– లోక్‌సభలో 12, రాజ్యసభలో 15 బిల్లులు ఆమోదం
– లోక్‌సభలో మొత్తం 37 గంటల పాటు చర్చ
– రాజ్యసభలో 41 గంటలు..
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంట్ వర్షకాల సమావేశాలు తుడిచిపెట్టుకుపోయాయి. బీహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)పై చర్చకు ప్రభుత్వం సిద్ధపడకపోవడంతో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు వాయిదాల పర్వం తొక్కాయి. అయినప్పటికీ ప్రతిపక్షాల ఆందోళనల మధ్యే మూజువాణి ఓటుతో పార్లమెంట్ ఉభయ సభల్లో 15 బిల్లులు ఆమోదం పొందాయి. జులై 21న ప్రారంభమైన పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ఆగస్టు 21తో ముగిశాయి. ఈ సమావేశాలు 32 రోజుల పాటు నిర్వహించగా, అందులో 21 రోజులు సభా కార్యకలాపాలు జరిగాయి. లోక్‌సభలో 14 బిల్లులు ప్రవేశపెట్టగా, 12 బిల్లులు ఆమోదం పొందాయి. రాజ్యసభలో 15 బిల్లులకు ఆమోదం లభించింది. ఉభయ సభల్లో మొత్తం 15 బిల్లులు ఆమోదం పొందాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు.
గురువారం పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ముగిసిన తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, ఎల్.మురుగన్‌లతో కలిసి విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడారు. ”పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రత్యేక చర్చ జరిగింది. లోక్‌సభలో 18.41 గంటల పాటు చర్చ జరగగా, 73 మంది చర్చల్లో పాల్గొన్నారు. రాజ్యసభలో 16.25 గంటల పాటు చర్చ జరగగా, 65 మంది సభ్యులు చర్చల్లో పాలు పంచుకున్నారు. అలాగే మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన ఆగస్టు 13 నుంచి మరో ఆరు నెలల పాటు పొడిగించే తీర్మానాన్ని ఆమోదించాం. లోక్‌సభలో ‘వికసిత్ భారత్’ కోసం అంతరిక్ష కార్యక్రమం కీలక పాత్ర – అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారతదేశపు మొదటి వ్యోమగామిపై ప్రత్యేక చర్చ ప్రారంభమైంది. కానీ సభలో నిరంతర అంతరాయం కారణంగా, చర్చ పూర్తి కాలేదు. దీంతో లోక్‌సభ ఉత్పాదకత సుమారు 31 శాతం, రాజ్యసభ ఉత్పాదకత సుమారు 39 శాతంగా ఉంది. లోక్‌సభలో ఈ సమావేశంలో మొత్తం 120 గంటల్లో 37 గంటలు మాత్రమే చర్చలు జరిగాయి. రాజ్యసభలో చర్చలు 41.15 గంటలు మాత్రమే జరిగాయి” అని ఆయన స్పష్టం చేశారు.
పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన బిల్లులు
1. ది బిల్స్ ఆఫ్ లాడింగ్ బిల్లు
2. సముద్ర బిల్లు ద్వారా వస్తువుల రవాణా బిల్లు
3. కోస్టల్ షిప్పింగ్ బిల్లు
4. మణిపూర్ వస్తువులు, సేవల పన్ను (సవరణ) బిల్లు
5. మణిపూర్ కేటాయింపు (నం.2) బిల్లు
6. మర్చంట్ షిప్పింగ్ బిల్లు
7. గోవా రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాలలో
షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్య పునర్వ్యవస్థీకరణ బిల్లు
8. జాతీయ క్రీడా పాలన బిల్లు
9. జాతీయ డోపింగ్ నిరోధక (సవరణ) బిల్లు
10. ఆదాయపు పన్ను బిల్లు
11. పన్ను చట్టాల (సవరణ) బిల్లు
12. ఇండియన్ పోర్ట్స్ బిల్లు
13. గనులు మరియు ఖనిజాలు
( అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు
14. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (సవరణ) బిల్లు
15. ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్, నియంత్రణ బిల్లు
లోక్‌సభ సెలక్ట్ కమిటీకి పంపిన బిల్లులు
1. దివాలా, దివాలా కోడ్ (సవరణ) బిల్లు
2. జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు
జెపీసీకి పంపిన బిల్లులు
1. రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు
2. కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వం (సవరణ) బిల్లు
3. జమ్మూకాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు
లోక్‌సభ ఉపసంహరించుకున్న బిల్లు
1. సెలెక్ట్ కమిటీ నివేదించిన ఆదాయపు పన్ను బిల్లు