పరీక్షలు సరిగా రాయకపోవడంతో మనస్తాపం
మెరుగైన వైద్యం అందించాలని ప్రిన్సిపాల్‌కు గురుకులాల జాయింట్ సెక్రెటరీ శారద ఆదేశాలు
నవతెలంగాణ- బోనకల్
ఇటీవల కళాశాలలో నిర్వహించిన ప్రీ ఫైనల్ పరీక్షల్లో ఫిజిక్స్ సబ్జెక్టులో కేవలం రెండు మార్కులు మాత్రమే వచ్చాయని, త్వరలో జరగనున్న బోర్డు పరీక్షల్లో బాగా రాస్తానో, రాయలేనో అంటూ ఓ విద్యార్థి మానసిక ఆందోళనకు గురై.. కళాశాల భవనం మీద నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. కళాశాల సిబ్బంది, విద్యార్థులు, పోలీసుల వివరాల ప్రకారం.. ముదిగొండ మండలం మాదాపురం గ్రామానికి చెందిన తుడుం ఉపేందర్, మహేశ్వరి దంపతుల కుమార్తె సమీరా బోనకల్‌లోని బాలికల గురుకుల జూనియర్ కళాశాలలో ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో చేరింది. అయితే ఇటీవల నిర్వహించిన ప్రీ ఫైనల్ పరీక్షల్లో సమీరాకు ఫిజిక్స్‌లో కేవలం రెండు మార్కులే వచ్చాయి. అప్పటి నుంచి ఆందోళన చెందుతూ, సహచర విద్యార్థులతో పరీక్షలో బాగా రాయగలనో లేదో అంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తుంది. శుక్రవారం క్లాసులు ప్రారంభమైన వెంటనే తలనొప్పి వస్తుందని తరగతి గదిలోనే కొద్దిసేపు పడుకుంది. రెండవ పిరియడ్ సమయంలో ఉపాధ్యాయురాలు క్లాసులోకి రాగానే సమీరా క్లాస్ నుంచి బయటకు వెళ్లి, కళాశాల మూడు అంతస్తుల భవనంపై నుంచి రైతు వేదిక గల స్థలం వైపు దూకింది. ఆ సమయంలో రైతు వేదిక వద్ద వార్డు మెంబర్లకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. వారు గమనించి వెంటనే ప్రిన్సిపాల్‌కి, ఉపాధ్యాయులకు సమాచారం అందించడంతో పాటు, ఎంపీడీఓ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ మోటార్ సైకిల్‌పై మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అనంతరం 108లో వైద్య చికిత్స అందిస్తూ ఖమ్మం ప్రభుతాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి విద్యార్థినికి ప్రాణహాని ఏమీలేదని స్పష్టం చేశారు. పాదానికి చిన్నపాటి ఎముక విరిగిందని, కొద్దిగా వెన్నుపూస దెబ్బ తిన్నదని వెంటనే హైదరాబాద్ నిమ్స్‌కు తీసుకెళ్లాలని సూచించారు. ఈ ఘటన సమాచారం అందుకున్న విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థిని బంధువులు ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి చేరుకొని హైదరాబాద్ తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు. దాంతో ఖమ్మంలోనే స్తంభాద్రి ఆస్పత్రిలో సమీరాను చేర్పించారు. ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికే గురుకులాల జాయింట్ సెక్రెటరీ శారద బాలికల గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్ పాసంగులపాటి వెంకట పద్మావతిని ఫోన్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలికకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా జిల్లా అదనపు కలెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి, డీసీఓ జ్యోతి, జోనల్ ఆఫీసర్ అలివేలు స్పందించి ప్రిన్సిపాల్‌కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ మద్దెల రమాదేవి, మండల విద్యాశాఖ అధికారి దామాల పుల్లయ్య, గిర్దావర్-2 జంగంగూడెం మైథిలి, బోనకల్ జీపీఓ తిరుమలశెట్టి శ్రీనివాసరావు గురుకుల విద్యాలయాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రిన్సిపాల్ కౌన్సెలింగ్
ఈ నెల 25 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానుండటంతో గురువారం కళాశాల ప్రిన్సిపాల్ పాసంగలపాటి వెంకట పద్మావతి ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ సుమారు రెండు గంటల పాటు కౌన్సెలింగ్ నిర్వహించారు. విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందొద్దని, ఒత్తిడికి గురికావొద్దని ధైర్యం చెప్పారు.
గురుకుల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



