‘సమాజ దిశను మార్చి, ప్రగతిపథం వైపు మళ్లించి ఉన్నత సమాజాన్ని నిర్మించటానికి ముఖ్యపాత్ర పోషించేది కవులు, కళాకారులే’ అన్నారు ప్రఖ్యాత నవలాకారుడు మాక్సిమ్ గోర్కీ. దాన్ని అక్షరాల పాటించిన వ్యక్తుల్లో ముందు వరసలో ఉన్న కవి గుర్రం జాషువా. ఆయన తెలుగు సాహితీ వనంలో పూసిన కవితాసుమం. మూఢాచారాలపై తన కవిత్వంతో తిరుగుబాటు బావుటా ఎగురవేసిన చైతన్య దీప్తి. సంప్రదాయకవులంతా ప్రేమ, ప్రణయ, శృంగార కవిత్వాలతో కాలయాపన చేస్తుండగా, సామాజిక దౌష్ట్యాన్ని తన కవిత్వం ద్వారా చీల్చిచెండాడిన కవి. ఆయన 1895 అక్టోబర్ 28న వినుకొండలో జన్మించాడు. తక్కువ కులానికి చెందిన వ్యక్తిగా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు.
‘మేము సరస్వతీ పుత్రులం. ఛందస్సు మీద పట్టు ఉండాలన్నా, వ్యాకరణబద్ధంగా కవిత్వం చెప్పాలన్నా, కావ్యాలు రాయాలన్నా మా లాంటి వారికే చెల్లుతుంది గానీ- మట్టి పిసుక్కునేవాళ్లకు సాధ్యమవుతుందా’ అన్న అహంకారంతో వ్యవహరించి, తల బిరుసుతనాన్ని ప్రదర్శించిన కొంతమంది చేత ‘శభాష్’ అనిపించుకోగలిగిన ఉద్ధండ పిండం జాషువా. బహుషా అగ్రవర్ణాల అధిపత్య ధోరణిని ఏమాత్రం సహించరాదన్న పంతమే ఆయన కవిత్వంలోనూ, పాండిత్యంలోనూ ఉన్నతస్థాయికి నడిపించే ప్రేరణ అయ్యిందేమో! తానేమిటో, తన సత్తా ఏమిటో సమాజానికి రుజువు చేయటానికే పరిమితమైపోకుండా తనలోని విశ్వ- మానవుడిని మరింత సంపూర్ణంగా మనముందు ఆవిష్కరింపజేశారు. సామాజిక ఉద్యమాలన్నీ జాషువా కవిత్వం రాసిన కాలంలోనే జరిగాయి. జాతీయోద్యమం, ఆంధ్రోద్యమం, సామ్యవాద ఉద్యమం, హేతువాద ఉద్యమం మొదలైన ఉద్యమాలన్నీ జాషువా కవిత్వం మీద చెరగని ముద్రవేశాయి. జాతీయవాదం ఇచ్చిన ఉత్సాహం, అందులోని సంస్కరణవాదం ఇచ్చిన స్ఫూర్తి రాబోయే కాలంలో దేశంలోని కులమత వివక్షత, ఆర్థిక అసమానతలు తొలగి పోగలవన్న నమ్మకాన్ని జాషువాలో కలిగించాయి. అగ్రవర్ణ దురహంకారాలను చవిచూసిన జాషువా సౌమ్యపదజాలంతోనే వాటిని ఎదిరించారు. తన సాహిత్యాన్ని మెచ్చుకున్న ప్రజలు తన కులం తెలిసిన తర్వాత వెలివేయటాన్ని సహించలేక పోయాడు. జాషువా కలానికి కూడా కులం ఉంటుందన్న ఆనాటి ధోరణిని, కవిత్వంలో ఉన్న కులవివక్షతను జాషువా సహించలేకపోయారు.
భారత దేశంలోని కులవ్యవస్థ పుట్టుకను, పరిణామాలను లోతుగా అర్థం చేసుకుని, నేటి తరానికి ఒక శాస్త్రీయ దృష్టిని ఆనాడే అందించాడు. తన ఖండ కావ్యంలో కర్ణుడిని వీరుడు అన్నాడు. అర్జునుడిని దోషిగా నిలబెట్టాడు. అది ఆనాటికే కాదు, ఈనాటికీ సాహసమే. కులం పునాదులను కొల్లగొట్టాలంటే ధర్మశాస్త్రాల గుట్టును బట్టబయలు చేయాలన్న డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ తాత్వికతకు జాషువా ఆలోచన సరితూగుతుంది. అనేక రకాలుగా అవమానాల పాల్జేసి చివరకు కుతంత్రంతో కర్ణుడిని వధించారని కూడా ప్రకటించారంటే ఆయన ఆ రోజుల్లోనే ధర్మశాస్త్రాల మీద యుద్ధం ప్రకటించినట్టు అర్థం చేసుకోవాలి. కురుకుమారుల సభలో, కర్ణునికి జరిగిన అవమానమే కవితా సదస్సులో తనకు జరిగిందన్నారు. సూర్యారావు బహదూర్ దర్శనం తర్వాత కవి కులాన్ని గూర్చిన ప్రశ్న రావటం జాషువాను ఎంతగానో బాధించింది. ప్రతిభను కులమతాలతో కొలవటం తీవ్రంగా ఖండించాడు. ఆకలి అంటే అన్నం పెట్టని ఈ దేశంలో ఎంతోమంది నిర్భాగ్యులు ఆకలి పోరాటం చేస్తుంటే, ఒక్క మెతుకు కూడా విదల్చకుండా, ప్రాణంలేని బొమ్మలకు దైవారాధన పేరిట వేలాది రూపాయలు ఖర్చుపెట్టడాన్ని వ్యతిరేకించాడు. నైవేద్యాలు పండ్లు ఫలాహారాలు పేరుతో భారతదేశంలో ముప్పైమూడు కోట్ల దేవతలకు వృథా చేస్తున్నారని బాధ పడ్డాడు.ఇలాగైతే సామాన్యుడి ఆకలిమంట ఏమి తీరుతుంది? అంతా ఆ దేవతల ప్రసాదాలకే సరిపోతే అంటూ నిరుపేదల పక్షాన తన ప్రతిఘటన స్వరాన్ని వినిపించాడు. అంతేకాదు,విగ్రహారాధనను కూడా నిరసించాడు. పేదల్ని కాదని విగ్రహాలకు పెండ్లిళ్లు చేయడానికి అనవసరమైన ఖర్చులు చేస్తున్నారని ఆనాడే విమర్శించారు.
జాషువా ఊహాలోక విహారి కాదు. వాస్తవ ప్రపంచ సంచారి. కావ్య ఖండికలు, ఖండకావ్యాలు స్వీకరించి దైనందిన జీవిత సత్యాలనే చిత్రించాడు. వాటికి కండపుష్టి కలిగించాడాయన. తెలుగు కవిత్వంలో ‘జీవుని వేదన’ స్థానంలో ‘జీవన వేదన’కు పీటవేసిన కవి జాషువా. పౌరాణిక, చారిత్రాత్మక, సాంఘిక వస్తువుల్లో దేన్ని స్వీకరించి కవిత్వం రాసినా, అందులో తనదైన దళితానుభవం అంత స్సూత్రంగా ఉంటుంది.భారతదేశ చరిత్రను ఆయన ఎక్కడా అగౌరవపరచలేదు. సామాజిక వ్యవస్థ మీద ఆర్థిక, సాంఘిక, రాజకీయ దృష్టి కోణాలనుంచి విమర్శనాత్మక కవిత్వం రాశాడు. హిందూ, ముస్లిం, క్రైస్తవ వస్తువులన్నిటినీ కవిత్వీకరించాడు. గౌతమ బుద్ధుడు, ఏసుక్రీస్తు, గాంధీ వీరిని ఒక త్రయంగా జాషువా అనేక పర్యాయాలు కీర్తించాడు. అంబేడ్కర్ గురించి ఆయన తక్కువగా పద్యాలు రాసినట్లు కనిపిస్తున్నప్పటికీ ఆయన కవిత్వమంతా అంబేడ్కర్ ప్రచారం చేసిన సౌభ్రాతృత్వ భావన పరచుకుని కనిపిస్తుంది. స్వాతంత్య్రం వచ్చిన వెంటనే ”అచ్చముగ భారతీయుడనైతి నేడు” అని ప్రకటించాడు జాషువా.
ఆయన తన జీవితకాలంలో ఎన్నో బిరుదులు, పురస్కారాలు అందుకున్నాడు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, కళాప్రపూర్ణ, పద్మభూషణ్ పురస్కారాలను తీసుకున్నారు. తెలుగు ప్రజల మన సుల్లో నిలిచిపోయిన మహాకవి. తను సృష్టించిన సాహిత్యంలో స్పృశించని అంశం లేదు. పద్య నిర్మాణంలో జాషువా సాధించిన ప్రతిభ అనన్య సామాన్యమై, అనేక మంది సాహిత్య పండితుల ప్రశంసలు పొందింది. జాషువా పద్యాల్లోని శబ్ధ సౌందర్యం గుండెలను తాకుతుంది. ఆయన 1971 జూలై 24న గుంటూరులో మరణించారు. ‘జీవితం ఎన్నో పాఠాలునేర్పింది. నాకు గురువులు ఇద్దరు – పేదరికం, కులమత భేదం. ఒకటి నాకు సహానాన్ని నేర్పితే, రెండోది నాలో ఎదిరించే శక్తిని పెంచిందే కాని బానిసగా మార్చలేదు. దరిద్రాన్ని, కుల మతాలను కూడా చీల్చి నేను మనిషిగా నిరుపించుకోదలిచాను. వాటిపై కత్తి కట్టాను, అయితే నా కత్తి నా కవితే.” అన్నారు గుర్రం జాషువా.
(నేడు గుర్రం జాషువా వర్థంతి)
తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి
కలానికి కులం ఉండదని చాటిన ‘గుర్రం జాషువా’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES