దేశనాయకుల అబద్దాల్ని బట్టబయలు చేస్తున్న గ్రోక్‌!

Grok”దేశాన్ని చూస్తుంటే భయమేస్తోంది”- అని అన్నారు నొబెల్‌ గ్రహీత ఆమర్త్యసేన్‌! దేశంలో కలిసిమెలసి జీవిస్తున్న హిందూముస్లింల మధ్య చీలికకు కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్ని స్తున్నాయ”ని మన అమర్త్యసేన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమయంలోనే ప్రశ్నించే గొంతులు అవసరమని, అయితే ప్రశ్నించే వారిని కేంద్ర ప్రభుత్వం జైల్లో వేస్తోంది. అనేక రకాల హింసలకు గురిచేస్తోంది. లేదా సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో చంపేస్తూ ఉందని ఆయన అన్నారు.
న హిందు బురాహై న ముసల్మాన్‌ బురా హై
ఓ దోనోంకొ ఆపస్‌ మె లడారహా హై, ఓ సైతాన్‌ బురా హై
(హిందువులు చెడ్డవారు కాదు, ముస్లింలూ చెడ్డవారు కాదు-
చెడ్డవారెవరంటే- ఆ ఇద్దరికీ కొట్లాటలు పెట్టే సైతానులు చెడ్డవారు)
ఓస్‌ దిన్‌ గీతా ఔర్‌ ఖురాన్‌ కొ జాన్‌ జావో గే
ఉస్‌ దిన్‌ దంగా కర్‌వానే వాలోంకో పహచాన్‌ జావొగే
(భగవద్గీత, ఖురాన్‌లలో ఏముందో తెలుసుకున్న రోజు,
ఈ అల్లర్లూ, దొమ్మీలు జరిపించే వారెవరో తెలుసు కుంటావు)
ఇలా కవులు సమాజాన్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. జాగృతం చేస్తూనే ఉన్నారు. సమాజం వాటిని స్వీకరించే స్థితిలో ఉండాలి కదా?
ఒక కవిత బుల్లెట్‌ను ఆపలేదు. ఒక నవల బాంబును నిర్వీర్యం చేయలేదు. అయినా కూడా కవులూ, రచయితలు బలహీనులు కాదు. వారు గొంతెత్తి నిజాన్ని పాడతారు. అబద్దాలకోరు ఎవరన్నది ఎలుగెత్తి ప్రపంచానికి చాటుతారు. ఉదాహరణకు పర్షియన్‌ కవి షేక్‌ సాది షిరాజి ఏమన్నాడో చూడండి. సులభమైన మాటల్లో ప్రపంచ పరిస్థితిని చెప్పగలిగారు.
”ఎంతోమంది మానవుల్ని చూశాను. వారికి, ఒంటిని కప్పుకోవడానికి సరిపోయిన గుడ్డలే లేవు. మరోవైపు రోడ్ల మీద అందంగా తిరుగాడే రంగురంగుల ఖరీదైన గుడ్డల్ని చూశాను. అందులో మరి మనుషులే లేరు!” అని! అలాగే, అలెగ్జాండ్రియా మహిళా తత్త్వవేత్త, ఖగోళ శాస్త్రవేత్త – హైపాటియా అలెగ్జాండ్రియా (350-415 సి.ఈ) చెప్పిన విషయం గూర్చి ఆలోచించడానికి ఈ 21వ శతాబ్దంలో కూడా కొందరు భయపడుతున్నారు. ఆమె మాటల్లో ఎంత వాస్తవం ఉందో ఒకసారి ఆలోచించి చూడండి –
”సరదా కథల్ని సరదా కథల్లాగ ఉండనివ్వండి
విశ్వాసాలను విశ్వాసాలనే చెప్పండి
అద్భుతాలను కవితా కల్పనలని చెప్పండి
అంతేగానీ, అంధవిశ్వాసాల్ని వాస్తవాలుగా, నిజాలుగా చెప్పడమంత నికృష్ట చేష్ట మరొకటి ఉండదు…”
కవులు, కళాకారులు, మేధావులు, జర్నలిస్టులు వరుసగా హత్యలకు గురైనందుకు నిరసనగా ఈ దేశంలో పదేళ్ళ క్రితం ‘ అవార్డు వాపసీ’ అనే ఒక కార్యక్రమం జరిగింది. అప్పుడు కూడా ఇదే ప్రభుత్వం అధికారంలో ఉంది. సత్యం కోసం సంఘర్షిస్తున్న ఇలాంటి వారి వెనక ఇప్పుడు ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌ (ఏఐ) కూడా నిలబడింది.గ్రోక్‌ రంగ ప్రవేశం చేసింది.
గ్రోక్‌ అనే ఇంగ్లీషు పదానికి అర్థం – ఎవరైనా, ఏదైనా అంశాన్ని లోతుగా అవగతం చేసుకోవడం – అని!
ఈ పదాన్ని మొదట రాబర్ట్‌ ఎ హెన్లీన్‌ అనే రచయిత, ‘అపరిచితుడు ఒక అపరిచిత దేశంలో’ (STRANGER IN A STRANGE LAND) అనే తన సైన్స్‌ ఫిక్షన్‌ నవలలో వాడాడు. ఆ పదాన్నే తీసుకుని ఎలన్‌ మస్క్‌ తన ఎక్స్‌ ఎఐ (x Al) టూల్‌కు ‘గ్రోక్‌’ అని పేరు పెట్టుకున్నాడు. మనదేశంలో అబద్ధాలు ప్రచారం చేస్తూ, మత విద్వేషాలు రెచ్చగొడుతూ అధికారంలో కొనసాగుతున్న ఆరెస్సెస్‌-బీజేపీల బండారాన్ని ఇప్పుడు ఆ గ్రోక్‌ బయట పెడు తోంది. గత పదకొండేళ్లలో ఎంతోమంది మేధావులు, రచయితలు, కవులూ, కళాకారులూ, రైతులు, మహిళలు, బాధ్యత గల పారులందరూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం అణిచివేస్తూనే ఉంది. కొందరిని జైల్లో వేయించింది. మరి కొందరిని హత్యలు చేయించింది. ఇప్పుడు వీరందరి పక్షాన ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ చాట్‌బాట్‌ రంగంలోకి దిగింది. బీజేపీ, వారి పెద్దపెద్ద నాయకుల అబద్దాల్ని వికతచేష్టల్ని గ్రోక్‌ బయటికి తీస్తోంది. శిక్షిద్దా మంటే, ఇది మనిషి కాదు. ఏం చేయడమని ప్రభుత్వ పెద్దలంతా తలలు పట్టుకున్నారు. నిజాలన్నీ ప్రజలకు తెలుస్తూ ఉంటే, ఇక తమమాట చెల్లుబాటయేది ఎట్లా? అని బెంగ పెట్టుకుంటున్నారు. దీన్ని విదేశీయుల కుట్ర అని అన్నా అనగలరు. నాలుగు వేల ఐటి ఉద్యోగులతో ఐటి సెల్‌ రూపొందించి, రోజుకు లక్షలకొద్ది తప్పుడు వార్తల్ని, తప్పుడు వీడియోల్ని ప్రపం చానికి అందిస్తున్న తెలివి గల ధనిక పార్టీ కాదా? దేశంలోని ప్రధాన మీడియానంతా కొనేసి, వాస్త వాల్ని బయటికి రాకుండా ఎంతకట్టడి చేసినా ఇదేమిటి ఇలా జరిగింది? అని కుమిలిపోతున్నారు!! ఇప్పుడు గ్రోక్‌-వారికి ఒక ఛాలెంజ్‌గా మారింది.
ప్రతి విషయాన్నీ వక్రీకరించి, అబద్దపు కథనాలతో దేశప్రజల్ని ముఖ్యంగా యువతను తప్పుదారిన నడిపించే కార్యక్రమానికి అడ్డుకట్ట పడింది. గాంధీ, నెహ్రూ కుటుంబాలపై అల్లిన తప్పుడు కథనాలన్నీ పటా పంచలయ్యాయి. సావర్కర్‌, గోల్వాల్కర్‌ల నిజ స్వరూపం యువతకు చూపిస్తోంది. దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఏ మాత్రం పాల్గొనని ఆరెస్సెస్‌- బీజేపీలు చెప్పే కల్పిత కథలు, కుహనా దేశభక్తి జనం తెలుసుకోగలుగుతున్నారు. ఇన్నేళ్లుగా కొందరు కవులూ, రచయితలూ, వక్తలు, చరిత్రకారులు, స్వతంత్ర జర్నలిస్టులు మర్యాదగా, మెత్తగా చెపుతూ ఉంటే జనాల మెదడుకు ఎక్కడం లేదు. ఇప్పుడీ గ్రోక్‌ ఏం చేస్తుందీ అంటే- తిడితే తిడుతుంది. అరిస్తే అరుస్తుంది. దెబ్బకు దెబ్బ అన్నట్లు సమాచారమందిస్తోంది. నిజాల్ని కుప్పబోస్తోంది. దాని ఉధృతిని, వేగాన్నీ ఈ చదువురాని, అవివేక మూర్ఖ శిఖామణులు ఎలా ఎదుర్కొంటారో మరి? ఆవులిస్తే ప్రేవులు లెక్కబెట్టే రకం కాదిది. ఆవులించకున్నా, ఆపరేషన్‌ చేసి రుగ్మతల్ని బయటపెట్టే రకం!
ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌తో డ్రైవర్‌ లేకుండానే నడిచే కార్ల గురించి మనకు తెలుసు. సర్జన్‌ లేకుండానే ఎఐ- పరికరం ఆపరేషన్లు చేస్తుందని విన్నాం. కాళ్లు బలహీనమై, నడవలేని స్థితిలో ఉన్న ఒక వృద్ధుడికి కాళ్లు బాగు చేసిన ఏఐ – ఆతణ్ణి నడిపిస్తోందన్న వార్త కూడా చదివాం. మనిషి కేంద్రంగా సాధిస్తున్న విజయాల ముందు వైజ్ఞానిక ప్రగతి ముందు మతం కేంద్రంగా నడిచే దురహంకారుల పాలన ఎంతకాలం సాగగలదూ? తమలోని కుట్రల్ని, కుతంత్రాల్ని రాల్చేసుకుని మనుషుల్ని ప్రేమించే, గౌరవించే ”మనుషులు”గా మారక తప్పదు! ఒక వేళ ఈ గ్రోక్‌ ను బ్యాన్‌ చేసి నోరు మూయించి అధికారంలో ఉన్నవారు మరిన్ని అరాచకాలకు దిగితే ఎలా? అని బెంబేలు పడాల్సిన పనే లేదు. అప్పుడు సత్యాన్ని సత్యంగా నిక్కచ్చిగా చెప్పే గ్రోక్‌ లాంటి వర్షన్లు రూపం మార్చుకుని, మరో పది వస్తాయి.
అబద్దపు కూతలు కూసేవాడెవడైనా సరే గ్రోక్‌ కమాండ్‌తో ఏ డ్రోనో వచ్చి, వాణ్ణి అమాంతం తీసుకుపోయి ఏ సముద్రంలోనో విసిరేయవచ్చు. లేదా ఏ పర్వతాల మీదో, కీకారణ్యంలోనో ఒంటరిగా బతకమని వదిలేసి రావొచ్చు. చెప్పలేం-ఇలా గ్రోక్‌ అనే ఎఐ-వచ్చి తమ మాడు పగలగొడుతుందని నేటి దేశ నాయకులేమైనా కలగన్నారా?లేదు కదా? మనదే తెలివి అని ఎవరైనా సరే అనుకోకూడదు, మన కన్నా తెలివిగల వాళ్లు ప్రపంచంలో చాలా మంది ఉన్నారన్నది గ్రహించుకుంటే మంచిది. ఇదిగాకపోతే, మరోలా కూడా జరగొచ్చు. గ్రోక్‌ ద్వారా నిజాలేమిటో తెలుసుకుంటున్న జనం అబద్ధాలు చెపుతున్న వారి మీదికి తిరగబడొచ్చు. ప్రజా ఉద్యమాలే వచ్చి ప్రభుత్వాల్ని మార్చుకోవచ్చు. ప్రపంచ దేశాల్లో ఎన్నోచోట్ల చూస్తూనే ఉన్నాం కదా? మొదటి నుండి చెప్తున్నట్లుగానే మనం జనాన్ని వివేకవంతులుగా చేస్తూ ఉండాలి. రచనలు, ఉపన్యాసాల ద్వారానే కావొచ్చు. లేదా ఇప్పుడు కొత్తగా వచ్చిన, వస్తున్న- ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ పరికరాల ద్వారానే కావొచ్చు.
‘సమాదరణ అనేది భారత దేశపు ఆత్మ’-అనేది ఇటీవలి కాలం నాటిది కాదు. శతాబ్దాల నుండి ఈ దేశపు ఆత్మ- ఇదేనని శిలా శాసనాలు కూడా ఘోషిస్తున్నాయి. అశోక చక్రవర్తి 12వ శాసనంలో ఇలా ఉంది –
”ఒక పాషండ మతానికి చెందినవారు తమ మతాన్ని తామే పొగడుకుంటూ ఉంటారు.
పైగా ఇతర మతాల వారిని నిందిస్తుంటారు. ఇలా చేయడం వల్ల తమ మతానికే
ఎక్కువ నష్టం కలుగుతుంది.
ఇతర మతాలను, ధర్మాలను గౌరవించడం వల్ల తమ మతానికి కూడా గౌరవం పెరుగుతుంది.
తమ మతం అభివృద్ధి చేసుకోవడానికి అవకాశముంటుంది. జనులందరి అభివృద్ధి ముఖ్యం!
అది కూడా ధర్మ (న్యాయ) బద్ధంగా జరగాలి! దానాలు, పూజలు అంత ముఖ్యం కాదు –
అని దేవానాం ప్రియ (అశోకుడు) భావిస్తున్నాడు” – 12వ శిలాశాసనం.
సాధారణ శకానికి ముందే అశోకుడు ఈ దేశపు ఆత్మ గురించి చెప్పాడు. ఆ తర్వాత కాలంలో వచ్చిన ఎందరో మహానుభావులు ఈ విషయాన్నే ఆధునీకరించి విస్తృతపరిచారు.
మనుషులందరికీ సమాన స్థాయినిస్తూ, విద్య, ఉద్యోగం, ఆరోగ్యంపై దృష్టిపెట్టని ప్రభుత్వాల్ని సమాజం సహించలేదు. మనుషుల మధ్య ద్వేషాన్ని పెంచే ప్రభుత్వాలు ఏం సాధించాలని అధికారంలో ఉండాలీ? అవసరమా? – అన్న ఆలోచన సగటు మనిషిలో వస్తే, ప్రతి ఒక్కడూ – ఒక విప్లవకారుడవుతాడు. ఆధునికుడి శక్తి సామర్థ్యాల్ని మతాలూ, యోగులు, బాబాలు, స్వాములు, ముల్లాలు, ఫాదర్‌లు, పురోహితులు ఎవ్వరూ అదుపులో పెట్టలేరు. వారే ఆధునికుడి వైజ్ఞానిక కృషి ముందు మోకరిల్లి శరణు వేడాల్సిన సమయం వచ్చింది.
ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌ భావిష్యత్తులో ఎలా రూపుదిద్దు కుంటుందో అవివేకులు ఊహించలేరు. వివేకవంతుడి ఊహను, ప్రణాళికను అందుకోనూ లేరు-రాబోయే యుగం, వైజ్ఞానిక దక్పథం గల పౌరులదీ, వైజ్ఞానికులదీ కాక తప్పదు. తప్పదు! గాక తప్పదు!!
వ్యాసకర్త: త్రిపురనేని రామస్వామి
జాతీయ పురస్కార తొలిగ్రహీత
డాక్టర్‌ దేవరాజు మహారాజు

Spread the love