– ట్రంప్ సుంకాల భయంతో బీజింగ్‌కు క్యూ కడుతున్న కంపెనీలు ొ వెల్లువలా వస్తున్న ఆర్డర్లు
బీజింగ్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పెద్ద ఎత్తున సుంకాలు విధించబోతున్నారన్న అంచనాలతో బెంబేలెత్తిపోతున్న అనేక కంపెనీలు చైనాకు క్యూ కడుతున్నాయి. వాటి నుండి వెల్లువలా వచ్చి పడుతున్న ఆర్డర్లతో ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయి. సోమవారం విడుదలైన కస్టమ్స్ డేటా ప్రకారం జూన్‌లో చైనా ఎగుమతులు 5.8 శాతం పెరిగాయి. మేలో 4.8 శాతం మేర ఎగుమతులలో వృద్ధి కన్పించింది. ఇక దిగుమతులు కూడా ఈ ఏడాది మొదటిసారిగా 1.1 శాతం పెరిగాయి.
చర్చలు తిరిగి ప్రారంభించేందుకు ట్రంప్, చైనా అధికారులు అంగీకరించడంతో అమెరికా సుంకాల విషయంలో తాత్కాలిక ఊరట లభించింది. దీంతో కంపెనీల నుండి భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఎగుమతులు ఇప్పటికీ 16 శాతం తక్కువగానే ఉన్నాయి. మేలో పడిపోయిన 34.5 శాతం ఎగుమతులతో పోలిస్తే ఇది తక్కువే.
వాణిజ్యంలో పెరుగుదల కారణంగా ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో చైనా ఆర్థిక వృద్ధి వేగం పుంజుకుంది. అమెరికాతో వాణిజ్య యుద్ధం కొనసాగుతున్నప్పటికీ చైనా వాణిజ్య కార్యకలాపాలు విస్తృతమవుతూనే ఉన్నాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో వాణిజ్యం 2.8 ట్రిలియన్ డాలర్లు దాటింది. దీంతో 586 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు కన్పిస్తోంది. దక్షిణాసియాకు ఎగుమతులు 13 శాతం పెరిగాయి. థాయిలాండ్‌కు 22 శాతం, వియత్నాంకు 20 శాతం, భారత్‌కు 18 శాతం మేర ఎగుమతులలో వృద్ధి కన్పించింది. యూరోపియన్ యూనియన్‌తో కూడా వాణిజ్యం 6.6 శాతం వృద్ధి చెందింది. మేతో పోలిస్తే జూన్‌లో రేర్ ఎర్త్ మెటల్స్ ఎగుమతులు ఏకంగా 32 శాతం పెరగడం గమనార్హం.
చైనాపై మరోసారి సుంకాలు విధిస్తామని, అవి 30 శాతం వరకూ ఉంటాయని అమెరికా బెదిరించింది. అయితే ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతుండడంతో వాటి అమలును ఆగస్ట్ 12వ తేదీ వరకూ వాయిదా వేసింది. అప్పటి వరకూ ఎగుమతులు పెరుగుతూనే ఉంటాయని నిపుణులు తెలిపారు.
పెరుగుతున్న చైనా ఎగుమతులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES