ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా మానసిక ఆరోగ్య అంశాలపై మానసిక ఆరోగ్య ఆట్లాస్ పేరుతో 2001 నుండి సర్వేలు నిర్వహిస్తుంది. డబ్ల్యుహెచ్‌ఓ ప్రతి ఏటా ప్రపంచ దేశాల్లో ఉన్న మానసిక ఆరోగ్య సేవలు, వ్యవస్థలను అధ్యయనం చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా చనిపోతున్న 100 మందిలో ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ మెంటల్ హెల్త్ టు డే -మెంటల్ హెల్త్ ఆట్లాస్ 2024 నివేదికలో వెల్లడించింది. 2021లో 7.27 లక్షల మంది ఆత్మహత్యలతో చనిపోయారని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది వివిధ మానసిక ఆరోగ్య రుగ్మాతలతో జీవిస్తున్నారని నివేదిక వెల్లడించింది. ఆందోళన, ఒత్తిడి వంటివి ప్రజలను వెంటాడుతున్న మానసిక రుగ్మతులలో ప్రధానమైనవిగా డబ్ల్యూహెచ్‌ఓ గుర్తించింది. 2011- 2021 మధ్యకాలంలో మానసిక రోగుల సంఖ్య ప్రపంచ జనాభా పెరుగుదల కంటే వేగంగా పెరిగింది. 2011లో జనాభాలో 0.9% మానసిక రుగ్మాతలు ఉంటే 2021 నాటికి 13.6శాతం పెరిగినవి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో సామాజిక ఆర్థిక పరిస్థితుల కారణంగానే యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
2021లో ప్రపంచంలో 5.70 కోట్ల మందిలో మానసిక రుగ్మతలు నమోదు అయితే ఇండియాలో 3 కోట్ల మంది తీవ్రమైన మానసిక రుక్మతులతో బాధపడుతున్నారు. పురుషులలో ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండడం వంటి సమస్యలు ఉంటే, 18 ఏళ్ల లోపు వారిలో వయసుకు తగ్గ మానసిక ఎదుగుదల ఉండడం లేదు. మన దేశంలో ప్రతి లక్ష మంది మానసిక ఆరోగ్యం కలిగిన వారికి 13 మంది మాత్రమే ఆరోగ్య సిబ్బంది ఉన్నారు. ప్రపంచ దేశాల్లో ఆరోగ్యంపై కేవలం రెండు శాతం నిధులు మాత్రమే ఖర్చు పెడుతున్నారు. 2024 -25 ఆర్థిక సర్వే సైతం మానసిక ఆరోగ్య సంరక్షణపై ఆందోళన వ్యక్తం చేసింది. యువత మానసిక శ్రేయస్సు దేశ ఆర్థిక అభివద్ధికి కీలకమైన అంశమని ఆర్థిక సర్వే పేర్కొంది. పని ప్రదేశంలో ఒత్తిడి, సోషల్ మీడియా వినియోగం పెరగడం, పెరుగుతున్న సామాజిక, ఆర్థిక ఒత్తిడిల వలన యువత మానసిక ఆరోగ్యంపై తగినంత శ్రద్ధ పెట్టడం లేదు.
మానసిక ఆరోగ్య సేవలపై కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంలో తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తుంది. గత ఐదు సంవత్సరాలుగా మానసిక ఆరోగ్య సంరక్షణ కోసం కేటాయిస్తున్న నిధుల్లో ఎక్కువ భాగం ఖర్చు కావడం లేదనే ఆరోపణలున్నాయి. మానసిక ఆరోగ్య సంరక్షణ కోసం పనిచేస్తున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ వంటి సంస్థలకు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తూనే, మరోవైపు కేటాయించిన నిధులు విడుదల చేయడం లేదు.
దేశవ్యాప్తంగా మానసిక ఆరోగ్యంపై టెలి కౌన్సిలింగ్ అందించడానికి 2022లో టెలి మానస్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2025 ఫిబ్రవరి నాటికి 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 53 సెంటర్ల ద్వారా టెలి కౌన్సిలింగ్ అందించారని అంచనా. కానీ వాస్తవానికి మానసిక ఆరోగ్యం కలిగిన వారందరికీ టెలి మెడిసిన్ సేవలు చేరుకోవడంలో నిర్లక్ష్యం ఉంది. నిధుల కొరత వలన అనేక రాష్ట్రాల్లో టెలి కౌన్సిలింగ్ కార్యక్రమం ముందుకు సాగడం లేదు. భారతదేశంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మానసిక ఆరోగ్య సంరక్షణ కీలకమైంది. కేంద్ర ప్రభుత్వం దీన్ దయల్ వికలాంగుల పునరవాస పథకం, వికలాంగుల హక్కుల అమలు పథకాలను అమలు చేస్తుంది. వీటికి 2025-26 బడ్జెట్లో 280 కోట్లు కేటాయించారు. గత ఆరు సంవత్సరాల నుంచి బడ్జెట్లో నిధుల కేటాయింపులు క్రమంగా తగ్గుతున్నవి.
దేశంలో యువత మానసిక ఆరోగ్యం, జీవనశైలి, సోషల్ మీడియా వినియోగం తగ్గించడం, మానసిక ఆరోగ్య సంరక్షణపై బహిరంగ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా కొంత తగ్గించవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంలో చేస్తున్న నిర్లక్ష్యం, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందించేందుకు ఏర్పాటుచేసిన జాతీయ ఆరోగ్య మిషన్ పనులకు ఆటంకంగా మారింది. టెలిమానస్ కార్యక్రమం ద్వారానే మానసిక ఆరోగ్య సంరక్షణ సాధించడం ఆచరణలో సాధ్యం కాదు. 2017 మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టంలో పేర్కొన్న విధంగా అట్టడుగు ప్రజలకు వైద్య సేవలు అందించడం కీలకం. కానీ మన దేశంలో సామాజిక, ఆర్థిక అసమానతలు ఆటంకంగా ఉన్నవి. 2022లో 7 శాతం ఆత్మహత్యలు ఆర్థిక ఇబ్బందులతో జరిగాయి. పేదరికం, నిరుద్యోగం, మానసిక ఆరోగ్యంతో ముడిపడి ఉన్నాయనే విషయాన్ని పాలకులు గుర్తించాలి. పని ప్రదేశాల్లో సౌకర్యాలు మెరుగుపరచకుండా, ఉద్యోగ భద్రత, వేతనాలు, సామాజిక భద్రత వంటి అంశాలను పరిష్కారం చేయకుండా మానసిక ఆరోగ్య సంరక్షణ గురించి ఎంత మాట్లాడిన ఉపయోగం ఉండదన్న విషయాన్ని పాలకులు గుర్తించాలి. దేశంలో ఆరోగ్య రంగానికి నిధుల కేటాయింపు జనాభా పెరుగుదలకు అనుగుణంగా లేదు. సుమారు 150 కోట్ల జనాభా ఉన్న దేశంలో 10శాతం మంది కంటే ఎక్కువ మందికి మానసిక ఆరోగ్య సంరక్షణ అవసరం.
2030 నాటికి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా భారతదేశం ఎదుగుతుందని పాలకులు చెబుతున్న మాటలకు దేశంలో రోజురోజుకు పెరుగుతున్న మానసిక ఆరోగ్య సంరక్షణ సవాలుగా నిలిచే ప్రమాదం ఉంది. శిక్షణ పొందిన నర్సులు, సోషల్ వర్కర్స్, సైక్రియాటిస్టులు, సైకాలజిస్టులు, కౌన్సిలర్స్ మరియు ఇతర ఆరోగ్య కార్యకర్తలను నియమించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. మానసిక ఆరోగ్య సంరక్షణను ప్రభుత్వం బాధ్యతగా భావించి కషి చేయాల్సిన అవసరం ఉంది.
(సెప్టెంబర్ 10 ”ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం” సందర్భంగా)
ఎం.అడివయ్య
9490098713