Thursday, May 29, 2025
Homeఎడిట్ పేజిగుబుల్లో గురుకులం

గుబుల్లో గురుకులం

- Advertisement -

రేపటి భావిభారత పౌరులకు విద్యానిలయాలుగా ఉండాల్సిన గురుకులాలు సమస్యల వలయాలుగా మారాయి. చదువు సంగతి దేవు డెరుగు.. కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. తాజాగా సంక్షేమ గురుకులాలకు అద్దె బకాయిల అంశం గుబులు పుట్టిస్తోంది. వాస్తవానికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణలో 201 గురుకులాలే ఉన్నాయి. ఆ తరువాతే 700లకు పైగా కొత్త గురుకుల విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి. తొలుత పాఠశాల స్థాయి వరకే కొనసాగిన ఈ విద్యా సంస్థలు క్రమంగా జూనియర్‌ కాలేజీ స్థాయికి అప్‌గ్రేడ్‌ అయ్యాయి. అయితే కేసీఆర్‌ ప్రభుత్వం శాశ్వత భవనాల దిశగా చర్యలు తీసుకోకుండా అద్దె భవనాల్లోనే ప్రారంభించారు. ఈ కారణంగానే ఒకచోట ఉండాల్సిన గురుకుల పాఠశాల ఆ పేరుతో మరో ప్రాంతంలో ఉంటోంది. ఏండ్లు గడుస్తున్నా వీటికి శాశ్వత భవనాలను ప్రభుత్వం మంజూరు చేయకపోవడం… మరోవైపు భవనాల యజమానులతో కుదుర్చుకున్న ఒప్పందాల గడువు ముగి యడంతో వాటిని ఎప్పుటి కప్పుడు ఇతర ప్రాంతాలకు తరలిం చాల్సి వస్తోంది. ఇప్పటికే పన్నెండు గురుకుల కాలేజీలను మూసివేయ నున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇప్పటికే 63 గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లకు యజ మానులు కరాఖండిగా ఖాళీ చేయాల్సిందే అని తేల్చి చెప్పారు. ప్రభుత్వ బకాయిలు పెద్దయెత్తున పేరుకు పోవడం, ప్రయివేటుకు ఇచ్చుకుంటే నెలా నెలా అద్దె టంచన్‌గా వసూలు చేసుకోవచ్చని యజమానులు భావించే పరిస్థితి వచ్చింది.
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1022 గురుకులాల్లో లక్షలాది మంది విద్చార్థులు ఉన్నారు. ఇప్పుడు ఆయా గురుకులాలకు శాశ్వత భవ నాలను నిర్మించి, మౌలికవసతులను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు, డిమాండ్‌ ఉన్న చోట మరిన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం కొత్తవాటి ఊసెత్తెడం లేదు. ప్రస్తుతం కొన్ని చోట్ల ఉన్న గురుకు లాలనే ‘యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ గురుకుల స్కూల్స్‌’ పేరిట ఒకే సముదాయంలో నిర్మించేందుకు పూనుకున్నది. అవి ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తున్నారో ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటికీ ఆ స్కూళ్లకు సంబంధించి మార్గదర్శ కాలను మాత్రం విడుదల చేయ లేదు. దీంతో ఈ విద్యాసంవత్సరం సైతం విద్యార్థులు సమస్యలతో సావాసం తప్పదన్నట్టు ఉంది పరిస్థితి. వసతి గృహాల్లో ఎక్కడ చూసినా అపరిశుభ్రత, భోజ నంలో నాణ్యత లేకుండా పోయింది. ప్రహరీలు, సరిపడా మరుగు దొడ్లు, స్నానపు గదులు లేకపోవడం వంటి విద్యార్థులకు నిత్యకృత్యంగా మారి పోయాయి. ఇక అద్దె భవనాల్లో ఉన్న గురుకులాల్లో సమస్యలు అన్నీ ఇన్నీ కావు. కనీస సౌకర్యాలు లేవంటూ విద్యార్థులు చదువుకు దూరమవుతున్న దుస్థితి. ప్రభుత్వమైతే, పేద విద్యార్థులకు మంచి విద్య అందించడానికి అండగా ఉంటూ ఉచిత విద్య, వసతి భోజనం అందిస్తూ వారి విద్యా వికాసానికి తోడ్పాటును, పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్యనూ అందిస్తున్నామని గొప్పలు చెబుతోంది. కానీ మాటలకు ఆచరణకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నది వాస్తవం.
విరిగిన కిటికీలు, పగిలిన తలుపులు, చెత్తాచెదారం, పిచ్చిమొక్కలతో నిండిన పరిసరాలు, పాములు, తేళ్లు, విష పురుగులు, అపరి శుభ్రంగా మారిన టాయిలెట్లతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అసలే రానుంది వర్షాకాలం. అన్నంలో పురుగులు రావడం, ఆహారం కల్తీ జరగడం, ఫుడ్‌పాయిజన్‌తో విద్యార్థుల అస్వస్థతకు గురి కావడం.. ప్రాణాలు కొల్పోయిన ఘటనలు మనం చూశాం. హాస్టల్లోకి వన్యప్రాణులు వచ్చిన సందర్భాలనేకం. అద్దె భవనాల్లో సరైన మౌలిక వసతులు లేవు. ప్రధానంగా తాగునీరుతో పాటు వాడుక నీటికి సైతం కటకట ఉండడం, కనీసం స్నానాలు చేసేందుకు వీల్లేకపోవడంతో మరి ముఖ్యంగా విద్యార్థినులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. వీటిని శ్వాశతంగా పరిష్కరించకపోతే హాస్టల్‌ అంటే విద్యార్థులు గజగజా వణికే పరిస్థితి వస్తుంది.
నిజానికి వేసవి సెలవుల్లో దాదాపు నెలన్నరపాటు వసతిగృహాలన్నీ మూసి ఉన్నా తిరిగి తెరిచే నాటికి వాటిని చక్కదిద్దాల్సిన సంక్షేమ శాఖలు ఏమాత్రం పట్టించుకోకపోవడమే ఇప్పుడు సమస్యగా మారింది. ఒకే భవనంలో రెండు మూడు హాస్టళ్లు ఉన్న పరిస్థితి. కాంగ్రెస్‌ ప్రభు త్వంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డే స్వయంగా విద్యాశాఖ చూస్తున్నా గురుకులాలు ఇలాంటి దుస్థితిలో ఉండటం శోచనీయం. మెస్‌ చార్జీల పెంపు, హాస్టళ్లకు ప్రత్యేక నిధుల కేటాయింపు చేసి అద్దె భవనాల్లో కొనసాగుతున్న వాటికి సొంత భవనాలు వెంటనే నిర్మించి విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చిన మాటలను ఆచరణలో నిరూపించు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -