నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గురుకుల టీజీసెట్ -2026 ఫలితాలను మార్చి 9న విడుదల చేయనున్నట్టు సెట్ చీఫ్ కన్వీనర్, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్ స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. 492 సెంటర్లలో పరీక్ష నిర్వహించగా కేవలం రెండు కేంద్రాల్లో స్వల్ప సమస్యలు తలెత్తగా అప్పటికప్పుడు పరిష్కరించినట్టు ఆయన తెలిపారు. సంబంధిత కేంద్రాల్లో తల్లిదండ్రులు, విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
గురుకులాల బలోపేతం కోసం కీలకమైన మౌలిక వసతుల కల్పనతో పాటు విద్య, పరిపాలనా సంస్కరణలను అమలు చేయబోతున్నట్టు కృష్ణ ఆదిత్య వెల్లడించారు. రాష్ట్రంలో సొసైటీ పరిధిలో 268 గురుకులాలు ఉండగా, 150 స్కూల్స్‌కు సొంత భవనాలున్నాయని తెలిపారు. 79 స్కూల్స్ అద్దె భవనాల్లో కొనసాగుతుండగా, ఒక్కో ప్రాంగణానికి రూ.50 కోట్లతో ప్రతిపాదన ఉన్నట్టు తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. హాస్టల్స్‌లో వంట గదుల ఆధునీకరణను జిల్లా కలెక్టర్లతో సంప్రదింపుల ద్వారా చేపట్టనున్నట్టు తెలిపారు. ఇప్పటికే షేక్ పేట స్కూల్‌లో ఆధునిక కిచెన్‌ను ప్రారంభించినట్టు చెప్పారు. పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలు, ఆహార నాణ్యత మెరుగుదలపై దృష్టి సారించినట్టు వెల్లడించారు. విద్యార్థుల దీర్ఘకాల గైర్హాజరును తగ్గించేందుకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ను ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. ఎక్కువ కాలం గైర్హాజరైన, అనారోగ్యంతో ఉన్న విద్యార్థులను గుర్తించి వారికి తగిన కౌన్సిలింగ్, వైద్య సహాయం అందించే ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరానికి పాఠ్య పుస్తకాల కొనుగోలు ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామనీ, పాఠశాలలు ప్రారంభానికి ముందే పుస్తకాలను పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 37 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈలు), 28 క్రీడా అకాడమీలు, 3 ప్రత్యేక పాఠశాలలను మరింత బలోపేతం చేసి విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, ప్రత్యేక శిక్షణ సదుపాయాలను మెరుగుపరచనున్నట్టు తెలిపారు. అలాగే బీ.ఈడీ, ఫార్మసీ వంటి కోర్సులతో ఐదు ప్రొఫెషనల్ కళాశాలలను స్థాపించే ప్రతిపాదన ఉందని తెలిపారు. ఈ ఏడాది ప్రారంభం నుంచే స్కూల్ కిట్, హాస్టల్ కిట్‌తో కలిపి వెల్‌కమ్ కిట్‌గా విద్యార్థులకు అందించనున్నట్టు తెలిపారు.
సమగ్ర డిజిటల్ పోర్టల్ – టీజీ ఆన్‌లైన్
రాష్ట్రంలోని అన్ని సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కోసం ”టీజీ ఆన్ లైన్” అనే సమగ్ర డిజిటల్ వేదికను అభివద్ధి చేస్తున్నామని కృష్ణ ఆదిత్య తెలిపారు. ఈ పోర్టల్‌లో 24 సమగ్ర మాడ్యూల్స్ ఉంటాయనీ, రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా విద్యార్థుల విద్యా, అకాడమిక్ ,ఆరోగ్య సంబంధిత పూర్తి వివరాలు ఇందులో పొందుపరచనున్నట్టు చెప్పారు. దీని ద్వారా కేంద్రీకత పర్యవేక్షణ, డేటా ఆధారిత పాలన, మెరుగైన సేవల అందజేత సాధ్యమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పొరుగు సేవల సిబ్బంది, ఇతర ఉద్యోగుల పెండింగ్ జీతాలను విడుదల చేసినట్టు తెలిపారు. భవిష్యత్తులో రెగ్యులర్ ఉద్యోగులతో జాప్యం లేకుండా ఏ నెల జీతాలను ఆ నెలలో చెల్లించేలా చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు.
మార్చి 9న గురుకుల సెట్ ఫలితాలు : కృష్ణ ఆదిత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



