సీపీఐ రాష్ట్ర నాయకుడు చందునాయక్ మృతి
కండ్లలో కారం చల్లి ఫైరింగ్
ఆధారాలు సేకంచిన క్లూస్ టీమ్స్,ఐదు రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం
నిందితుల కోసం 10 బృందాలతో గాలింపు
మలక్‌పేట శాలివాహననగర్ పార్కులో ఘటన
నవతెలంగాణ – సీటీబ్యూరో/ మలక్‌పేట్
హైదరాబాద్ నగర నడిబొడ్డున కాల్పులు కలకలం రేపాయి. మలక్‌పేట్ శాలివాహననగర్ పార్క్‌లో ఉదయం వాకింగ్‌కు వెళ్లిన సీపీఐ రాష్ట్ర నాయకులు చందు నాయక్(43)పై అందరూ చూస్తుండగానే సినిమా తరహాలో దుండగులు తుపాకులతో కాల్చి దారుణంగా హత్య చేశారు. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే కారులో వచ్చిన వారు ఆరు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో చందునాయక్ అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో పార్కులో ఉన్నవారు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసుల వివరాలు ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట గ్రామానికి చెందిన సీపీఐ రాష్ట్ర నాయకులు కేతావత్ చందు నాయక్ రాథోడ్ చైతన్యపురిలో నివాసం ఉంటున్నారు. మంగళవారం ఉదయం తన భార్య, కుమార్తెతో కలిసి మలక్‌పేట్‌లోని శాలివాహననగర్ పార్కులో వాకింగ్‌కు వచ్చారు. వాకింగ్ చేస్తున్న సమయంలో ఉదయం 7.20 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు వచ్చి ముందుగా చందునాయక్ కండ్లలో కారం చల్లారు. ఆయన తెరుకునేలోపే తుపాకులతో ఆరు రౌండ్లు కాల్పులకు తెగబడ్డారు. ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. కాల్పుల మోత వినిపించడంతో పార్కులోని వాళ్లందరూ భయాందోళనతో పరుగులు తీశారు. సమా చారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కొన్ని ప్రాథమిక ఆధా రాలు సేకరించారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. సోమవారం రాత్రి నుంచే చందునాయక్ ఇంటిదగ్గర కొందరు అనుమానాస్పదంగా సంచరించినట్టు సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు గుర్తించారు. మృతుని భార్య, కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లిన తర్వాతే చందునా యక్‌పై దాడి చేసినట్టు వారు తెలిపారు. 2022లో ఎల్బీనగర్ పరిధిలో జరిగిన ఎమ్మార్పీఎస్ నాయకుల హత్య కేసులో చందునాయక్ నిందితునిగా ఉన్నారు. కాగా, చందు నాయక్ ఎక్కడికి వెళ్లినా భార్యా పిల్లలు వెంట ఉంటారని స్థానికులు, బంధు వులు తెలిపారు. ఈ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్‌ఐ పిడమర్తి నరేశ్ తెలిపారు. సంఘటనా స్థలాన్ని డీసీపీ చైతన్యకుమార్, ఏసీపీ సుబ్బరామిరెడ్డి పరిశీలించారు. చందునాయక్ మరణ వార్త విని అభిమానులు, బంధువులు, స్నేహితులు ఆయన స్వగృహానికి భారీగా తరలివచ్చారు. సంఘ టనా స్థలాన్ని తనిఖీ చేసిన క్లూస్ టీమ్స్ కీలక ఆధా రాలను సేకరించాయి. ఇదిలావుండగా కాల్పులకు తెగబడ్డ నింది తులు పోలీసుల అదుపులో ఉన్నట్టు పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది.
10 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాం: డీసీపీ
కాల్పులకు తెగబడ్డ నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేకంగా 10 బృందాలను రంగంలోకి దించినట్టు సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్యకుమార్ తెలిపారు. ఉదయం 7:30కు ఓ వ్యక్తిపై కాల్పులు జరిగాయని సమాచారం వచ్చిందన్నారు. స్విఫ్ట్ కారులో వచ్చిన నలుగురు దుండగులు కాల్పులు జరిపారన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. సంఘటనా స్థలంలో ఐదు బుల్లెట్‌లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సంఘటనా స్థలంలోని అన్ని సీసీ కెమెరాల పుటేజీలను సేకరించామన్నారు. నిందితులు ఉపయోగించిన కారును గుర్తించామని, త్వరలోనే వారిని అరెస్టు చేస్తామని డీసీపీ తెలిపారు.