371-డీ ఆర్టికల్ ను తుంగలో తొక్కిన టీజీపీఎస్సీ
అభ్యర్థులకు తీవ్ర అన్యాయం
సుమోటోగా విచారణ చేపట్టాలి : సీజేఐ గవాయ్ కి కల్వకుంట్ల కవిత లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో గ్రూప్-1 నియామకాలు రాజ్యాంగ విరుద్ధంగా జరిగాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. రాష్ట్రపతి ఉత్తర్వులను, ఆర్టికల్ 371-డిని టీజీపీఎస్సీ ఉల్లంఘించిందని తెలిపారు. దీంతో గ్రూప్-1 అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని సుమోటోగా తీసుకుని విచారించాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బీఆర్ గవాయ్ కు కవిత గురువారం లేఖ రాశారు. గ్రూప్-1 నియామకాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులైన 371-డి ఆర్టికల్‌కు విరుద్దంగా నియామకాలు జరిగాయంటూ అభ్యర్థుల నుంచి తనకు ఫిర్యాదులు అందాయని తెలిపారు.
రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిన టీజీపీఎస్సీ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరారు. గ్రూప్-1 నియామకాల్లో ఆర్టికల్ 371-డిని ఉల్లంఘించటమే కాకుండా టీజీపీఎస్సీ చాలా తప్పులకు పాల్పడిందని కవిత తన లేఖలో పేర్కొన్నారు. దీంతో తెలంగాణ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీజీపీఎస్సీ తన చర్యతో అటు రాజ్యాంగంపై ఇటు తెలంగాణ ప్రజల హక్కులపై దాడి చేసిందని తెలిపారు. రాజ్యాంగ పరిరక్షకురాలైన సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవటం ద్వారా గ్రూప్-1 అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. గ్రూప్-1 పరీక్ష నిర్వహణ, నియామక ప్రక్రియపై స్వతంత్ర న్యాయ విచారణకు ఆదేశించాలని చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ కు ఆమె విజ్ఞప్తి చేశారు.



