Wednesday, September 24, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంపాలస్తీనాకు పెరుగుతున్న మద్దతు

పాలస్తీనాకు పెరుగుతున్న మద్దతు

- Advertisement -

గుర్తించిన మరో ఆరు దేశాలు
న్యూయార్క్‌ : ఇజ్రాయిల్‌ మారణహోమానికి గురవుతున్న పాలస్తీనాకు ప్రపంచ దేశాల నుంచి మద్దతు పెరుగుతోంది. ఐక్యరాజ్యసమితి వార్షిక సర్వసభ్య సమావేశానికి ముందు జరిగిన ఉన్నత స్థాయి సదస్సులో ఫ్రాన్స్‌ సహా ఆరు దేశాలు పాలస్తీనాను గుర్తించాయి. న్యూయార్క్‌లో సోమవారం సౌదీ అరేబియా, ఫ్రాన్స్‌ నిర్వహించిన ఈ సదస్సుకు అండోరా, బెల్జియం, లక్సెంబర్గ్‌, మాల్టా, మొనాకో దేశాల నేతలు హాజరయ్యారు. పాలస్తీనా దేశాన్ని గుర్తిస్తున్నామని వారంతా ముక్తకంఠంతో ప్రకటించారు. పాలస్తీనాను గుర్తించాలంటూ ఆదివారం ప్రతిపాదించిన ఆస్ట్రేలియా, కెనడా, పోర్చుగల్‌, బ్రిటన్‌ దేశాల నేతలు కూడా ఈ సదస్సుకు హాజరై ప్రసంగించారు. ‘సమయం ఆసన్నమైనందునే ఇక్కడ సమావేశమయ్యాం’ అని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మాక్రాన్‌ చెప్పారు. ఇజ్రాయిల్‌, పాలస్తీనా ఘర్షణకు రెండు దేశాల పరిష్కారమే మార్గమని సదస్సులో పాల్గొన్న నేతలంతా అభిప్రాయపడ్డారు.

అందుకోసం తమ చేతిలో ఉన్న అధికారాలను ఉపయోగించి చేయాల్సిందంతా చేస్తామని మాక్రాన్‌ అన్నారు. పాలస్తీనా దేశాన్ని ఫ్రాన్స్‌ గుర్తిస్తోందని ఈ రోజు తాను ప్రకటిస్తున్నానని తెలిపారు. ఐరాసలో 193 సభ్య దేశాలు ఉండగా ఏప్రిల్‌ నాటికి 147 దేశాలు పాలస్తీనాను గుర్తించాయి. ఆ తర్వాత మరికొన్ని దేశాలు కూడా పాలస్తీనాను గుర్తించడంతో ఆ సంఖ్య పెరగబోతోంది. ఎనభై శాతానికి పైగా అంతర్జాతీయ సమాజం పాలస్తీనాను గుర్తించడంతో ఇజ్రాయిల్‌పై ఒత్తిడి పెరుగుతోంది. అయినప్పుటికీ అది గాజాలో విధ్వంసకాండను కొనసాగిస్తూనే ఉంది. స్పెయిన్‌, నార్వే, ఐర్లాండ్‌ దేశాలు గత సంవత్సరమే పాలస్తీనాను గుర్తించాయి. గాజాపై యుద్ధం చేస్తున్న ఇజ్రాయిల్‌పై మాడ్రిడ్‌ ఆంక్షలు విధించింది. ఐరాస సభ్య దేశాల్లో మెజారిటీ దేశాలు పాలస్తీనాను గుర్తించినప్పటికీ కొత్తగా చేరే సభ్య దేశానికి భద్రతా మండలి మద్దతు తప్పనిసరి. అయితే ఐరాసలో పూర్తి స్థాయి సభ్యత్వం పొందకుండా పాలస్తీనాను నిలువరించడానికి అమెరికా తన వీటో హక్కును ఉపయోగించుకుంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -