సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో
న్యూఢిల్లీ : గాజాలో కాల్పుల విరమణకు హామీ ఇవ్వాలని, ఈ ఒప్పందాన్ని కుదర్చినట్టు ప్రగల్భాలకు పలుకుతున్న అమెరికాకు సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో విజ్ఞప్తి చేసింది. గాజాపై ఇజ్రాయిల్ చేసిన తాజా దాడులను తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా ప్రకటించిన, ఇజ్రాయిల్ ఆమోదించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయిల్ పదే పదే ఉల్లంఘించడాన్ని పొలిట్ బ్యూరో ఈ ప్రకటనలో తీవ్రంగా ఖండించింది.
తాజా దాడి కాల్పుల విరమణ ఒప్పందం బలహీనతను, ఇజ్రాయిల్ దురాక్రమణను అరికట్టాల్సిన అవసరాన్ని మరోసారి వెల్లడించిందని తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందానికి గొప్పగా ప్రచారం చేస్తున్న అమెరికా, దాన్ని కచ్చితంగా అమలు చేయడానికి హామీ ఇవ్వాలని తెలిపింది. ఇజ్రాయిల్ దురాక్రమణ, విస్తరణ విధానాలను అరికట్టడం ద్వారా మాత్రమే దీనిని సాధించుకోవచ్చునని, అంతర్జాతీయ సమాజం కూడా ఇజ్రాయిల్‌పై ఒత్తిడి తీసుకునిరావాలని విజ్ఞప్తి చేసింది. అలాగే పాలస్తీనా దేశాన్ని గుర్తించడం ద్వారాను, అమెరికా, దాని మిత్రదేశాల నుంచి ఇజ్రాయిల్‌కు సైనిక, రాజకీయ మద్దతును నిలిపివేయడం ద్వారానే గాజాలో శాశ్వత శాంతి సాధ్యమని పొలిట్‌బ్యూరో పునరుద్ఘాటించింది.



