నవతెలంగాణ – జన్నారం
ప్రభుత్వ పాఠశాలల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించేందుకు కేంద్ర విద్యాశాఖ ‘స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయ రేటింగ్’ పథకాన్ని అమలు చేస్తోందని మండలంలోని చింతగూడ జడ్పిహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వరరావు సిఆర్పి నరసయ్య అన్నారు. గురువారం చింతగూడ ప్రభుత్వ పాఠశాలలో నీటి వసతి, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, పర్యావరణహిత పరిసరాలు, మొక్కలు, చెట్లతో పచ్చదనంతో విలసిల్లేలా స్కూల్ ప్రాంగణాలు మేటిగా ఉండేలా ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది అన్నారు.
జాతీయ స్థాయిలో ఎంపికైతే అలాంటి ప్రభుత్వ పాఠశాలలకు నగదు ప్రోత్సాహకాన్ని అందించి ప్రోత్సహించనుందన్నారు. జిల్లా స్థాయి ఎంపికకు 3 స్టార్ రేటింగ్‌కు 6 పాఠశాలలు, 4 చుక్కలకు రాష్ట్రస్థాయిలో 20, 5 చుక్కల రేటింగ్‌కు జాతీయ స్థాయిలో 200 పాఠశాలలను ఎంపిక చేయనున్నారు. ఈ విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నిర్దేశిత పోర్టల్‌లో పాఠశాలల హెచ్ఎంలు(హెడ్మాస్టర్లు) వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. నీటి వసతి, టాయిలెట్లు, విద్యార్థులు చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవడం, ప్రవర్తన మార్పు, సామర్థ్యాల నిర్మాణం(కెపాసిటీ బిల్డింగ్), నిర్వహణ, తదితర 60 అంశాలు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఎంపికైన పాఠశాలలకు లక్ష రూపాయల చొప్పున నగదు అందజేస్తారన్నారు. అందుకోసం ప్రభుత్వ పాఠశాలల హెడ్మాస్టర్లు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేష్ రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.



