లౌకిక వాదాన్ని రక్షించాలని పాలయాం ఇమామ్ పిలుపు
తిరువనంతపురం : కేరళలో ఘనంగా రంజాన్ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలో లౌకిక వాదాన్ని రక్షించాలని దేశపౌరులకు పాలయాం ఇమామ్ వి.పి. షుహైబ్ మౌలావి పిలుపునిచ్చారు. విశ్వాసాల ఆధారంగా ప్రజలను ఒంటరి చేయడం లేదా బెదిరించడాన్ని అనుమతించకూడదని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా తిరువనంతపురంలోని చంద్రశేఖరన్ నాయర్ స్టేడియంలో ఇమామ్ మౌలావి ఈద్గా ప్రసంగం చేశారు. ఉత్తరాఖండ్‌లో 80 ఏళ్ల వయస్సు కలిగిన ముస్లిం దుకాణదారుడ్ని రక్షించడానికి అరాచకవాదులను ఎదుర్కొన్న దీపక్‌కుమార్ అనే వ్యక్తిని కథను ఇమామ్ తన ప్రసంగంలో వివరించారు.
‘నువ్వు ఎవరని అరాచవాదులు దీపక్‌కుమార్‌ను ప్రశ్నించగా, అతను ‘నాపేరు మహమ్మద్ దీపక్’ అని సమాధానం చెప్పారు’ అని ఇమామ్ వివరించారు. మన దేశంలో దీపక్‌కుమార్ వంటి అనేకమంది దయగలిగినవారు ఉన్నారని, ఇలాంటి వ్యక్తులు అన్యాయాన్ని చూస్తూ ఊరుకోరని స్పష్టం చేశారు. ఇలాంటి వారే దేశానికి నిజమైన బలమని, లౌకికవాద సంరక్షకులని ఇమామ్ అభివర్ణించారు. ఇలాంటి సద్భావన ఉన్నంతకాలం మతతత్వం ఏరూపంలో ఉన్నా..దేశ సామరస్యాన్ని నాశనం చేయలేదని తెలిపారు. అలాగే, అమెరికా, ఇజ్రాయిల్ దాడుల్లో పాఠశాల విద్యార్థులతో సహా అనేక మంది మృతిచెందడాన్ని, ఇతర క్రూరమైన చర్యలను ఇమామ్ తన ప్రసంగంలో ఖండించారు.
అమెరికా, ఇజ్రాయిల్ దాడులతో ప్రపంచ సంక్షోభం ఏర్పడిందని, దేశంలో కూడా లెక్కలేనంత మందిపై ప్రజలపై ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వంటగ్యాస్ సరఫరా కొరత, సమీప భవిష్యత్తులో ధరలు విపరీతంగా పెరిగే అవకాశం, ప్రయాణాలపై ప్రభావం.. వంటి అంశాలు సామన్య ప్రజల జీవితాన్ని మరింత కష్టతరం చేసే అవకాశం ఉందని ఇమామ్ హెచ్చరించారు. మధ్యఆసియాలో నివసిస్తున్న ప్రవాసులు, తమ బంధువుల గురించి కేరళలోని ప్రజలు తీవ్ర ఆందోళనగా ఉన్నారని అన్నారు. శాంతిని నెలకొల్పడానికి, సంపూర్ణ కాల్పుల విరమణను ప్రకటించడానికి ప్రపంచ నాయకత్వం సుముఖంగా ఉండాలని ఆయన సూచించారు.
కేరళలో ఘనంగా రంజాన్ వేడుకలు
- Advertisement -
- Advertisement -



