భారత్‌కు అమెరికన్ కాంగ్రెస్ సభ్యుల లేఖ
మీ గురించే ఆలోచిస్తున్నామని న్యూయార్క్ మేయర్ నోట్
వాషింగ్టన్ : ఎలాంటి విచారణ లేకుండా ఐదేండ్లుగా జైలులో మగ్గుతున్న జేఎన్‌యూ విద్యార్థి ఉమర్ ఖాలీద్‌కు బెయిల్ మంజూరు చేయాలని, అంతర్జాతీయ చట్ట నిబంధనలకు అనుగుణంగా స్వేచ్ఛగా, సక్రమంగా విచారణ జరిగేలా చూడాలని ఎనిమిదిమంది అమెరికా పార్లమెంట్ సభ్యులు కోరారు. ఈ అంశంపై భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రాకు డిసెంబరు 30న వారు ఒక లేఖ రాశారు. ఉమర్ ఖాలీద్, ఆయన సహ నిందితులపై అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా జ్యుడీషియల్ కార్యకలాపాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఖాలీద్‌ను గుర్తు చేసుకుంటూ న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ విడిగా ఒక నోట్ రాశారు. ఖాలీద్ తల్లిదండ్రులతో తన సమావేశాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకున్నారు. డెమొక్రాట్, టామ్‌లాంటోస్ మానవ హక్కుల కమిషన్ ఉపాధ్యక్షులు జిమ్ మెక్‌గవర్న్ ఎనిమిదిమంది సంతకాలతో కూడిన లేఖను షేర్ చేశారు.
ఈ లేఖపై సంతకాలు చేసిన వారిలో భారతీయ సంతతికి చెందిన కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్ కూడా వున్నారు. డిసెంబరులో ఉమర్ ఖలీద్ తల్లిదండ్రులను తాము కలుసుకున్న విషయాన్ని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. ఉపా కింద ఐదేండ్లుగా బెయిల్ కూడా లేకుండా ఖాలీద్‌ను నిర్బంధించారని, ఇది అంతర్జాతీయ ప్రమాణాలను ఉల్లంఘించడమేనని స్వతంత్ర మానవ హక్కుల నిపుణులు హెచ్చరించారని ఆ లేఖ పేర్కొంది. ఖాలీద్ విషయంలో ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు, చట్టపరమైన ప్రక్రియకు సంబంధించి మానవ హక్కుల సంఘాలు, న్యాయ నిపుణులు, అంతర్జాతీయ మీడియా అనేక ప్రశ్నలు లేవనెత్తాయని వారు గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ అంశాలన్నింటినీ సుప్రీంకోర్టు పరిశీలిస్తోందని తెలిసిందని పేర్కొన్నారు. సోదరి వివాహానికి హాజరయ్యే నిమిత్తం ఖాలీద్‌కు డిసెంబరు 16 నుంచి 29 వరకు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ లభించింది.
మమ్దానీ లేఖ
ఉమర్ ఖాలీద్‌కు న్యూయార్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ స్వయంగా రాసిన నోట్‌లో ”చేదు అనుభవాల గురించి మీరు చెప్పిన మాటలను నేను తరచుగా ఆలోచిస్తూ వుంటాను. వీటి ప్రభావం మనలను ఆవరించకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. మీ తల్లిదండ్రులను కలుసుకోవడం చాలా సంతోషంగా వుంది. మీ గురించే మేమందరం ఆలోచిస్తున్నాం” అని పేర్కొన్నారు. డిసెంబర్‌లో అమెరికాలో ఖాలీద్ తల్లిదండ్రులు పర్యటిస్తున్న సమయంలో వారిని కలుసుకున్న మమ్దానీ ఈ నోట్‌ను అందజేశారు. దాన్ని ఖాలీద్ భాగస్వామి బనోజ్యోత్స్న సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ”జైళ్లు మిమ్మల్ని ఏకాకులను చేయడానికి ప్రయత్నించినప్పుడు,మాటలు ప్రయాణిస్తాయి’ అని మమ్దానీ పేర్కొన్నారు.
నిందితుడికి మద్దతు పలికితే దేశం సహించదు : బీజేపీ
ఉమర్ ఖాలీద్‌కు మద్దతుగా మమ్దానీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ‘మన ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తడానికి ఆయనెవరు? భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే వ్యక్తికి మద్దతుగా నిలుస్తున్నారా?’ అంటూ ఎదురుదాడి చేశారు.



