ప్రతినిత్యం పురుగుల అన్నంతో.. అవస్థలు పడుతున్న విద్యార్థులు.
పలుమార్లు ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం..
ప్రమాదకర గోడ దూకి మరి శ్రీశైలం _ హైదరాబాద్ జాతీయ రహదారిపై ధర్నా..
సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అధికారుల హామీతో విరమించిన ధర్నా
నవతెలంగాణ – వెల్దండ
ప్రతినిత్యం పురుగుల అన్నం తినలేక.. ఖాళీ కడుపుతో పస్తులు ఉండలేక నిత్యం అవస్థలు పడుతున్నామంటూ నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కి జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో చేసిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వెల్దండ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో గత కొన్ని రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయంటూ విద్యార్థులు వసతి గృహ ప్రహరీ ప్రమాదకరంగా ఉన్న గోడను దూకి మరి సమీపంలోని శ్రీశైలం- హైదరాబాద్ జాతీయ రహదారి పైకి పరిగెత్తి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై ధర్నా రాస్తారోకో నిర్వహిస్తున్న విద్యార్థులకు మద్దతుగా స్థానిక నాయకులు సైతం ధర్నాలో పాల్గొని విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. అన్నంలో పురుగులు వస్తున్నాయని ప్రిన్సిపల్ కు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందించకుండ పరుష పదజాలంతో మానసిక వేదనకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతినెల ఏదో ఒక కార్యక్రమం పేరిట డొనేషన్లు అడుగుతుంటే తల్లిదండ్రులను అడగలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. పేదలను కాబట్టే ప్రభుత్వ వసతి గృహాలలో చదువుతున్నామని డొనేషన్లు అడుగుతే ఎక్కడి నుంచి తీసుకురావాలని మీడియా ద్వారా ప్రిన్సిపల్ ను ప్రశ్నించారు. వసతి గృహాలలో ఏదైనా విద్యార్థులు మాత్రమే చదువుతారని ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ వసతి గృహాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు కృషి చేయాలని కోరారు.
సంఘటన స్థలానికి చేరుకున్న వెల్దండ ఎస్ఐ కురుమూర్తి , తహసిల్దార్ కార్తీక్ కుమారులు విద్యార్థులతో మాట్లాడి ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి విద్యార్థినుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నాలు నిర్వహించారు. శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి కావడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోవడంతో కొంత సమయం ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.



