Wednesday, December 3, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంహామీలు.. బాండ్‌ పేపర్లు

హామీలు.. బాండ్‌ పేపర్లు

- Advertisement -

రెండో విడత పంచాయతీలో చిత్రవిచిత్రాలు
పలుచోట్ల ఏకగ్రీవాలు

నవతెలంగాణ-విలేకరులు
రాష్ట్రవ్యాప్తంగా రెండవ విడత సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ మంగళవారం ముగిసింది. దాంతో పలు జిల్లాల్లో జోరుగా నామినేషన్లు దాఖలయ్యాయి. పలు చోట్ల పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. వికారాబాద్‌ జిల్లా దోమ మండలం గోట్లచెల్క సర్పంచ్‌తోపాటు ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి పాత్లావత్‌ కవిత చందర్‌ సర్పంచ్‌గా, ఉప సర్పంచ్‌గా అంగౌత్‌ బిక్యాకి, 8 మంది వార్డు సభ్యులను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం వీరాపూర్‌ గ్రామంలో సర్పంచ్‌ పదవికి నవంబర్‌ 30న దిండిగాల గంగు ఒక్క నామినేషన్‌ మాత్రమే దాఖలు చేశారు. అలాగే 8 వార్డులకు ఒక్కొక్కటే నామినేషన్‌ వచ్చింది. దాంతో సర్పంచ్‌తోపాటు 8మంది వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టేనని స్థానికులు పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం అధికారిక ప్రకటన కోసం గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు.

మెదక్‌ జిల్లా ఘనపూర్‌ మండలం రాజిపల్లి తాండా(కాప్రాయిపల్లి) గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మహిళా జనరల్‌ రిజర్వేషన్‌ వచ్చింది. గ్రామానికి చెందిన మౌనిక శ్రీనివాస్‌ గ్రామస్తులకు బాండ్‌ పేపర్‌ రాసిచ్చారు. గెలిచిన తరువాత ఆడబిడ్డ పుడితే బంగారు తల్లి పథకం కింద రూ.రెండు వేలు, ఆపద్బాందు పథకం కింద గ్రామంలో ఎవరైనా అకాల మరణం చెందితే రూ.5వేలు, తీజ్‌ పండుగకు రూ.20వేలు, ముదిరాజ్‌ బోనాలకు రూ.8వేలు, ఎల్లమ్మ బోనాలకు రూ.3వేలు, గృహలక్ష్మీ పథకం కింద రూ.3లక్షలు, కొత్తగా వేరైన కుటుంబాలకు బాత్రూం కట్టించి ఇస్తానంటూ ఇలా 15 రకాల వాగ్దానాలతో గ్రామస్తులకు బాండ్‌ పేపర్‌పై రాసిచ్చారు. సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్‌ ఏన్సాన్‌పల్లి గ్రామంలో తాను రెండు సార్లు పోటీచేసి ఓడిపోయానని, ఈ సారి తన భార్యను గెలిపించాలని ప్రశాంత్‌ కంటతడి పెట్టుకున్నాడు. చేగుంట మండలం మక్కరాజుపేట చౌరస్తాలో పోలీసుల తనిఖీల్లో రూ.30.59 లక్షలను పట్టుకున్నారు. భార్యభర్తలు బైక్‌పై వెళుతుండగా వాహనాలను తనిఖీ చేయగా డబ్బులు దొరికాయి. తాము పొలం అమ్మగా డబ్బు వచ్చిందని, ఇంటికి తీసుకుపోతున్నామని వారు పోలీసులకు తెలిపారు.

సర్పంచ్‌ బరిలో పంచాయతీ కార్మికుడు
గ్రామపంచాయతీ కార్మికుడిగా గ్రామానికి సేవలందించిన వ్యక్తి.. రిజర్వేషన్‌ పరంగా ఎస్సీ జనరల్‌ రావడంతో సర్పంచ్‌ బరిలో నిలిచాడు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట్‌ గ్రామానికి చెందిన పళ్లెం లింగం బరిలో నిలిచాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ కార్మికుడిగా, గ్రామంలో ఉదయమే చెత్తను తీసివేస్తూ, గ్రామానికి సేవ చేశారని, గ్రామంలో సమస్యలపై, ప్రజల అవసరాలపై అవగాహన కలిగిన వ్యక్తిగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. తాడ్వాయి మండలం ఎండ్రియాల్‌ సర్పంచ్‌ స్థానానికి ఎస్సీ జనరల్‌ రిజర్వేషన్‌ కేటాయించడంతో గ్రామానికి చెందిన గంగయ్య.. నామినేషన్‌, ఇతర ఖర్చుల కోసం తనకున్న 50 మేకలలో నుంచి 15 మేకలు అమ్ముకున్నాడు. తనకున్న ఆస్తులు అమ్మి గ్రామాభివృద్ధికి ప్రజా సేవ చేస్తానని అభ్యర్థి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -