గువాహతి : అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మకు గౌహతి హైకోర్టు నోటీసు జారీ చేసింది. రాష్ట్రంలోని మైనారిటీలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రసంగాలు చేయకుండా ముఖ్యమంత్రిని నిరోధించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని పురస్కరించుకొని న్యాయస్థానం ఈ నోటీసు జారీ చేసింది. అస్సామీ స్కాలర్ డాక్టర్ హిరేన్ గొహానీ, మరో ఇద్దరు ఈ పిటిషన్ దాఖలు చేశారు. బిశ్వశర్మ చేసిన విద్వేష ప్రసంగాలకు సంబంధించిన వీడియోలు అందుబాటులో ఉన్నప్పటికీ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయడం లేదని వారు ఆరోపించారు. ఇది బాధితులు, సాక్షులపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాన న్యాయమూర్తి అశుతోష్ కుమార్, న్యాయమూర్తి అరుణ్‌దేవ్ చౌదరితో కూడిన డివిజన్ బెంచ్ పిటిషన్‌ను సుదీర్ఘంగా విచారించిన అనంతరం ముఖ్యమంత్రికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, డీజీపీకి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది.



