ఐక్యతతోనే హక్కుల సాధన సాధ్యం
బీజేపీ మతోన్మాద సంప్రదాయ పురుషాధిక్య సనాతన మాయలో మహిళలు పడొద్దు
ములాఖాత్
ఐద్వా జాతీయ మహాసభల సందర్భంగా జూలకంటి రంగారెడ్డి గారితో ఇంటర్వ్యూ అనగానే, మహిళలకు సంబంధించిన మహాసభల్లో ఆయన ఇంటర్వ్యూ ఎందుకు అనే ప్రశ్నే ప్రధానంగా ముందు కొచ్చింది. ఇదే ప్రశ్నను నేరుగా ఆయన్నే అడిగితే, పురుషాధిక్య సమాజంలో అలాంటి ప్రశ్నలు సర్వసాధారణం అని కొట్టిపారేశారు. ”మూడు సార్లు ఎమ్మెల్యేగా, కమ్యూనిస్టుపార్టీ నాయకుడిగా అభ్యుదయ దృష్టికోణంలో సమాజాన్ని చూసినప్పుడు మహిళలు పడుతున్న కష్టాలు, కుటుంబాల నిర్వహణ, సామాజిక కట్టుబాట్లు, వివక్ష, ఆశలు, ఆశయాలు, అంతర్మధనాలను బహిరంగంగా పురుషుడే సమాజం దృష్టికి తేవాలి.
ఇది మహిళల్లోని చైతన్యానికి మరింత శక్తినిచ్చి, మహోజ్వల ఉద్యమంగా మారి, హక్కుల సాధనతోపాటు సంప్రదాయ పురుషాధిక్య ప్రపంచాన్ని ప్రశ్నించే గొంతుకగా మారుతుంది” అని తేల్చిచెప్పారు. అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభలు ఈనెల 25 నుంచి 28 వరకు తొలిసారిగా హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. దానికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ మహాసభల ఆహ్వాన సంఘానికి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. ఆయనతో ‘నవతెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ…
నవతెలంగాణ- – బీజేపీ ప్రభుత్వం సనాతన ధర్మం అని ప్రచారం చేస్తున్నది కదా? దీనిలో మహిళల పాత్ర ఏంటి?
జూలకంటి – బీజేపీ చెప్తున్న సనాతన ధర్మం మహిళల్ని వంటింటి కుందేళ్ళుగా మార్చే ధర్మం. దేవుడు, మతం, సంప్రదాయం పేరుతో మహిళల్ని పూజ, వంట గదులకు పరిమితం చేసే కుట్రలకు పాల్పడుతున్నారు. సంప్రదాయాల పేరుతో మహిళలు ఇలాంటి కుట్రపూరిత మతోన్మాదుల ఉచ్చులో పడొద్దు. సమాజంలో సగభాగం ఉన్న మహిళలు కచ్చితంగా అభ్యుదయభావాలతో దేశ ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములు కావాలి. కుటుంబం పేరుతో పురుషులపై ఆధారపడే తత్వాన్ని విడనాడాలి. తమ కాళ్లపై తాము నిలబడి ఆర్థిక స్వావలంబన సాధించాలి.
దేశంలో ప్రస్తుతం మహిళల స్థితిగతులు ఎలా ఉన్నాయి?
మహిళలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఒంటరి మహిళల సంఖ్య పెరుగుతోంది. స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ మహిళా వ్యతిరేకిగా వ్యవహరిస్తున్నారు. వివాహం చేసుకొని, తన భార్యను దూరం పెట్టేశాడు. పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవం, అయోధ్యలో రామమందిరం వంటి కార్యక్రమాల్లో రాష్ట్రపతిగా ఉన్న ఆదివాసీ మహిళను ఆహ్వానించకుండా అవమానం చేసి, వివక్షను ప్రదర్శించారు. దేశంలో మద్యం ఏరులై పారుతోంది. భర్తలు అర్థాయుష్షుతో మరణిస్తున్నారు. మహిళలు ఒంటరిగా మిగిలిపోతున్నారు. పిల్లల్ని పెంచడం కోసం నానా అవస్థలు పడుతున్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన పదకొండున్నరేండ్లలో మహిళల స్వేచ్ఛ, సమానత్వం, హక్కుల సాధనలో దేశం మరో వందేండ్లు వెనక్కి వెళ్లింది.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల పరిస్థితి ఏంటి?
మోడీ హయాంలో అదో బ్రహ్మపదార్థంగా మారింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను మనువాదాన్ని విశ్వసించే బీజేపీ ఓట్‌బ్యాంక్ రాజకీయాలకే వాడుకుంటోంది. దాన్ని ఎన్నికల అజెండాగా మార్చారు. ఈ బిల్లును ఆమోదించి అమలును అటకెక్కించారు. కేంద్రానికి మహిళా రిజర్వేషన్లు అమలు చేసే చిత్తశుద్ధి లేదు.
మహిళా రిజర్వేషన్ల అమలు కోసం ఏం చేయాలి?
మహిళలు చైతన్యవంతులై సంఘటితం కావాలి. తమ సమస్యల్ని తామే పరిష్కరించుకోవాలి. సమాజంలో సగభాగం ఉన్న మహిళలు ఐక్యంగా ఉద్యమిస్తే ఏ ప్రభుత్వాలైనా దిగిరాక తప్పదు. మొదట వారి సమస్యల్ని వారు గుర్తించాలి. కేవలం పోరాటాలు మాత్రమే మహిళల సమానత్వాన్ని సాధిస్తాయి. వారు ఎవరి దయాదాక్షిణ్యాలపైనా ఆధారపడాల్సిన అవసరం లేదు.
ఇప్పుడున్న హిందూత్వ భావజాల పరిస్థితుల్లో ఇది సాధ్యమేనా?
కచ్చితంగా సాధ్యమే. అయితే భిన్న సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహరాలు, కట్టుబాట్లు వంటివన్నీ వేర్వేరు అనే వాస్తవాన్ని మహిళలు గుర్తించాలి. ‘జై శ్రీరాం’ అనే ఒక్క నినాదం కడుపునింపదనే వాస్తవాన్ని గ్రహించాలి. అలాంటి సెంటిమెంట్ నినాదాలతోనే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటున్నది. ఈ విషయాల్ని గమనించాలి. దేశంలో నిత్యవసరవస్తువుల ధరలు పెరిగాయి. జీత భత్యాలు తగ్గాయి. నిరుద్యోగ యువతకు ఉపాధి లేదు. ప్రజలకు ఆర్థిక అవసరాలు పెరిగాయి. ఈ దశలో పాలకులపై తిరగబడే ధైర్యం ప్రజల్లో రావాలే తప్ప, ఆకాశంవైపు చూస్తూ చేతులెత్తి మొక్కే పరిస్థితులు రాకూడదు. ఆ దిశగా మహిళలు చైతన్యవంతులు అవ్వాలి. ‘ఐద్వా’ జాతీయ మహాసభలు ఈ దిశగానే భవిష్యత్ ఉద్యమ కార్యాచరణకు మార్గనిర్దేశనం చేస్తాయి.
రాష్ట్రంలో మహిళల పరిస్థితులు ఎలా ఉన్నాయి?
దేశంలోని పరిస్థితులకంటే రాష్ట్రంలో మహిళల పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. ఇక్కడా అవే సమస్యలు, అదే వివక్ష కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీల పేరుతో మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు ఇంకా పూర్తిగా అమలుకాలేదు. ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో కూడా పెట్టారు. ఏమైంది? రాష్ట్రంలో ఇంటిపనివారల చట్టం పోరాడి సాధించుకున్నాం. కానీ దాని అమలులో ప్రభుత్వం చిత్తశుద్ధి చూపట్లేదు. ఇలా రాష్ట్రంలో కూడా మహిళల కోసం చేసిన అనేక చట్టాలు కాగితాల్లో ఉన్నాయి తప్ప, ఆచరణలో లేవు. వాటి అమలులో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి లేదు.
ఐద్వా జాతీయ మహాసభల ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి?
మహాసభల నిర్వహణకు ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తున్నది. విరివిగా విరాళాలు ఇస్తున్నారు. మహిళా సంఘం ప్రాధాన్యతను ప్రోత్సహిస్తున్నారు. వెయ్యిమంది కార్యకర్తలు నెలరోజులుగా ఈ మహాసభల నిర్వహణ కోసం శ్రమిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 50వేల కుటుంబాలను స్వయంగా కలిశాం. మహాసభల నిర్వహణలో వేర్వేరు పనుల కోసం 500 మంది వాలంటీర్లతో 25 కమిటీలు ఏర్పాటుచేశాం. మహాసభలకు దేశవ్యాప్తంగా 850 నుంచి 900 మంది ప్రతినిధులు హాజరవుతారు.
నేటి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి?
సమాజంలో సగభాగం మహిళలు ఉన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు దాటినా, ఇప్పటికీ మహిళలపై దాడులు, హింస, అఘాయిత్యాలు, అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. పోలీస్టేషన్లలో కేసులు పెట్టేందుకు కూడా వెనకాడుతున్నారు. కేసులు పెట్టినా సత్వర న్యాయం లభించట్లేదు. ఏండ్ల తరబడి న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. కేసులు పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో ఉంటున్నాయి. మహిళలకు పని ప్రదేశాల్లోనూ భద్రత లేదు. దేశంలో మహిళలు ఒంటరిగా వీధుల్లో తిరిగే పరిస్థితులు లేవు.
ఐద్వా జాతీయ మహాసభలు ఈసారి హైదరాబాద్‌లో జరగడానికి ప్రధాన కారణం ఏంటి?
ఉమ్మడిరాష్ట్రం సహా ఎప్పుడూ ‘ఐద్వా’ జాతీయ మహాసభలు తెలంగాణలో జరగలేదు. తొలిసారిగా ఈసారి హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. తెలంగాణ పోరాటాల గడ్డ. అసమానతలపై ధైర్యంగా తిరుగుబాటు చేసిన చరిత్ర ఈ భూమికి ఉంది. సాయుధ రైతాంగ పోరాటం సహా అనేక ఉద్యమాలు ఈ గడ్డపై జరిగాయి. ఆ పోరాటాల్లో చాకలి ఐలమ్మ, మలు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి వంటి అనేకమంది మహిళలు భాగస్వాములుగా ఉన్నారు. ఆ స్ఫూర్తిని కొనసాగించేందుకే ఈసారి జాతీయ మహాసభలు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి.
వీటికి పరిష్కారాలు ఎలా?
మహిళా సమస్యల పరిష్కారంపై పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడమే ప్రధాన కారణం. వారిని ఓట్‌బ్యాంక్‌గా చూస్తున్నారే తప్ప, వారిని సమాజాభివృద్ధిలో భాగస్వాములుగా గుర్తించేందుకు సిద్ధంగా లేరు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ దుస్థితి మరింత పెరిగింది. గతంలో వామపక్ష ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో మహిళా హక్కుల కోసం అనేక చట్టాలు చేసి, అమలు చేసి చూపించాం. ఇప్పుడా పరిస్థితి లేదు.



