను ఏర్పాటు చేసి ప్రజల అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరించాలని ఆదేశించారు. గ్రామ సమస్యలను సమగ్రంగా గుర్తించి, వాటి పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. గ్రామసభల అనంతరం సమావేశ వివరాలను నమోదు చేసి, సమస్యలు, తీర్మానాలు, తీసుకున్న నిర్ణయాలపై నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌ దివ్యదేవరాజన్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -