వనపర్తి జిల్లా కొత్తకోటలో ఘటన
నవతెలంగాణ -మదనాపురం/ వనపర్తి రూరల్
మైనార్టీ గురుకుల కళాశాల విద్యార్థి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో సోమవారం జరిగింది. కొత్తకోట ఎస్‌ఐ బి.ఆనంద్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేవీపీఎస్ మహబూబ్‌నగర్ జిల్లా నాయకులు ఆది విష్ణువర్ధన్-బాలమణి కుమారుడు నవీన్‌కుమార్ కొత్తకోట మండలం కానాయపల్లి వద్ద ఉన్న మైనార్టీ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సీఈసీ చదివేవాడు. ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి బయటికి వెళ్లారు. స్టడీఅవర్ ఉండటంతో వారంతా తిరిగి వచ్చారు. నవీన్ కుమార్ ”మీరు వెళ్లండి.. నేను బహిర్భూమికి వెళ్లి వస్తాను” అని చెప్పడంతో నలుగురు స్నేహితులు తిరిగి కాలేజీకి వచ్చారు. రాత్రి అయినా నవీన్‌కుమార్ కళాశాలకు తిరిగి రాకపోవడంతో ప్రిన్సిపాల్ పరిసర ప్రాంతాల్లో వెతికించారు.
కురుమూర్తి జాతరలో కూడా గాలించారు. అయినా ఆచూకీ తెలియలేదు. సోమవారం ఉదయం నవీన్ కుమార్ మృతదేహం కళాశాల సమీపంలో ఉన్న అమడబాకుల చెరువులో తేలింది. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతదేహాన్ని వనపర్తి జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి తరలిం చారు. విషయం తెలిసిన వెంటనే నవీన్ కుటుం బీకులు, బంధువులు, పలువురు నాయకులు ఆస్పత్రికి తరలివచ్చారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. కాలేజీ లెక్చరర్ రాజశేఖర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రజాసంఘాలు, కేవీపీఎస్ నాయకుల సంతాపం
విద్యార్థి మృతిపట్ల ఉమ్మడి జిల్లాలోని సీపీఐ(ఎం), పలు ప్రజా సంఘాలు, కేవీపీఎస్ నాయకులు సంతాపం తెలిపారు. మృతిపై విచారణ చేపట్టాలని పోలీసులను కోరారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కుటుంబీకులు, స్థానికుల ధర్నా
విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని బంధువులు, స్థానికులు ఆందోళన చేశారు. మృతిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారితో మాట్లాడి శాంతింపజేశారు.



