Monday, October 6, 2025
E-PAPER
Homeజాతీయండార్జిలింగ్‌లో పెను విషాదం

డార్జిలింగ్‌లో పెను విషాదం

- Advertisement -

కొండచరియలు విరిగిపడి 18 మంది మృతి
అనేక మందికి గాయాలు
భారీ వర్షాలకు కొట్టుకుపోయిన ఇండ్లు, ధ్వంసమైన రోడ్లు
చిక్కుకున్న వందలాది పర్యాటకులు

తీవ్రమైన జాతీయ విపత్తుగా ప్రకటించాలి : సీపీఐ(ఎం)
బాధితులకు అండగా నిలవండి : ఎంఎ బేబీ

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర ప్రాంతంలో భారీ వర్షాలు అతలాకుతలం సృష్టించాయి. ముఖ్యంగా ప్రముఖ పర్యాటక ప్రాంతమైన డార్జిలింగ్‌ జిల్లాలో శనివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని పలుప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి 18 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులేనని సమాచారం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇండ్లు కొట్టుకుపోవడంతో పాటు రోడ్లు దెబ్బతిన్నాయి. రోడ్లు కొట్టుకు పోవడంతో వందలాది మంది పర్యాటకులు డార్జిలింగ్‌లో చిక్కుకుపోయారు. అలాగే, అనేక గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. మరోవైపు, సోమవారం కూడా డార్జిలింగ్‌, కాలింపాంగ్‌తో సహా పశ్చిమ బెంగాల్‌ అనేక ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరింది.
ఆదివారం మిరిక్‌ హిల్స్‌, డార్జిలింగ్‌ హిల్స్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి.

సమాచారం తెలిసిన వెంటనే ఎన్‌డీ ఆర్‌ఎఫ్‌ బృందాలు, జిల్లా యంత్రాంగం, పోలీసులు సంఘటనా స్థలాలకు చేరుకుని సహాయక కార్యక్రమాలు ప్రారంభించాయి. సర్సాలీ, జస్బిర్గాన్‌, మిరిక్‌ బస్తీ, ధార్‌ గాన్‌ (మెచి), నాగరకత, మిరిక్‌ లేక్‌ ఏరియా వంటి ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడగా, మిరిక్‌ హిల్స్‌ తీవ్రంగా ప్రభావితమయింది. ఇక్కడ 11 మంది మరణించగా, ఏడుగుర్ని రక్షించారు. అలాగే డార్జిలింగ్‌ హిల్స్‌లో ఏడు మంది మరణించారు. ఆదివారం సాయంత్రం వరకూ కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నాగరకతలోని ధార్‌గావ్‌లో శిథిలాల నుంచి దాదాపు 40 మందిని రక్షించారు. ఇక్కడ అనేక నివాసాలు వర్షాలకు నేలమట్టమ్యాయి. రాష్ట్ర మంత్రి ఉదయన్‌ పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. కొండచరియలు విరిగిపడ్డంతో మిరిక్‌-సుఖియాఫోఖ్రి రహదారితో సహా అనేక కీలక మార్గాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కమ్యూనికేషన్‌ లైన్లు తెగిపోయాయి.

నేడు ముఖ్యమంత్రి పర్యటన
డార్జిలింగ్‌లో పరిస్థితిని అంచనా వేయడానికి సోమవారం ఆ ప్రాంతంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పర్యటిం చనున్నారు. సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోజ్‌ పంత్‌తో ఉత్తర బెంగాల్‌కు బయలుదేరి, అక్కడ సిలిగురి నుంచి పరిస్థితిని పర్యవేక్షించనున్నారు. ఆదివారం మమతా మాట్లాడుతూ భూటాన్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతంలో నీరు చేరిందని, ప్రకృతి వైపరీత్యాలు మన నియంత్రణకు మించివని అన్నారు.

ప్రధాని విచారం
కొండచరియలు విరిగిపడిన ప్రమాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. డార్జిలింగ్‌, పరిసర ప్రాంతాల్లో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనలో ప్రాణనష్టం సంభవించడంపై తీవ్ర బాధ కలిగిందని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కూడా ఈ ప్రమాదంపై విచారం వ్యక్తంచేశారు. సంఘటనా స్థలాలకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ దళాలను తరలించామని, అవసర మైతే మరిన్ని దళాలను సిద్ధంగా ఉంచుతామని చెప్పారు.

తీవ్రమైన జాతీయ విపత్తుగా ప్రకటించాలి : సీపీఐ(ఎం)
డార్జిలింగ్‌లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడిన ప్రమాదాన్ని ‘తీవ్రమైన జాతీయ విపత్తు’గా ప్రకటించాలని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేసింది. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం, తగిన పరిహారం అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. డార్జిలింగ్‌, పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయని, దీని వలన అనేక మంత్రి ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది నిరాశ్రయులయ్యారని, అలాగే ఈ ప్రమాదంలో యావత్తు గ్రామాలు, రోడ్లు కూడా కొట్టుకునిపోయాయని ప్రకటనలో తెలిపింది. బాధిత కుటుంబాలకు తీవ్ర సానుభూతిని, సంఘీభావాన్ని సీపీఐ(ఎం) ప్రకటించింది.

బాధితులకు అండగా నిలవండి : ఎంఏ బేబీ
డార్జిలింగ్‌ కొండచరియలు విరిగినపడిన ప్రమాదం నేపథ్యంలో బాధితులకు అండగా నిలవాలని ప్రజలకు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ విజ్ఞప్తి చేశారు. ఈ ఆపద సమయంలో బాధితులకు సంఘీభావం, మద్దతు అందించాలని కోరారు. ప్రమాదం వలన జరిగిన ప్రాణనష్టం, భారీ విధ్వంసం పట్ల తీవ్ర విచారాన్ని ఎంఎ బేబీ వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ ఘటనను తీవ్రమైన జాతీయ విపత్తుగా ప్రకటించి తక్షణ సహాయం, తగిన పరిహారం అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -