వైట్‌హౌస్‌లో కాల్పుల నేపథ్యంలో ట్రంప్ కీలక నిర్ణయం
థర్డ్ వరల్డ్ కంట్రీస్ నుంచి శాశ్వతంగా వలసలు నిలిపివేత
ఫెడరల్ బెనిఫిట్స్, సబ్సిడీలు నిలిపేస్తామంటూ ప్రకటన
వాషింగ్టన్ : అమెరికాలో వైట్‌హౌస్ సమీపంలో జరిగిన కాల్పుల ఘటన అనంతరం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 19 దేశాలకు చెందిన గ్రీన్ కార్డ్ హౌల్డర్స్‌ను మరోసారి సమీక్షించాలని ప్రకటించారు. శ్వేతసౌధం సమీపంలో జరిగిన కాల్పుల్లో గాయపడిన మహిళా నేషనల్‌గార్డ్ సారా బెక్‌స్ట్రోమ్ మరణించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. మరొకరు ప్రాణాల కోసం పోరాడుతున్నారని వెల్లడించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ కాల్పుల అనంతరం అఫ్గానిస్తాన్‌కు చెందిన నిందితుడిని భద్రతాదళా లు అదుపులోకి తీసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే అఫ్గాన్‌తో సహా మరో 18 దేశాలకు చెందిన గ్రీన్ కార్డ్ హౌల్డర్స్‌ను సమీక్షించనున్నట్టు యూఎస్ సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో వెల్లడించారు.
అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్టు తెలిపారు. తక్షణమే అమలు చేయాలని ఆదేశించారు. ‘ఈ కాల్పుల ఘటన, గత నాలుగేండ్లుగా బైడెన్ ప్రభుత్వం కీలక భద్రతా తనిఖీలను బలహీనపరిచిందనే వాస్తవాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ప్రమాదకర దేశాల నుంచి వలసదారులను త్వరితగతిన అమెరికాలో స్థిరపరచడానికి వారు ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ట్రంప్ ప్రభుత్వం దీనికి విరుద్ధమై న విధానాన్ని తీసుకుంటుంది’ అని జోసెఫ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. గతంలో యూఎస్‌కు వచ్చే 12 దేశాల పౌరుల రాకపై ట్రంప్ నిషేధం విధిస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. అందులో అఫ్గానిస్తాన్, ఇరాన్, యెమెన్, మయన్మార్, చాద్, కాంగో, ఈక్వెటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, లిబియా, సోమాలియా, సూడాన్ దేశాలు ఉన్నాయి. వీటితో పాటు మరో ఏడు దేశాల ప్రయాణికులపైనా పాక్షికంగా నిషేధం విధించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలన సమయంలో ఆయా దేశాల నుంచి వచ్చిన వారిపై తాజాగా ట్రంప్ పరిపాలన సిబ్బంది సమీక్ష నిర్వహించనున్నట్టు సమాచారం.
వీసాదారులు అరెస్ట్!
ఇదిలా ఉండగా, వీసాదారులను గ్రీన్ కార్డు ఇంటర్వ్యూలు అని పిలిచి భద్రతాధికారులు అరెస్ట్‌లు చేస్తున్నట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పలు ఘటనల గురించి కథనాల్లో పేర్కొన్నాయి. శాన్‌డియాగోలోని యూఎస్ సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ కార్యాలయంలో గ్రీన్ కార్డు ఇంటర్వ్యూ కోసం వచ్చిన ఓ వ్యక్తితో పాటు వారి అమెరికన్ భాగస్వామిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. వీసా గడువు ముగిసినా కూడా ఇంకా దేశంలోనే ఉన్నవారినే లక్ష్యంగా చేసుకొని ఈ అరెస్టులు జరుగుతున్నాయని ఇమిగ్రేషన్ న్యాయవాది సమన్ నస్సేరి పేర్కొన్నారు. ఐసీఈ, యూఎస్‌సీఐఎస్‌లు ఒక విధానాన్ని అమలు చేస్తున్నాయిని తెలిపారు. వీటి కార్యాలయాల్లో వీసా గడువు ముగిసిన వారిని అదుపులోకి తీసుకుంటున్నాయని చెప్పారు.
గ్రీన్‌కార్డు ఇంటర్వ్యూల కోసం అని పిలిపించి, ఐసీఈ అరెస్టులు చేస్తోందని అన్నారు. గత వారం ఇలాగే ఇంటర్వ్యూల కోసం వచ్చిన తన ఐదుగురు క్లయింట్‌లను అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. వారికి ఎలాంటి నేర చరిత్ర లేదని, గతంలోను ఎలాంటి అరెస్టులు జరగలేదని స్పష్టంచేశారు. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా వారు ఇంకా దేశంలోనే ఉన్నారనే కారణంతో ఈ అరెస్టులు చేశారన్నారు. వారంతా యూఎస్ పౌరులను వివాహం చేసుకున్నవారేనని వెల్లడించారు. మరో ఇమిగ్రేషన్ న్యాయవాది హబీబ్ హస్బిని కూడా తన వద్దకు ఇలాంటి కేసులు చాలా వచ్చాయన్నారు. శాన్‌డియాగోలోని యూఎస్‌సీఐసీ కార్యాలయం నుంచి ఇలాంటి నిర్బంధ కేసులు వస్తున్నట్టు తెలిపారు. గ్రీన్‌కార్డు ఇంటర్వ్యూల కోసం వెళ్లే అభ్యర్థులకు హబీబ్ సూచనలు జారీ చేశారు. అయితే అరెస్టులను ఐసీఈ సమర్థించుకున్నట్టు తెలుస్తోంది.
మరో బాంబు పేల్చిన ట్రంప్
పేద దేశాల (థర్డ్ వరల్డ్ దేశాలు) నుంచి అగ్రరాజ్యానికి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. తద్వారా అమెరికాలోని అక్రమ ప్రవేశాలను అడ్డుకోవడానికి వీలు కల్పిస్తామని అన్నారు. అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో కాల్పుల ఘటన నేపథ్యంలో ట్రంప్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఫెడరల్ బెనిఫిట్స్, సబ్సిడీలు నిలిపేస్తాం
జో బైడెన్ ఆటోపెన్‌తో సంతకం చేసిన లక్షల మంది అక్రమ అడ్మిషన్లను రద్దు చేయనున్నామని ట్రంప్ ప్రకటించారు. అమెరికాకు ఆస్తి కాని లేదా మన దేశాన్ని ప్రేమించని వ్యక్తులను ఇక్కడి నుంచి పంపించేస్తామని వెల్లడించారు. అమెరికాయేతర పౌరులందరికీ ఫెడరల్ ప్రయోజనాలు, సబ్సిడీలను నిలిపివేస్తామని స్పష్టం చేశారు. దేశ ప్రశాంతతకు భంగం కలిగించే, అమెరికా భద్రతకు ముప్పుగా మారే వారిని బహిష్కరిస్తామని పేర్కొన్నారు. రివర్స్ మైగ్రేషన్ వలస విధానంతోనే ఈ లక్ష్యాలను సాధించగలమని అభిప్రాయపడ్డారు.
థర్డ్ వరల్డ్ కంట్రీస్ నుంచి శాశ్వతంగా వలసలు నిలిపివేత’
అమెరికా సాంకేతికంగా ముందుకెళ్తున్నప్పటికీ యూఎస్ ఇమిగ్రేషన్ విధానం ఆ ప్రయోజనాలను, చాలామంది జీవన పరిస్థితులను దెబ్బతీస్తోందని ట్రంప్ తెలిపారు. అందుకే అమెరికా వ్యవస్థ పూర్తిగా కోలుకునేందుకు వీలుగా థర్డ్ వరల్డ్ దేశాల నుంచి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తున్నామని ప్రకటించారు. చట్టవిరుద్ధంగా అగ్రరాజ్యంలోకి ప్రవేశించినవారిని తగ్గించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. శరణార్థుల భారం అమెరికాలో సామాజిక అస్తవ్యస్తతకు ప్రధాన కారణమని ఆరోపించారు. అమెరికాలో జన గణన ప్రకారం విదేశీ జనాభా 53 మిలియన్లు. వీరిలో ఎక్కువ మంది సంక్షేమం కోసం విఫలమైన దేశాల్లోని జైళ్లు, ముఠాలు, మాదకద్రవ్యాల కార్టెల్‌ల నుంచి వచ్చారు. గ్రీన్ కార్డ్ తో 30,000 అమెరికన్ డాలర్లు సంపాదించే వలసదారుడి ఫ్యామిలీ ఏటా 50,000 అమెరికన్ డాలర్ల ఫెడరల్ ప్రయోజనాలు, సబ్సిడీలను పొందుతోంది. ఈ శరణార్థుల భారం అమెరికాలో సామాజిక అస్తవ్యవస్తతకు ప్రధాన కారణం” అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో పేర్కొన్నారు.



