Monday, March 30, 2026
E-PAPER
Homeజాతీయంమార్చి నెల ప్రారంభంలో మందగించిన ఆర్థిక సూచీల వృద్ధి : నివేదిక

మార్చి నెల ప్రారంభంలో మందగించిన ఆర్థిక సూచీల వృద్ధి : నివేదిక

- Advertisement -

న్యూఢిల్లీ : పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో నెలకొన్న పరిమితుల కారణంగా ఆర్థిక సూచికలు వద్ధి మందగింపును సూచిస్తుందని ఆర్థికమంత్రిత్వశాఖ తన కొత్త నివేదికలో పేర్కొంది. మార్చి నెలవారీ ఆర్థిక సమీక్షను ఆర్థిక వ్యవహారాల శాఖ (డిఇఎ) శనివారం విడుదల చేసింది. పశ్చిమాసియాతో బలమైన వాణిజ్య, పెట్టుబడి, విదేశాలకు నగదు బదిలీ సంబంధాలు కలిగిన భారతదేశానికి (ప్రధాన ఇంధన దిగుమతిదారు) ఈ సంఘర్షణలు ”సంక్లిష్టమైన, బహుళ అంచెల ఆర్థిక ఇబ్బందులను” కలిగిస్తున్నాయని పేర్కొంది. ”2026 మార్చి నాటి తొలి ఆర్థిక నివేదికలు ఈ ప్రపంచ పరిణామాల ప్రభావాన్ని ప్రతిబింబించేలా వద్ధిలో మందగమనాన్ని సూచిస్తున్నాయి” అని నివేదిక తెలిపింది.

”మార్చి 22 వరకు నెలవారీ ఈ-వె బిల్లుల జారీ 5.3శాతం తగ్గింది. ఇది వస్తువుల రవాణాలో కొంత మందగమనాన్ని సూచిస్తుంది. అయితే వార్షిక ప్రాతిపదికన లెక్కిస్తే.. ఇది 9.4శాతం అధికంగానే ఉంది. ఇంధన ధరల పెరుగుదల షాక్‌ తర్వాత ఉత్పత్తి వద్ధిలో మందగమనాన్ని పిఎంఐ (పర్చేజింగ్‌ మానేజర్స్‌ ఇండెక్స్‌ ) సూచిస్తోంది” అని నివేదిక తెలిపింది. అయితే డిమాండ్‌ అధికంగా కనిపిస్తోందని నివేదిక వెల్లడించింది. వాహన రిజిస్ట్రేషన్లు మార్చి 24 వరకు గతేడాదితో పోలిస్తే 19.1శాతం పెరిగాయని, మార్చి 22 వరకు డిజిటల్‌ చెల్లింపులు రెండంకెల వద్ధిని కొనసాగించిందని తెలిపింది. గ్రామీణ ఆర్థిక పరిస్థితులు, అభిప్రాయాల సర్వే మార్చి 2026లో గ్రామీణ అభిప్రాయాల్లో కొంత తగ్గుదల ఉన్నట్లు సూచిస్తోంది. అయితే వినియోగ వద్ధి బలపడింది. ఈ సర్వేను 2026 ఫిబ్రవరి చివరి వారంలో మరియు మార్చి మొదటి వారంలో నిర్వహించినట్లు తెలిపింది.
సాపేక్షంగా దేశంలో బలమైన స్థూల ఆర్థిక పునాదులు ఉండటంతో నిలదొక్కుకునేందుకు యత్నిస్తోందని నివేదిక తెలిపింది. అయితే మారుతున్న పరిస్థితిని నిరంతరం నిశితంగా పర్యవేక్షించాలని, అందుకు అనుగుణంగా విధానపరమైన చర్యలు తీసుకోవాలని కూడా నివేదిక జోడించింది.

ప్రమాదంలో పలు రంగాలు
భారతదేశం చమురు, ఎల్‌పిజి, ఎల్‌ఎన్‌జి అవసరాల కోసం దిగుమతులపై, ముఖ్యంగా పశ్చిమాసియా దేశాలపై ఆధారపడింది. దీంతో నిర్దిష్ట రంగాలపై స్థూల ఆర్థిక ప్రభావాన్ని కూడా నివేదిక చర్చించింది. అనేక రంగాల్లో ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలైన గాజు లేదా సిరామిక్స్‌ వంటి నిరంతరం ఉత్పత్తి కొనసాగే పరిశ్రమలకు ఇంధనాలను, ముడిపద్ధారాలు అందకపోవడంతో ఉత్పత్తి కోతకు మరియు తాత్కాలిక మూసివేతకు దారితీశాయని నివేదిక తెలిపింది. లభ్యత లేకపోవడం, వ్యయ పెరుగుదల రెండూ కూడా లాభాల మార్జిన్లు, ఉత్తత్తిపై ఒత్తిడిని తీవ్రతరం చేస్తున్నాయి. రవాణా అంతరాయాలు, సరఫరా మార్గాల మార్పులు, యుద్ధ ప్రమాద ప్రీమియంలతో సరుకు రవాణా, బీమా ఖర్చులు గణనీయంగా పెరిగాయని, అదే సమయంలో రవాణా ఆలస్యం కావడం, డెలివరీ సమయాన్ని పొడిగించాయని పేర్కొంది. దీంతో కీలకమైన ముడిసరుకుల దిగుమతులకు, ఎగుమతులకు నిబంధనలు తీవ్ర నష్టం కలిగిస్తోందని తెలిపింది.
పెరుగుతున్న రవాణా ఖర్చులు గల్ఫ్‌ మార్కెట్ల నుండి తగ్గుతున్న డిమాండ్‌ కారణంగా ఇంజనీరింగ్‌ వస్తువులు, వస్త్రాలు, తోలు, జెమ్స్‌ ఆభరణాల వంటి ఎగుమతి ఆధారిత రంగాలు పోటీలో నిలబడలేకపోతున్నాయని నివేదిక పేర్కొంది. గగనతలాల మూసివేతలు, పెరిగిన విమాన ఇంధన ధరలు నిర్వహణ ఖర్చులను పెంచుతున్నాయని, దీంతో విమానయాన రంగానికి డిమాండ్‌ మందగిస్తోందని తెలిపింది. పెరిగిన పెట్రోలియం దిగుమతి బిల్లులు, పెరిగిన నిర్వహణ ఖర్చులు, పశ్చిమాసియాకు ఎగుమతులు తగ్గిపోవడం వంటివి భారతదేశ ప్రస్తుత కరెంట్‌ ఖాతాపై ఒత్తిడి కలిగించవచ్చని డిఇఎ తన నివేదికలో స్పష్టం చేసింది. అదనంగా, గల్ఫ్‌ దేశాల నుండి గణనీయమైన వాటా కలిగిన విదేశీ నగదు రాబడిలో మందగమనం కూడా ప్రతికూల ప్రమాదాన్ని సూచిస్తోందని పేర్కొంది.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి అందిన సమాచారం ప్రకారం.. సుమారు 92 లక్షల మంది భారతీయులు పశ్చిమాసియాల్లో నివసిస్తూ, పనిచేస్తున్నారని, అలాగే భారతదేశ వార్షిక విదేశీ మారకపు చెల్లింపుల్లో కనీసం 35 శాతం గల్ఫ్‌ ప్రాంతం నుండి వస్తున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) అంచనా వేస్తోందని నివేదిక తెలిపింది. దీని ప్రకారం.. గల్ఫ్‌ ప్రాంతాల నుండి భారతదేశానికి ఏటా సుసమారు 40 బిలియన్‌ డాలర్ల విదేశీ నిధులు అందుతున్నాయని నివేదిక పేర్కొంది. ఈ కారకాలు విదేశీ పెట్టుబడుల ఉపసంహరణకు దారితీయడంతో పాటు భారత రూపాయి విలువ క్షీణించేలా చేశాయని తెలిపింది. వీటికి క్రమబద్ధమైన విధాన చర్యలు అవరసమని సూచించింది. ఆర్థికపరంగా, అధిక సబ్సిడీ అవసరాలు (ఎరువులు, ఇంధనం కోసం), రాబడి కొరత, ద్రవ్యలోటును పెంచవచ్చని తెలిపింది. ఇది వ్యయాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని పెంచుతోందని నివేదిక వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -