యూఎస్‌తో వాణిజ్య ఒప్పందంపై అస్పష్టత
వేసవి ఎగుమతులపై ప్రతికూలత
డిస్కౌంట్లను పెంచిన సరఫరాదారులు
ఫ్యాక్టరీలపై ప్రభావం
న్యూఢిల్లీ : భారత్‌పై ట్రంప్ అధిక టారిఫ్‌ల భయాలు మరింత పెరిగాయి. ఈ ఏడాది వేసవి కాలానికి గాను అమెరికాకు సరుకులను పంపించే ఎగుమతిదారుల్లో ఆందోళన నెలకొంది. భారత ఉత్పత్తులపై 50 శాతం అధిక టారిఫ్‌లతో అటు ఫ్యాక్టరీల్లోనూ, ఇటు కంపెనీ బోర్డు రూముల్లోనూ తీవ్ర ఒత్తిడి నెలకొందని రిపోర్టులు వస్తోన్నాయి.. భారతీయ వస్తువులపై అమెరికా విధించిన భారీ సుంకాలు, పెండింగ్‌లో ఉన్న వాణిజ్య ఒప్పందంపై స్పష్టత లేకపోవడంతో రాబోయే సీజన్ ఆర్డర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఎగుమతి దారులు ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు. అమెరికా మార్కెట్‌ను వదులుకోలేక, భారతీయ సరఫరాదారులు తమ లాభాలను పణంగా పెడుతున్నారని జాతీయ మీడియాలో కథనాలు వస్తోన్నాయి. చాలా మంది ఎగుమతిదారులు సుమారు 20 శాతం వరకు డిస్కౌంట్లు ఇస్తుండగా, అమెరికా కొనుగోలుదారులు తమ మార్జిన్‌లను 7-8 శాతం తగ్గించుకున్నారని అంచనా. ఇతర దేశాల నుంచి వచ్చే వస్తువులపై అమెరికా 15-20 శాతం సుంకాలు విధిస్తుంటే, భారతీయ ఉత్పత్తులపై ఏకంగా 50 శాతం వరకు టారిఫ్‌లను వేస్తోన్న విషయం తెలిసిందే. ఇంతటి భారీ భారాన్ని ఎక్కువ కాలం భరించడం అసాధ్యమని ఎగుమతిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తోలు, దుస్తులు, పాదరక్షల రంగాలకు అమెరికా అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ఒకవేళ వాణిజ్య ఒప్పందం కుదరకపోతే అమెరికా కొనుగోలుదారులు వియత్నాం లేదా బంగ్లాదేశ్ వంటి ఇతర దేశాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇది లక్షలాది మంది ఉపాధిపై ప్రభావం చూపనుందని వాణిజ్యవేత్తలు, ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు. అమెరికాతో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఎగుమతిదారులు ఇప్పుడు ఐరోపా వైపు చూస్తున్నారు. యూరోపియన్ యూనియన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలు జరుగుతున్నప్పటికీ, అది కార్యరూపం దాల్చడానికి, ప్రయోజనాలు అందడానికి మరికొన్ని నెలల సమయం పట్టవచ్చని ఆ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.
అమెరికానే ఎందుకు ముఖ్యం?
యూరప్‌తో పోలిస్తే అమెరికా నుంచి వచ్చే ఆర్డర్లు పరిమాణంలో పెద్దవిగా, డిజైన్ల పరంగా సరళంగా ఉంటాయి. ఉదాహరణకు ఒక అమెరికా కొనుగోలుదారు 20 డిజైన్లలో 500 వస్తువుల ఆర్డర్ ఇస్తే.. అదే సంఖ్యను చేరుకోవడానికి ఐరోపాలో 10 మంది కొనుగోలుదారులు, వందల కొద్దీ కొత్త డిజైన్లు అవసరమవుతాయి. ఈ సౌలభ్యం వల్లే ఎగుమతిదారులు అమెరికా మార్కెట్‌ను వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలపై స్పష్టత లేకపోవడం.. ఈ నిశ్శబ్దం ఎగుమతిదారులను మరింత అయోమయంలోకి నెట్టుతోంది. ఈ సుంకాల సమస్యను మోడీ సర్కార్ త్వరగా పరిష్కారించలేకపోతే భారతదేశంలోని అత్యధిక ఉపాధి కల్పించే వస్త్ర, తోలు పరిశ్రమలు తీవ్ర సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎగుమతిదారుల్లో పెరిగిన ఆందోళన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



