కూలీలకు మెరుగైన వేతనాలు కోసం ప్రణాళిక…
డీఆర్డీఏ అదనపు అధికారి ఎన్.రవి
నవతెలంగాణ – అశ్వారావుపేట: భవిష్యత్తులో భూగర్భజలాలు ఉండాలంటే నేడు వర్షపు నీటిని, వృధా నీటిని భూమిలోకి చేరేలా చేయడమే మార్గం అని, అందుకోసం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదేశానుసారం కార్యాచరణ అమలు చేస్తున్నాం అని డీఆర్డీఏ అదనపు అధికారి ఎన్.రవి అన్నారు. ఆయన శుక్రవారం మండలంలో పర్యటించి, గ్రామీణ ఉపాధి ద్వారా నిర్మిస్తున్న ఫాం పాండ్స్, ఇంకుడు గుంతలను పరిశీలించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 1 లక్షా 22 వేల 732 మంది రైతులు 3 లక్షల 46 వేల 886 ఎకరాలు సాగు చేస్తున్నారని, ఇందులో 10 ఎకరాలకు ఒక ఫాం పాండ్ చొప్పున 34 వేల 629 ఫాం పాండ్స్ నిర్మించడానికి మహాత్మా గాంధి జాతీయ గ్రామీణ ఉపాధి హిందీ పధకం ద్వారా లక్షం పెట్టుకున్నా మని తెలిపారు. ఈ పధకం ద్వారా ఇప్పటికే 1810 ఫాం పాండ్స్ మంజూరు చేస్తామని, 148 ప్రారంభించి పనులు చేపట్టారని తెలిపారు. మిగతా 1662 త్వరలో ప్రారంభిస్తామని అన్నారు. జిల్లాలో ప్రతీ ప్రభుత్వ కార్యాలయం ప్రాంగణంలో ఇంకుడు గుంతలు నిర్మించాలని కలెక్టర్ తలపెట్టారు అని, అందుకు అనుగుణంగా 31950 ఇంకుడు గుంతలు నిర్మించాలని టార్గెట్ ఇచ్చామని తెలిపారు. ఇందులో 5343 గుంతలు నిర్మించాలని అన్నారు. ఉపాధి కూలీలకు రోజు వారీ వేతనం రూ.307 లు చెల్లించాలని, ప్రస్తుతం రూ.239 లు మాత్రమే పడుతుంది అని, దీన్ని పెంచడానికి ప్రణాళిక బద్దంగా కార్యాచరణ చేపడతామని వెల్లడించారు.
ఆయన వెంట ఎంపీడీవో ప్రవీణ్ కుమార్,ఉపాధి ఏపీవో రామచంద్రరావు లు ఉన్నారు.