నాసిక్ నుంచి 40 వేల మందితో మార్చ్ ప్రారంభం
ప్రజా సమస్యలు, గత హామీలు అమలు చేయాలి : సీపీఐ(ఎం), ఏఐకేఎస్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్రలో సీపీఐ(ఎం) మహా పాదయాత్రను ప్రారంభించింది. నాసిక్ నుంచి 40 వేల మందితో సీపీఐ(ఎం), ఏఐకేఎస్ ఆధ్వర్యంలో ఆదివారం మెగా మార్చ్ ప్రారంభమైంది. ఈ మార్చ్‌కు సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ ధావలే, సీపీఐ(ఎం) మాజీ కేంద్ర కమిటీ సభ్యులు జెపి గావిట్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి అజిత్ నావలే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డిఎల్ కరాడ్, సీపీఐ(ఎం) నాసిక్ జిల్లా కార్యదర్శి ఇంద్రజిత్ గావిట్, ఏఐకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఉమేష్ దేశ్‌ముఖ్ తదితరులు నాయకత్వం వహిస్తున్నారు. జనవరి 21న పాల్ఘర్‌లో 50 వేల మందితో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జరిగిన మార్చ్ విజయవంతమైన నేపథ్యంలో నాసిక్ నుంచి రెండో మార్చ్‌ను నిర్వహిస్తున్నట్టు నాయకులు తెలిపారు.
పాల్ఘర్ పోరాటం, నాసిక్ పోరాటం రెండూ ప్రధాన సమస్యలపై జరుగుతున్నాయన్నారు. అటవీ హక్కుల చట్టం (ఎఫ్‌ఆర్‌ఏ), పెసా చట్టం, సాగునీటి పథకాలు, జిల్లా పరిషత్ పాఠశాలల్లో వేలాది ఖాళీల భర్తీ, గతంలో ఇచ్చిన అనేక హామీలు అమలు చేయకపోవడం వంటి వాటిపై ఈ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. అదే విధంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్పొరేట్ అనుకూల విధానాలైన స్మార్ట్ మీటర్ పథకం, ఎంఎన్‌ఆర్‌ఈజీఎ గ్రామీణ ఉపాధిని బలహీన పరచడం, ప్రభుత్వ-కార్పొరేట్ కూటమి భూముల ఆక్రమణ, నాలుగు కార్మిక కోడ్‌లను విధించడం వంటి సమస్యలపై పోరాటం చేస్తున్నట్టు తెలిపారు.



