Sunday, February 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంహైదరాబాద్‌లో కాల్పుల కలకలం

హైదరాబాద్‌లో కాల్పుల కలకలం

- Advertisement -

కోఠి ఎస్‌బీఐ కార్యాలయం వద్ద దోపిడీ
ఏటీఎంలోకి తుపాకీతో చొరబడిన దుండగులు
డిపాజిట్‌ చేసేందుకు వచ్చిన వ్యక్తి నుంచి నగదు చోరీ
రూ.ఆరు లక్షల నగదు బ్యాగ్‌తో పరార్‌
అడ్డుకునేందుకు యత్నించడంతో రెండు రౌండ్ల కాల్పులు
కాచిగూడ సమీపంలో స్కూటీ వదిలేసి, దుస్తులు మార్చుకున్న దొంగలు

నవతెలంగాణ-సిటీబ్యూరో/సుల్తాన్‌ బజార్‌
హైదరాబాద్‌ నగర నడిబొడ్డులోని కోఠి బ్యాంక్‌ స్ట్రీట్‌లో శనివారం ఉదయం దోపిడీ, కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపాయి. ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఏటీఎంలో డబ్బులు డిపాజిట్‌ చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపి రూ.6లక్షల వరకు ఎత్తుకెళ్లారు. రద్దీగా ఉండే ప్రాంతంలో కాల్పులు జరగడం సంచలనం రేపింది. వివరాల్లోకెళ్తే.. కేరళకు చెందిన బట్టల వ్యాపారి వద్ద పనిచేస్తున్న రిన్షాద్‌ నగదును డిపాజిట్‌ చేసేందుకు కోఠి ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం ముందున్న ఏటీఎంకు శనివారం ఉదయం వచ్చాడు. ఏటీఎంలో 7 గంటల సమయంలో నగదు డిపాజిట్‌ చేస్తున్న సమయంలో ఇద్దరు దుండగుల్లో ఒకరు ఏటీఎంలోకి వెళ్లగా.. మరో దుండగుడు బయట రెక్కీ నిర్వహించాడు. ఏటీఎంలోకి వెళ్లిన దుండగుడు తుపాకీని రిన్షాద్‌ కడుపు వద్ద పెట్టి బెదిరించాడు. అతని నుంచి బ్యాగ్‌ లాక్కుని బయటకు పరుగుపెట్టాడు.

ఈ క్రమంలో రిన్షాద్‌ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇద్దరు దొంగలు కలిసి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. రూ.6 లక్షలున్న బ్యాగ్‌తో బ్లాక్‌ కలర్‌ స్కూటీపై ఉడాయించారు. ఈ కాల్పుల్లో రిన్షాద్‌ కాలికి తీవ్ర గాయమైంది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న డీసీపీ శిల్పవల్లి సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా నగర సీపీ వీసీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. కునళలోని కోజికోడ్‌కు చెందిన పీవీ రిన్షాద్‌ పిల్లల దుస్తుల వ్యాపారి వద్ద పనిచేస్తున్నాడని తెలిపారు. నాంపల్లిలో (దివాన్‌ దేవీఢలో) హోల్‌సేల్‌ స్టాక్‌ కొనుగోలు నిమిత్తం ఈనెల 7న రూ.6 లక్షలతో ఆ ప్రాంతంలోనే జనతా అపార్ట్‌మెంట్స్‌లో నివాసముంటున్న తన స్నేహితుని ఇంటికి వచ్చాడని చెప్పారు. అయితే, బట్టల కొనుగోలు కుదరకపోవడంతో తన బంధువు మిష్బాన్‌ సలహా మేరకు ఆ నగదును బ్యాంకులో జమ చేయడానికి నిర్ణయించుకున్నారని తెలిపారు. అందుకోసం రిన్షాద్‌ స్నేహితుని వాహనంపై కోఠి బ్యాంక్‌ స్ట్రీట్‌లోని ఎస్‌బీఐ ప్రధాన శాఖ ఏటీఎంకు వచ్చాడని చెప్పారు.

ఆ సమయంలో ఇద్దరు గుర్తుతెలియని దుండగులు ముందుగా తుపాకీతో బెదిరించారని, తర్వాత రెండు రౌండ్లు కాల్పులు జరపగా, అందులో ఒకటి బాధితుని కుడి కాలికి తగిలి గాయమైందన్నారు. అనంతరం నిందితులు నగదు సంచితోపాటు బాధితుడి వాహనం తాళం చెవులను లాక్కొని దానిపైనే అక్కడి నుంచి పరారయ్యారని సీపీ వివరించారు. నిందితులు చాదర్‌ఘాట్‌ సిగల్‌ మీదుగా నింబోలిఅడ్డా, కాచిగూడ వైపు వెళ్లినట్టు సీసీకెమెరాల ద్వారా గుర్తించామని తెలిపారు. అక్కడ వాహనాన్ని వదిలేసి.. దుస్తులు మార్చుకుని కాచిగూడ చౌరస్తా వైపు కాలినడకన పారిపోయినట్టు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు సుల్తాన్‌బజార్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని, పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని అన్నారు. సీసీటీవీ దృశ్యాలతోపాటు, సాంకేతిక ఆధారాలను సేకరించడం, పొరుగు పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని అధికారులతో సమన్వయం చేసుకోవడం జరుగుతోందన్నారు. ఎవరికైనా అనుమానాస్పద కదలికలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే ‘డయల్‌ 100’ ద్వారా పోలీసులకు తెలియజేయలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామన్నారు. రిన్షాద్‌కు ప్రాణాపాయం తప్పిందని స్పష్టం చేశారు. బాధితుని ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -