రాష్ట్ర గ్రిడ్లపై మరింత ఒత్తిడి
న్యూఢిల్లీ : 2030 నాటికి దేశంలో డేటా సెంటర్ల సామర్ధ్యం ఆరు రెట్లు పెరగబోతోంది. గత సంవత్సరం ఒకటిన్నర గిగావాట్లుగా ఉన్న ఈ సామర్ధ్యం 2030 నాటికి 8-10 గిగావాట్లకు చేరుతుంది. అదే సమయంలో ఈ రంగం యొక్క విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుంది. 2024లో డేటా సెంటర్ల విద్యుత్ వినియోగం 10-15 టెరావాట్ గంటలు ఉండగా అది 2030 నాటికి 40-45 టెరావాట్ గంటలకు పెరుగుతుందని అంచనా. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న విద్యుత్ వినియోగంలో డేటా సెంటర్ల వాటా 0.8 శాతంగా ఉంది. ఇది ఈ దశాబ్దం చివరి నాటికి 2.5-3 శాతానికి చేరుతుంది. అంటే దేశంలో అత్యధికంగా విద్యుచ్ఛక్తిని వినియోగిస్తున్న సంస్థల జాబితాలో డేటా సెంటర్లు కూడా చేరబోతున్నాయన్న మాట. విద్యుదుత్పత్తిలో పెరుగుదల, గ్రిడ్ సంసిద్ధతను మించి కొత్తగా డేటా సెంటర్లు వెలుస్తున్నాయని ఓ నివేదిక హెచ్చరించింది. ఈ పరిణామం ఇంధన సరఫరాలో అంతరాన్ని సృష్టిస్తోందని, భారత డిజిటల్-కృత్రిమ మేధ లక్ష్యాలకు ప్రతిబంధకం అవుతోందని తెలిపింది. విద్యుదుత్పత్తి పెరుగుతున్నప్పటికీ దాని కంటే వేగంగా కొత్త డేటా సెంటర్లు ఆవిర్భవిస్తున్నాయని, ఫలితంగా రాష్ట్రాల గ్రిడ్లపై మరింత ఒత్తిడి కలుగుతుందని చెప్పింది. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి అభివృద్ధి చెందుతున్న డిజిటల్ కారిడార్లలో ఈ సవాలు స్పష్టంగా కన్పిస్తుంది. 2030 నాటికి ఈ రాష్ట్రాలలోని డేటా సెంటర్లు 2-3 గిగావాట్ల చొప్పున గరిష్ట విద్యుత్ డిమాండ్‌ను సృష్టిస్తాయి. ఇది వాటి ప్రస్తుత పీక్ లోడ్‌లో 5-20 శాతానికి సమానం. పెద్ద ఎత్తున గ్రిడ్ సామర్ధ్యాన్ని పెంచని పక్షంలో విద్యుత్ డిమాండ్ అధికంగా ఉన్న సీజన్లలో స్థానిక వ్యవస్థలపై ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు హెచ్చరించారు.
పెరగనున్న డేటా సెంటర్ల సామర్ధ్యం
- Advertisement -
- Advertisement -



