– కేంద్రంతోపాటు కలిపి అన్నదాతకు డబ్బులిస్తాం
– ఉచిత గ్యాస్ సిలిండర్ల డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే యోచన : ముఖ్యమంత్రి చంద్రబాబు
– ‘హంద్రీనీవా’ కాలువ వెడల్పు పనుల పరిశీలన
అనంతపురం ప్రతినిధి : ఎన్నికల హామీ మేరకు త్వరలోనే తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. ఉచిత గ్యాస్ సిలిండర్లకు నగదును నాలుగు నెలలకు ఒకసారి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే ఆలోచన చేస్తున్నట్టు వెల్లడించారు. శుక్రవారం ఆయన అనంతపురం జిల్లాలో పర్యటించారు. వజ్రకరూరు మండలం ఛాయపురం గ్రామం వద్ద హంద్రీనీవా కాలువ వెడల్పు పనులను పరిశీలించారు. వీటిని ఎప్పటిలోగా పూర్తి చేస్తారని అధికారులను అడిగారు. 50 రోజుల్లోపు పూర్తి చేస్తామని హంద్రీనీవా ఎస్‌ఇ బదులిచ్చారు. ప్రస్తుతం 1,500 క్యూసెక్కులు మాత్రమే నీటి ప్రవాహం కాలువ గుండా ఉందని, వెడల్పు పూర్తయితే 3,500 క్యూసెక్కుల వరకు నీటిని తీసుకునే అవకాశం ఉందని ముఖ్యమంత్రికి ఎస్‌ఇ తెలియజేశారు.
అనంతరం ఛాయపురం వద్ద నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. దీనికి ముందు పాకిస్తాన్‌తో జరుగుతోన్న యుద్ధంలో వీరమరణం పొందిన శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన సైనికుడు మురళీనాయక్‌కు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళి అర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం ‘తల్లికి వందనం’ పథకం కింద సాయం అందిస్తామని, చదువుతున్న పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తామని తెలిపారు. అన్నదాతలకు ఇస్తామని చెప్పిన నగదు ప్రోత్సాహకాన్ని కేంద్రంతో కలిపి ఇస్తామన్నారు. నిరు ద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్‌సిని నిర్వహిస్తున్నామని తెలిపారు. సాగునీటి రంగానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోం దన్నారు.
పోలవరం నుంచి బనకచర్లకు నీటి మళ్లించే ఆలోచన చేశామని తెలిపారు. ఇందుకోసం 3,089 కిలోమీటర్ల మేర కాలువలు తీయాల్సి ఉంటుం దన్నారు. ఇందుకు రూ.81 వేల కోట్లు అవసరమని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 300 టిఎంసిల నీళ్లను మళ్లించవచ్చన్నారు. తద్వారా రాష్ట్రంలో కరువు అన్నది ఉండబోదని పేర్కొన్నారు. హంద్రీనీవాను పూర్తి చేస్తే రాయలసీమ జిల్లాల్లో ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. గడిచిన ఐదేళ్లలో వైసిపి ప్రభుత్వం సాగునీటిని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. అంతకు ముందు టిడిపి హయాంలో 2014-2019 మధ్య ఐదేళ్లలో సాగునీటికి రూ.72 వేల కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు. ఇందులో రాయలసీమ జిల్లాల్లో రూ.12 వేల కోట్లు నిధులు ఖర్చు చేశామన్నారు. ఇప్పుడు హంద్రీనీవాకు రూ.3500 కోట్లు ఖర్చు పెడుతున్నామని తెలిపారు.
ప్రాజెక్టు పనులను వేగవంతంగా చేశామన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి పాలన సాగిస్తున్నామని తెలిపారు. పి-4 ద్వారా పేదలను గుర్తించి వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్థికంగా అభివృద్ధి చెందిన వారు మార్గదర్శకాలుగా ఉంటూ బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని, ఇందుకు ఆర్థికంగా ఉన్నవారు ముందుకు రావాలని కోరారు. ఛాయపురంలో 96 బంగారు కుటుంబాలు ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేయడానికి మార్గదర్శకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, ఉమ్మడి అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.
త్వరలోనే తల్లికి వందనం
- Advertisement -
- Advertisement -