Tuesday, March 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకష్టపడే తత్వంతోనే ఎదుగుదల సాధ్యం

కష్టపడే తత్వంతోనే ఎదుగుదల సాధ్యం

- Advertisement -

– శ్రీపాదరావు ఓపిక, నిబద్ధత, సామాన్యజీవితం ఆదర్శనీయం
– కర్నాటక అసెంబ్లీ స్పీకర్‌ యూటీ ఖదీర్‌
– శిల్పాకళా వేదికలో శ్రీపాదరావు 89వ జయంతి నిర్వహణ
– డాక్టర్‌ సతీశ్‌రెడ్డి, శోభారాజు, రాజన్న, సుబ్బరంగయ్యలకు జీవిత సాఫల్య అవార్డుల అందజేత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

కష్టపడే తత్వం ఉంటే ఏ రంగంలోనైనా ఎదుగుదల సాధ్యమని కర్నాటక అసెంబ్లీ స్పీకర్‌ యూటీ ఖదీర్‌ అన్నారు. ప్రజల కోసం పనిచేస్తే వారు జీవితాంతం గుర్తించుకుంటారని తెలిపారు. తన జీవితాన్ని సమాజ సేవ కోసం అర్పించిన శ్రీపాదరావును స్మరించుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. హైదరాబాద్‌లోని శిల్పాకళావేదికలో శ్రీపాదరావు 89వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రక్షణమంత్రి సాంకేతిక సలహాదారు, డీఆర్‌డీఓ మాజీ చైర్మెన్‌ డాక్టర్‌ సతీశ్‌రెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీత శోభారాజు(అన్నమయ్య కీర్తనలు), టీసీఎస్‌ ఉపాధ్యక్షులు రాజన్న, వేద ఐఐటీ డైరెక్టర్‌ సుబ్బరంగయ్యలకు జీవిత సాఫల్య అవార్డులను ఖదీర్‌ అందజేశారు. వీరితో పాటు పలువురికి మంత్రులు అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఖదీర్‌ మాట్లాడుతూ..శ్రీపాదరావు ప్రజల సంక్షేమం కోసం ఆయన ఎంతో పనిచేశారని కొనియాడారు. ఆయన ఓపిక, కమిట్‌మెంట్‌, సింప్లిసిటీ యువతకు, సొసైటీకి ఆదర్శమన్నారు. ఆయన జీవితం ఒక పాఠశాల లాంటిదని తెలిపారు. తెలంగాణ శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ..అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపారు. శ్రీపాదరావు అజాత శత్రువు అని చెప్పారు. మావోయిస్టులు ఎందుకు టార్గెట్‌ చేసి చంపారో ఇప్పటికీ అర్థం కాని విషయమన్నారు. శాసనసభను శ్రీపాదరావు నడిపిన తీరు స్ఫూర్తిదాయకమన్నారు. నేటి రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చాయని చెప్పారు. శ్రీపాదరావు ప్రజలతో మమేకమైన తీరును ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని యువ నాయకులకు సూచించారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ..శ్రీపాదరావు చిరస్మరణీయులనీ, గెలిచేవరకే రాజకీయాలకు పరిమితమై ఆ తర్వాత ప్రజా సేవలో మునిగిపోయేవారని గుర్తుచేశారు. ప్రజలకు అందుబాటులో ఉండాలనే స్ఫూర్తిని ఆయన నుంచే పొందానని తెలిపారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ..తన తండ్రి సర్పంచి స్థాయి నుంచి ప్రయాణం మొదలుపెట్టి స్పీకర్‌ స్థాయికి ఎదిగారనీ, తనయునిగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నానని చెప్పారు. సేవాదృక్పథం ఎల్లప్పుడూ ఉండాలనీ, అప్పుడే రాజకీయంగా రాణించగలుగుతామని తెలిపారు. కోట్లాది మంది ప్రజల కష్టాలను తీర్చడమే ధ్యేయంగా పనిచేయాలన్నారు. విజ్ఞానం ప్రజల తలరాతలను మార్చేందుకు దోహదపడాలని ఆకాంక్షించారు. పదవి నెత్తిన పెట్టుకునే కిరిటం కాదనీ, భుజాన వేసుకున్న బాధ్యత అని తమ నాన్న ఎప్పుడూ గుర్తుచేసేవారన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పనిచేయని ప్రజాప్రతినిధులను రీకాల్‌ చేసే విధానాన్ని తీసుకురావాలని తమ తండ్రి ఎప్పుడూ కోరుకునేవారని చెప్పారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ మాట్లాడుతూ..శ్రీపాదరావుతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. రైతు కమిషన్‌ చైర్మెన్‌ కోదండరెడ్డి మాట్లాడుతూ..ప్రతిపక్ష పార్టీల నేతలకూ అంతే సమయం ఇస్తూ ప్రజా సమస్యలను లేవనెత్తడానికి అవకాశం ఇచ్చిన మహనీయుడు శ్రీపాదరావు అని కొనియాడారు. హుందాగా శాసనసభను నడిపిన రోజులను తాను మరిచిపోలేనని చెప్పారు. ప్రజాసేవలోనే ఆయన మరణం పొందటం బాధాకరమన్నారు. ఎమ్మెల్సీ వాణీదేవి మాట్లాడుతూ…నీతి, నిజాయితీ, మంచి గుణాలున్న నాయకుడు శ్రీపాదరావు అనీ, ఆయన కుటుంబంతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సినీనటులు తనికెళ్ల భరణి మాట్లాడుతూ..ప్రజా సేవ కోసం శ్రీపాదరావు తపించేవారనీ, అందుకే నేటికీ ఆయన ప్రజల గుండెల్లో ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మెన్‌ బండా ప్రకాశ్‌, మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, ఏపీసీసీ అధ్యక్షులు రుద్రరాజు, మాజీ ఎంపీ వీహెచ్‌, ఎమ్మెల్యేలు ప్రేంసాగర్‌రావు, రాకేశ్‌రెడ్డి, మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌, అరికెపూడి గాంధీ, మల్‌రెడ్డి రంగారెడ్డి, లక్ష్మీకాంతారావు, గండ్ర సత్యనారాయణ, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్‌, బల్మూరి వెంకట్‌, దయానంద్‌, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -