పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ భువనగిరి వేదికగా విద్యార్థుల ఉత్సాహం..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భారత ప్రభుత్వ విద్యాశాఖ, కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రేరణ–2026 కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి పోటీలు పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ భువనగిరి నందు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్ చంద్రమౌళి అధ్యక్షతన ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిందినారు. ఈ జిల్లా స్థాయి పోటీలలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, సీబీఎస్సీ, అనుబంధ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు కలిపి సుమారు 50 మంది వరకు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
విద్యార్థులలో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, నైతిక విలువలు, జాతీయ భావన పెంపొందించడమే లక్ష్యంగా ఈ ప్రేరణ కార్యక్రమం రూపకల్పన చేయబడిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రతిభా ప్రదర్శన లో పాల్గొనే విద్యార్థుల సౌలభ్యార్థం నిర్వాహకులు కొన్ని ముఖ్య అంశాలను ముందుగానే ప్రకటించారు. వికసిత భారత్ – 2047, భారతదేశంపై నా దృష్టికోణం, నేను ప్రేరణ కార్యక్రమానికి ఎందుకు ఎంపిక కావాలి. ఈ అంశాలపై విద్యార్థులు తమ ఆలోచనలను కవితలు, పాటలు, చిత్రలేఖనం, వ్యాస రచన వంటి వివిధ రూపాల్లో సృజనాత్మకంగా ప్రదర్శించి అందరి మన్ననలు పొందారు.
ప్రిన్సిపాల్ ఎన్ చంద్రమౌళి మాట్లాడుతూ ప్రేరణ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, సేవాభావం, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత వంటి విలువలు బలపడతాయని పేర్కొన్నారు. జిల్లాస్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థులను తదుపరి స్థాయి కార్యక్రమాలకు ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ భువనగిరి సిబ్బంది సమిష్టి కృషి ప్రశంసనీయమని ఆయన అభినందించారు. వివిధ పాఠశాలల నుండి వచ్చిన ఎస్కార్ట్ టీచర్లు, నిర్వాహక కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు తమ పూర్తి సహకారాన్ని అందించారని పేర్కొన్నారు. ఈ పోటీల సందర్భంగా విద్యార్థులలో ఉత్సాహం, క్రమశిక్షణ స్పష్టంగా కనిపించగా, కార్యక్రమం చివర్లో పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రేరణ కార్యక్రమం ఎంతో ప్రయోజనకరమని అభిప్రాయపడ్డారు. ఈ జిల్లా స్థాయి ప్రేరణ–2026 పోటీలు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడేలా విజయవంతంగా ముగిశాయనారు.


