Saturday, April 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఒకే పనికి రెండు సార్లు శంకుస్థాపనలు

ఒకే పనికి రెండు సార్లు శంకుస్థాపనలు

- Advertisement -

గతంలో మంత్రి.. ఇప్పుడు ఎంపీ
ఎంపీ డీకే అరుణను అడ్డుకున్న కాంగ్రెస్‌ నాయకులు
కాంగ్రెస్‌, బీజేపీ నాయకుల వాగ్వాదం, తోపులాట
మంత్రి ప్రొటోకాల్‌ పాటించడం లేదని ఎంపీ ఆగ్రహం
నవతెలంగాణ – ఆత్మకూర్‌

ప్రొటోకాల్‌ వివాదంతో ఒకే పనికి రెండు సార్లు శంకుస్థాపన చేశారు. చెరువు సుందరీకరణ పనులకు గతంలో మంత్రి భూమి పూజ చేయగా.. శుక్రవారం బీజేపీ ఎంపీ డికె.అరుణ కూడా చేశారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు అక్కడకు చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో కాంగ్రెస్‌, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ ఘటన శుక్రవారం వనపర్తి జిల్లా అమరచింత పట్టణంలో జరిగింది.
అమరచింత పట్టణ పెద్ద చెరువు సుందరీకరణ పనులకు శుక్రవారం మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ భూమి పూజ చేయడానికి వచ్చారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు చెరువు కట్టకు చేరుకొని అడ్డుకున్నారు. ఇప్పటికే మంత్రి వాకిటి శ్రీహరి పెద్దచెరువు సుందరీకరణ పనులను శంకుస్థాపన చేశారని, మళ్లీ చేయటం సరికాదని నినాదాలు చేశారు. దీంతో కాంగ్రెస్‌ -బీజేపీ నాయకులు, కార్యకర్తల మధ్య వాగ్వాదం.. తోపులాట జరిగింది. ఆ సమయంలోనే ఎంపీ భూమి పూజ పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఇలాంటి సంఘటనలకు భయపడేది లేదన్నారు. చెరువు సుందరీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల పనులకు భూమి పూజ చేసే హక్కు ఎంపీగా తనకు ఉందన్నారు. ప్రొటోకాల్‌ పాటించకుండా.. తనకు తెలియకుండానే మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకుస్థాపనకు పిలువకుండా ఎంపీని అవమానించలేదా? అని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోందని తెలిపారు. అర్హులైన పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకుండా కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో పనులు చేస్తున్నారుగానీ, ఎంపీగా తనకు ఎందుకు సమాచారం ఇవ్వడం లేదని అధికారులను ప్రశ్నించారు. మక్తల్‌ నియోజకవర్గంలో మంత్రి నూతన సంప్రదాయం తీసుకుకొస్తున్నారని, మహిళా ఎంపీని గౌరవించాలని హితవు పలికారు. ఈ క్రమంలో పోలీసులు ఇరు గ్రూపులను సముదాయించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -