నవతెలంగాణ – తుంగతుర్తి
పార్టీ కోసం ముందు నుంచి కష్టపడుతున్న వారికే అవకాశం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ చెప్పిన విధంగానే 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలో కొనసాగిన గుడిపాటి నరసయ్యకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించారు. తుంగతుర్తి మండల పరిధిలోని వెలుగుపల్లి గ్రామానికి చెందినవారు గుడిపాటి నరసయ్య. గుడిపాటి నరసయ్య మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డికి విధేయుడు. నిరుపేద కుటుంబానికి చెందిన నరసయ్య కళాశాల స్థాయిలోనే విప్లవ పార్టీకి ఆకర్షితుడై సిపిఐఎంఎల్ పార్టీలో చంద్ర పుల్లారెడ్డి వర్గంలో చేరి (1990-95) వరకు అజ్ఞాత జీవితం గడిపారు. నాటి తుంగతుర్తి శాసనసభ్యులు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి సూచనల మేరకు 1995లో జనజీవన స్రవంతిలో కలిశారు. ఈ క్రమంలో ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తుండగా.. 2001 లో దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి జడ్పిటిసిగా అవకాశం కల్పించారు.
2001-06 వరకు తుంగతుర్తి జడ్పిటిసిగా, అనంతరం 2008 వరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2009 లో తుంగతుర్తి నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో మోత్కుపల్లి నరసింహులు మీద ఓడిపోయారు. 2013-19 వరకు గుడిపాటి నరసయ్య భార్య గుడిపాటి వెంకటరమణ తుంగతుర్తి సొసైటీ చైర్ పర్సన్ గా సేవలందించారు. 2014, 2018, 2023 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నం చేశారు. 2014-18 వరకు టీపీసీసీ సభ్యులుగా, 2018 నుండి పీసీసీ సభ్యులుగా కొనసాగుతున్నారు.
ఈ క్రమంలో జిల్లా అధ్యక్ష పదవి కోసం పలువురు పోటీ పడగా మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి విధేయుడుగా ఉన్న నరసయ్యకు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ ల సహకారంతో జిల్లా అధ్యక్ష పదవి వరించింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు, నరసయ్య అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం జరుగుతుంది అని రుజువు చేసింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులుగా ఎంపికైన నరసయ్య మాట్లాడుతూ.. తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఏకతాటిపై తీసుకొచ్చి, స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాలు గెలవడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.

