రూ.1.40 కోట్ల నిధులు మంజూరు..
ఉత్తర్వులు జారీ
అసెంబ్లీలో ప్రస్తావించిన రెండు రోజుల్లోనే స్పందన..
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కృషికి ఫలితం..
నవతెలంగాణ – వేములవాడ
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గుడి చెరువులో బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రూ.1 కోటి 40 లక్షల నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
వేములవాడకు వచ్చే భక్తులు, పర్యాటకులకు మరింత ఆహ్లాదకరమైన అనుభూతి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఈ ప్రతిపాదనను ప్రభుత్వ దృష్టికి పలు మార్లు తీసుకెళ్లారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లోనూ గుడి చెరువులో బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అదే సమయంలో జిల్లా కలెక్టర్ కూడా సంబంధిత ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు.
ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన మంత్రి జూపల్లి కృష్ణారావు త్వరలోనే బోటింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీకి అనుగుణంగా బుధవారం (Go.Rt.No.10, తేదీ: 07-01-2026) గుడి చెరువులో బోటింగ్ సౌకర్యం ఏర్పాటు కోసం రూ.1.40 కోట్ల నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజాన్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నిర్ణయంతో వేములవాడ పట్టణ ప్రజలు, ఆలయానికి వచ్చే భక్తులు, పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బోటింగ్ ఏర్పాటు వల్ల పర్యాటక ఆకర్షణ మరింత పెరగడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వారు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే వేములవాడ పట్టణంలో రూ.150 కోట్లతో రాజన్న ఆలయ అభివృద్ధి–విస్తరణ పనులు, రూ.47 కోట్లతో రోడ్డు వెడల్పు పనులు శరవేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో, గుడి చెరువులో బోటింగ్‌కు నిధుల మంజూరు వేములవాడను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా మరో కీలక అడుగుగా పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు.
అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావించిన రెండు రోజుల్లోనే నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావులకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. వేములవాడ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన వెల్లడించారు.



