Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజిగురుకులాలా? 'గుర్రు'కులాలా!

గురుకులాలా? ‘గుర్రు’కులాలా!

- Advertisement -

గురుకులం – ఒక ప్రాచీన విద్యా వ్యవస్థ. గురువు వద్దనే శిష్యులు ఉంటూ విద్య నేర్చుకునే విధానమది. ఆధునిక కాలంలో గురు శిష్యులు ఒకే చోట ఉంటూ విద్య బోధించే నేర్చుకునే విధానానికి 55 ఏళ్ల క్రితం శ్రీకారం చుట్టుబడింది. అలాంటి వ్యవస్థ నేడు సమస్యలతో సతమతమై కునారిల్లుతున్నది. ఒకనాటి ఆదర్శ వ్యవస్థ కాస్తా నేడు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితోనే నీరు గారుతుండడం బాధాకరం. ఎందుకంటే, విద్యార్థులు ఎన్నో ఆశలతో ఆశయాలతో గురుకులాల్లో ఐదవ తరగతిలో చేరుతున్నారు. కానీ చేరిన మొదటి రోజు నుండి సమస్యల తోరణం వారిని ఆహ్వానిస్తుంది. నీటి సమస్య టాయిలెట్లు లేకపోవడం లేదా ఉన్నవి పరిశుభ్రంగా లేకపోవడం చాలీచాలని అల్పాహారం, చారు లాంటి పప్పుతో కూడిన భోజనం వారికి ప్రతిరోజు మామూలే. ఇదేమి భోజనమని ప్రశ్నిస్తే మీరు ఇంటిదగ్గర ఇంతకంటే బాగా తింటున్నారా అని కండ్లెర్ర చేస్తారు. తిండికోసం వచ్చారా అని వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తారు. పురుగులతో కూడిన అన్నం, కుళ్ళిన కోడిగుడ్లు, పాడైపోయిన కూరగాయలతో భోజనం అలవాటవుతుంది. పుస్తకాలు కూడా సకాలంలో సరఫరా అవ్వడం లేదు. యూనిఫామ్స్‌ విద్యా సంవత్సరంలో ఎప్పుడు వస్తాయో తెలియదు. క్రీడలకు, సహ పాఠ్య కార్యక్రమాలకు చాలా తక్కువ సమయం కేటాయిస్తారు. వార్తలకు వినోదానికి తావులేదు. రీడింగ్‌ రూమ్‌ లైబ్రరీలు ఉండవు. ఉంటే వాటికి చాలా గట్టి తాళాలు వేస్తారు. వీరికి బాహ్య ప్రపంచం తెలవదు. అందుకే వీరు బయటకు వచ్చినప్పుడు స్వేచ్ఛవిహంగాల్లా ప్రవర్తిస్తారు. అంటే విద్యార్థులకు చదువు తప్ప వేరే ప్రపంచం లేక బావిలో కప్పల లాగా తయారవుతారు.

ఇక తల్లిదండ్రులు తమ పిల్లలపై పెట్టుకున్న ఆశలు క్రమంగా చెదిరిపోతున్నాయి. ఇరుకు గదుల్లో విద్యార్థుల నివాసం, (కొన్నిసార్లు తరగతి గదులే డార్మెటరీలు) కొన్నిచోట్ల పనిచేయని ఫ్యాన్లు, వానాకాలం చలికాలాలకు వణుకు తున్న తమ పిల్లలను చూడడానికి వస్తే వారికి అనుమతి ఉండదు. ఎన్నో ఆంక్షలుంటాయి. అధికారులను కలిసే అవకాశం ఉండదు. రకరకాల కారణాలతో పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడు తున్నారన్న వార్తలు దూరంగా ఉన్న వారి తల్లిదండ్రులను కలవరపెడుతుంటాయి. అడ్మిషన్లు కూడా విద్యార్థి ఎంపిక ప్రకారం కాకుండా ఎక్కడో మారుమూల కేటాయించడంతో అటు విద్యార్థులకు ఇటు తల్లిదండ్రులకు చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. పిల్లలను చూసి రావాలంటే ఒక రోజు కూలీ నష్టం, దూరాభారం భరించాల్సి వస్తుంది. సీట్లు ఖాళీగా ఉన్న దగ్గర పాఠశాలలకు కేటాయించక పోవడంలో ఆంతర్యమేంటో అంతుపట్టదు. సిఓఈలలో దూరంగా ఉన్న కేంద్రానికి సీటు కేటాయించడంతో కొంతమందికి భవిష్యత్తులో స్థానికత సమస్య తలెత్తే అవకాశం కూడా ఉంది. అధికారులకు మాత్రం ఇవేమీ పట్టవు. పాముకాట్లు, ఎలుక కాట్లు, భవనం మీద నుండి పడడం, దూకడం, ఆహారం, నీళ్లు సరిపడక విద్యార్థులు పారిపోవడం వంటి సంఘటనలు ప్రతిరోజు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. విద్యార్థుల బంగారు భవిష్యత్తు మొగ్గదశలోనే చిదిమి వేయబడుతున్నది. బిల్లులు విడుదల కాక టెండరర్లు నాణ్యతలేని సరుకులు సరఫరా చేస్తుంటే, కాంట్రాక్టర్లు భవన నిర్మాణం పూర్తి చేయడం లేదు. దాంతో ప్రభుత్వానికి భవనాల అద్దె రోజు రోజుకు భారం అవుతున్నది. అరకొర సౌకర్యాల నడుమ చదువు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఆందోళనకరంగా మారింది.
గురుకులాలను జిల్లా కలెక్టర్లు తరచుగా సందర్శించాలన్న ప్రభుత్వ ఉత్తర్వులు కాగితాలకే పరిమితం అయ్యాయి. ఒకనాడు ఆదర్శంగా నిలిచి పేద విద్యార్థులకు ఉచిత నాణ్యమైన విద్యను అందించిన గురుకులాలు నేడు ఎందుకు నిరాదరణకు గురవుతున్నాయి.

అందుకు ప్రభుత్వం నిర్లక్ష్యమే ప్రబల కారణం. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ వర్గం నిత్యం అసంతృప్తితో ఉంటే అధికారులు మాత్రం పూర్తిగా అలక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారు. క్షేత్రస్థాయి సమస్యలకు పరిష్కారం చూపడం లేదు. పైగా ఉపాధ్యాయులను లేదా ప్రధానాచార్యులను బలి చేస్తున్నారు. ర్యాంకులు తెచ్చిన గురుకులాలు నేడు ర్యాలీలకు ఆందోళనలకు ఆలవాలమయ్యాయి. సమస్యల పరిష్కారానికి విద్యార్థులు రోడ్డు ఎక్కడం, ధర్నాలు చేయడం పరిపాటి అయింది. అప్పుడప్పుడు పోలీసు వారు వారిని తమ వాహనాలలో ఎక్కించుకొని మళ్లీ పాఠశాలలో అప్పగిస్తున్న పరిస్థితి కూడా కనిపిసిస్తున్నది. ఒక పక్క స్టేకహేోల్డర్స్‌ అంటే విద్యార్థులు, తల్లిదండ్రులు, గురువులు గుర్రుగా ఉంటే మరో పక్క అధికారులు మాత్రం గుర్రుపెట్టి నిద్రపోతూ గురుకులాల స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు. ఇది ఒకనాటి ఆదర్శ వ్యవస్థకు చేటు కలిగిస్తున్నది. నానాటికి దిగజారుతున్న గురుకులాల నిర్వహణ విద్యార్థుల ఆత్మహత్యలకు దారితీస్తున్నది. చదువులో ఒత్తిడి, సౌకర్యాల లేమి, పారిశుధ్యం, పరిశుభ్రత లేకపోవడం వారిని అనారోగ్యం పాలు చేస్తున్నది.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల కాలంలో 90కి పైగా విద్యార్థులు వివిధ కారణాల చేత గురుకులాల్లో బలవన్మరణాలకు పాల్పడడం శోచనీయం. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ కూడా రాష్ట్రంలోని గురుకులాలలో 48 మంది విద్యార్థినీ విద్యార్థులు కలుషిత ఆహారం వల్ల మృతి చెందారని తన నివేదికలో పేర్కొంది. ఈ అంశం తీవ్రమైనదైనా దీనిపై ఇంతవరకు సమీక్షలు జరిగిన దాఖలాలు లేవు. విద్యార్థులకు కౌన్సిలింగ్‌ ఇవ్వడానికి సొసైటీలు ఇంకా సమాలోచనలు జరుపుతున్నాయి. దాదాపు రెండేండ్లుగా గురుకులాల్లో ఆత్మహత్యల పరంపర కొనసాగుతుండగా ఇప్పటికీ అధికారులు మీనమేషాలు లెక్క వేయడం దారుణం. ప్రతిసారి ముఖ్యమంత్రి కార్పొరేట్‌ కళాశాలలకు ధీటుగా గురుకులాలను తయారు చేస్తామంటే అర్థం ఆత్మహత్యల్లో పోటీ కింద భావించవలసి వస్తున్నది. జులై చివరి వరకు ఇంకా అడ్మిషన్లు నిండలేదంటే గురుకులాల పట్ల తల్లిదండ్రులకు ఇంత కాలంగా ఉన్న విశ్వాసం సన్నగిల్లిందనేది స్పష్టమైంది. పరిశుభ్రత లేక ఎలుకలు చేరి విద్యార్థులను కరవడం చాలాసార్లు జరిగింది. గురుకులాలు ఎందుకింత బాధ్యతారహితంగా నడుస్తున్నాయో బోధపడడం లేదు. పరీక్షలప్పుడు విద్యార్థులను దత్తత తీసుకొని వారు ఉత్తీర్ణులయ్యేటట్లు కొందరు ఉపాధ్యాయులు చూసుకుంటారు. ఇప్పుడు సంవత్సరం పొడవునా విద్యార్థులను దత్తత స్వీకారం చేయవలసిన అవసరం ఉంది.

అధికారులు వచ్చిన నాడు మాత్రం ప్రాంగణమంతా పరిశుభ్రంగా ఉంచుతారు, మరునాటి నుండి మామూలే. ప్రజల్లో మంచి పేరున్న ఈ గురుకులాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం బాధాకరం. సౌకర్యాలు లేకుండా అద్భుతాలు కావు కదా మామూలు ఫలితాలు కూడా ఆశించలేము. 600 మంది విద్యార్థులు ఉన్న ఒక సంస్థలో ఇన్ని సమస్యలు ఏర్పడుతుంటే, రేపు స్థాపించబోయే యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ లో దాదాపు 2500 మంది విద్యార్థులు ఓకే క్యాంపస్‌లో ఉండబోతున్నారు. అక్కడ ఇంక ఎన్ని సమస్యలు ఉత్పన్నం కాబోతున్నాయో? విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిత్యం అసంతృప్తితో పని చేయడం గురుకుల వ్యవస్థకు మంచిది కాదు. ఇకనైనా అధికారులు మేల్కని విద్యార్థుల సంక్షేమం పట్ల శ్రద్ధ వహించాలి. గురుకులాలకు గత ప్రాభవాన్ని తిరిగి తీసుకురావాలి. తల్లిదండ్రులకు విద్యార్థులకు వీటి పట్ల మళ్లీ విశ్వాసం ఏర్పడాలి. లేదంటే గురుకులాలు అంటే రాజుల కాలం నాటివా అని అడిగే రోజులొస్తాయి.
శ్రీశ్రీ కుమార్‌
9440354092

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img