నవతెలంగాణ-హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లోని పేద మహిళలకు రొమ్ము క్యాన్సర్ పరీక్షలను విస్తృతంగా చేయటంతో పాటుగా వారికి అవగాహనను మరింత పెంచటానికి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్)తో ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేసింది. వైద్య మౌలిక సదుపాయాలకు పరిమిత అవకాశాలు ఉన్న సమాజాల చెంతకు వ్యవస్థీకృత స్క్రీనింగ్ సేవలను చేరువ చేయటం ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించటం మరియు నివారణ ఆరోగ్య సంరక్షణపై ఈ కార్యక్రమం దృష్టి పెడుతుంది.
ఈ భాగస్వామ్యంలో భాగంగా, గ్రాన్యూల్స్ ఇండియా, తమ ఆరోగ్య సంరక్షణ భాగస్వాములు, ఏఐజి హాస్పిటల్స్, ఆసియన్ మెడికల్ ఫౌండేషన్ మరియు యుసి బ్రెస్ట్ ఫౌండేషన్ ద్వారా, వెనుకబడిన వర్గాలను చేరుకోవడానికి రూపొందించబడిన మొబైల్ స్క్రీనింగ్ యూనిట్ అయిన బ్రెస్ట్ హెల్త్ ఎక్స్‌ప్రెస్‌ను ఉపయోగించి సంగారెడ్డి జిల్లాలో రొమ్ము క్యాన్సర్ పరీక్షలు, అవగాహన శిబిరాలను నిర్వహించనుంది.
సెర్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీమతి దివ్య దేవరాజన్, ఐఏఎస్ ; జిల్లా కలెక్టరేట్, కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్- సంగారెడ్డి, శ్రీమతి పి. ప్రావీణ్య , ఐఏఎస్ ; గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి ఉమా చిగురుపాటి; మరియు ఏఐజి హాస్పిటల్స్‌లో ఆంకాలజిస్ట్ & ఆంకోప్లాస్టిక్ సర్జన్ మరియు యుసి బ్రెస్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ ప్రజ్ఞా చిగురుపాటి నర్రా వంటి ముఖ్య ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది.
క్షేత్రస్థాయిలో తన విస్తృతమైన చేరిక, స్వయం సహాయక బృందాల (ఎస్ హెచ్ జి) నెట్‌వర్క్‌ను ఉపయోగించి మహిళలను ఒకే చోటకు తీసుకురావటం, వ్యాధులను ముందుగా గుర్తించటం పై అవగాహన పెంచడం మరియు గ్రామీణ ప్రాంతాలలో భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా సెర్ప్ కీలక పాత్ర పోషిస్తుంది.
సెర్ప్ సీఈఓ శ్రీమతి దివ్య దేవరాజన్, ఐఏఎస్ మాట్లాడుతూ, “గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు నివారణ ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండేలా చూడటం తెలంగాణ ప్రభుత్వానికి కీలక ప్రాధాన్యతగా ఉంది. సెర్ప్ యొక్క క్షేత్ర స్థాయి నెట్‌వర్క్, సమాజ స్థాయిలో మహిళలను చేరుకోవడానికి మాకు వీలు కల్పిస్తుంది. గ్రాన్యూల్స్ ఇండియాతో ఈ భాగస్వామ్యం రొమ్ము క్యాన్సర్ పట్ల అవగాహన, భాగస్వామ్యం , ముందస్తు స్క్రీనింగ్‌ను విస్తృతం చేయడానికి సహాయపడుతుంది. మెరుగైన వైద్య సేవలు సరిగా అందని వర్గాల ప్రజలలో దీర్ఘకాలిక ఆరోగ్య ఫలితాలను సాధించడానికి ఇటువంటి సహకారాలు చాలా కీలకమైనవి”అని అన్నారు.
గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి ఉమా చిగురుపాటి మాట్లాడుతూ, “గ్రాన్యూల్స్ వద్ద , నివారణ ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను అత్యంత అవసరమైన సమాజాలకు విస్తరించడానికి మేము కట్టుబడి ఉన్నాము. సెర్ప్ మరియు మా ఆరోగ్య సంరక్షణ భాగస్వాములతో ఈ భాగస్వామ్యం ద్వారా, గ్రామీణ ప్రాంతాల్లో రొమ్ము క్యాన్సర్ పరీక్షలను మరింత అందుబాటులోకి తీసుకురావడం, ముందస్తు గుర్తింపు యొక్క ప్రాముఖ్యతను పునరుదాటించటం మరియు మహిళల ఆరోగ్యం , శ్రేయస్సుకు అర్థవంతంగా తోడ్పడటం మా లక్ష్యం” అని అన్నారు.
ఏఐజి హాస్పిటల్స్‌లో ఆంకాలజిస్ట్ & ఆంకోప్లాస్టిక్ సర్జన్ మరియు యుసి బ్రెస్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ ప్రజ్ఞా చిగురుపాటి నర్రా మాట్లాడుతూ, “గ్రామీణ ప్రాంత మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ను ముందస్తుగా నిర్ధారించడానికి సరైన అవకాశాలు లేకపోవడం అతిపెద్ద అడ్డంకులలో ఒకటిగా ఉంది. ఇలాంటి భాగస్వామ్యాలు వారికి అవకాశాలను మెరుగుపరచడానికి, మహిళలకు అవసరమైన మార్గదర్శకత్వం మరియు ముందస్తు గుర్తింపు మద్దతును పొందేలా చూసుకోవడంలో మా బాధ్యతను పునరుద్ఘాటిస్తాయి. తెలంగాణ ప్రభుత్వంతో కుదిరిన అవగాహన ఒప్పందం ఒక ముఖ్యమైన ముందడుగు మరియు రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ మరియు అవగాహనను పెంపొందించడానికి మేము చేస్తున్న కృషికి ఒక బలమైన ధృవీకరణ” అని అన్నారు.
సెప్టెంబర్ 2024లో ప్రారంభమైనప్పటి నుండి, గ్రాన్యూల్స్ రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ మరియు అవగాహన కార్యక్రమం 5000 మందికి పైగా మహిళలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించింది మరియు అవగాహన ప్రచారాల ద్వారా వేలాది మంది మహిళలను చేరుకుంది.



