ప్రత్యక్ష నియామకాలకు డిగ్రీ తప్పనిసరి
వీఆర్‌వో, వీఆర్‌ఏలకు పదోన్నతులు
ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గ్రామ పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పాలనా అధికారులు (జీపీవో) పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. వీఆర్‌వో, వీఆర్‌ఏలు లేదా జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్ల నుంచి జీపీవో పోస్టులకు పదోన్నతుల ద్వారా, డిగ్రీ అర్హత కలిగిన వారితో నేరుగా నియామకాలను చేపడతామని స్పష్టం చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి డిఎస్ లోకేష్ కుమార్ గురువారం ఉత్తర్వులు (జీవో నెంబర్ 32) విడుదల చేశారు. రెవెన్యూ శాఖలో మొత్తం 10,954 గ్రామ పాలన అధికారి పోస్టులను సృష్టించామని వివరించారు.
గతంలో పనిచేసిన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు (వీఆర్‌ఓలు), విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు (వీఆర్‌ఏలు) అనుభవాన్ని వినియోగించుకుంటూ గ్రామ స్థాయిలో రెవెన్యూ, భూ రికార్డులు, పరిపాలనా వ్యవహారాలు సమర్థంగా నిర్వహించే ఉద్దేశంతో జీపీఓ వ్యవస్థను అమల్లోకి తెచ్చామని స్పష్టం చేశారు. జీపీఓల నియామకం ప్రక్రియ రెండు విధాలుగా ఉంటుంని వివరించారు. ప్రత్యక్ష నియామకం ద్వారా, అలాగే గతంలో విధుల నుంచి తొలగించబడి ఇతర శాఖలకు బదిలీ అయిన మాజీ వీఆర్‌ఓలు, మాజీ వీఆర్‌ఏలను జూనియర్ అసిస్టెంట్/రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్ నుంచి బదిలీ ద్వారా నియమించే అవకాశం కల్పించామని తెలిపారు. ప్రత్యక్ష నియామకం ద్వారా ఎంపిక కావాలంటే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. బదిలీ ద్వారా వచ్చే మాజీ వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలకు డిగ్రీ ఉండాలి లేదంటే ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతోపాటు కనీసం ఐదేండ్ల సర్వీసు అనుభవం ఉండాలని సూచించారు.
ప్రత్యక్ష నియామకానికి కనీస వయస్సు 18 ఏండ్లు, గరిష్ట వయస్సు 34 ఏండ్లు ఉండాలని వివరించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్ల వయోపరిమితి సడలింపు ఉంటుందని తెలిపారు. ఇతర రిజర్వేషన్లు తెలంగాణ స్టేట్ అండ్ సబ్‌ఆర్డినేట్ సర్వీస్ రూల్స్-1996 ప్రకారం అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రత్యక్ష నియామకంతో వచ్చిన వారు మూడేండ్ల కాలవ్యవధిలో రెండేండ్లు, బదిలీ/పదోన్నతి ద్వారా వచ్చిన వారు రెండేండ్లలో ఏడాది ప్రొబేషన్ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సంబంధిత కేటగిరీలో కనీసం రెండేండ్ల సర్వీసు ప్రొబేషన్ హోదా ఉన్న వారికే బదిలీ/పదోన్నతి అవకాశం ఉంటుందని తెలిపారు. బదిలీ ద్వారా వచ్చే మాజీ వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలు ప్రస్తుతం పొందుతున్న వేతన శ్రేణిలోనే కొనసాగుతారని స్పష్టం చేశారు. జీపీఓ పోస్టులకు నియామక, క్రమశిక్షణాధికారిగా జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తారని తెలిపారు. నియామకం, పదోన్నతి, బదిలీలు, సీనియార్టీ వంటి అంశాలన్నీ జిల్లా స్థాయి యూనిట్‌గా ఉంటుంని వివరించారు. జీపీఓలకు భవిష్యత్‌లో సీనియర్ అసిస్టెంట్ క్యాడర్‌కు 60:40 నిష్పత్తిలో పదోన్నతి కోటా కల్పించేలా నిబంధనలను సవరిస్తామని తెలిపారు. ఈ నియామలను అమలు చేసేలా జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జీపీఓఏటీజీ హర్షం
జీపీఓ సర్వీస్ నిబంధనలు రావడం వల్ల తెలంగాణ గ్రామ పాలన అధికారుల అసోసియేషన్ (జీపీఓఏటీజీ) రాష్ట్ర కమిటీ హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి, సీపీఎల్‌ఏ కార్యదర్శి లోకేష్‌కుమార్‌కు, కార్యదర్శి మంద మకరంద్‌తోపాటు ఉద్యోగ జేఏసీ చైర్మెన్ వి లచ్చిరెడ్డి, కో చైర్మెన్ కె రామకృష్ణకు జీపీఓఏటీజీ అధ్యక్షులు గరికె ఉపేందర్‌రావు, ప్రధాన కార్యదర్శులు మల్లారం అర్జున్, ఆర్ విజయ్, సెక్రెటరీ జనరల్ దాసరి వీరన్న, కోశాధికారి గుర్రాల బాలకిషన్ గురువారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా జీపీవోలు పనిచేయాలని లచ్చిరెడ్డి సూచించారు.



