వీసా మంజూరు నిబంధనలు కఠినతరం
చర్యలకు సిద్ధంగా ట్రంప్ యంత్రాంగం
ఐటీ నిపుణుల కెరీర్‌లపై ప్రభావం
వాషింగ్టన్ : మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (మాగా) అంటూ రెండోసారి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన డోనాల్డ్ ట్రంప్.. భారత్‌కు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే అక్రమ వలసదారుల పేరుతో అమెరికా యంత్రాంగం అక్కడి భారతీయ విద్యార్థుల పైనా చర్యలు తీసుకొని స్వదేశాలకు పంపించింది. విద్యార్థి వీసాల పైనా ఆంక్షలు పెట్టింది. ఇక అదనపు సుంకాల విధింపుతో భారతీయ ఎగుమతులు తీవ్రంగా ప్రభావితమ య్యాయి. ఇప్పుడు హెచ్-1బీ వీసాలను మంజూరు చేయటానికి నిబంధనలను కఠినతరం చేసేందుకు అమెరికా సిద్ధమవుతున్నది. వాస్తవా నికి హెచ్-1బీ వీసా పథకంలో అత్యధిక మంది లబ్దిదారులు భారతీయులే ఉన్నారు. నిబంధనలను కఠినతరం చేస్తే భారతీయ ఐటీ నిపుణుల కెరీర్‌లు దెబ్బ తినే ప్రమాదమున్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
‘ఈ వీసా వ్యవస్థ ఒక స్కాం’
నియమాలను కఠినతరం చేసే విషయంలో అమెరికా ఇప్పటికే సందేశాలు పంపింది. యూఎస్ వాణిజ్య కార్యదర్శి హౌవార్డ్ లుట్నిక్ దీని గురించి ‘ఎక్స్’ వేదికగా కీలక రాతలే రాసుకొచ్చారు. హెచ్-1బి వీసా వ్యవస్థ ఒక స్కామ్ అని ఆయన పేర్కొన్నారు. ఇది విదేశీయులకు యూఎస్ ఉద్యో గాలను దక్కించుకోవడానికి దారి కల్పిస్తుందని వివరించారు. ”అమెరికన్లను నియమించటంలో అన్ని అమెరికన్ వ్యాపారాలు ప్రాధాన్యతనివ్వాలి. ఇప్పుడు అమెరికన్లను నియమించాల్సిన సమయం ఆసన్నమైంది. హెచ్-1బీ కార్యక్రమాన్ని మార్చ టంలో నేను భాగంగా ఉన్నాను. దానిని మేము మార్చబోతున్నాం. ఎందుకంటే ఇది భయంకర మైంది. గ్రీన్‌కార్డును మార్చబోతున్నాం. సగటు అమెరికన్ ఏడాదికి 75వేల డాలర్లు సంపాది స్తాడు. సగటు గ్రీన్‌కార్డు హౌల్డర్ 66వేల డాలర్లు పొందుతున్నాడు. అందుకే మార్పులను తీసుకురా బోతున్నాం. అదే రాబోయే గోల్డ్ కార్డ్. ఆ విధంగా మేము ఈ దేశానికి వచ్చే ఉత్తమ వ్యక్తులను ఎంచుకోవటం ప్రారంభించబోతున్నాం” అని లుట్నిక్ ఓ వార్త సంస్థతో మాట్లాడుతూ అన్నారు. లుట్నిక్ తన వ్యాఖ్యలతో హెచ్-1బీ ద్వారా అమెరికాకు వచ్చే కార్మికులు అత్యంత నైపుణ్యం లేనివారిగా చెప్పే ప్రయత్నం చేశారు.
ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెసాంటిస్ కూడా ఇదే విధమై అభిప్రాయాన్ని పంచుకున్నారు. ముఖ్యంగా భారతీయులను టార్గెట్ చేసుకుంటూ ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. హెచ్-1బీ పథకం మొత్తం కుంభకోణంగా ఆయన అభివర్ణించారు. వీరిలో ఎక్కువ మంది భారత్ నుంచి వచ్చినవారే అని అన్నారు. ”మన ప్రజలు ఉండగా విదేశీ కార్మికులు ఎందుకు? అమెరికన్లకే మొదటి ప్రాధాన్యత దక్కేలా ఈ కార్యక్రమాలకు నిబంధనలను వర్తింప జేయాలి” అని డెసాంటిస్ అన్నారు.
భారతీయుల్లో ఆందోళన
డోనాల్డ్ ట్రంప్ నిర్ణయాల పట్ల అమెరికాలోని భారతీయ విద్యార్థుల సంక్షేమం కోసం పని చేస్తున్న నార్త్ అమెరికా అసోసియేషన్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ వ్యవస్థాపకులు సుధాన్షు కౌశిక్ ఆందోళన వ్యక్తం చేశారు. స్టూడెంట్, హెచ్-1బీ వీసా విధానాలను మార్చాలనే అమె రికా నిర్ణయం భారతీయ విద్యార్థులు, కార్మికులలో ఆందోళనలను నింపాయని చెప్పారు. నిబంధన లను కఠినతరం చేస్తే భారతీయులు ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదముంటుందని తెలిపారు. ఇతర దేశ ప్రజల కంటే భారతీయులకే తీవ్ర నష్టమనీ, ఇది అమెరికా ఇండిస్టీని కూడా ప్రభావితం చేస్తుందని కౌశిక్ చెప్పారు. వలసదారులపై పదేపదే విమర్శలు చేయటం ద్వారా అమెరికా జనాభాలోని ఒక వర్గం.. భారతీయులపై ఆగ్రహం తో ఉన్నదని గుర్తుచేశారు. హెచ్-1బీ వీసా కార్యక్రమంపై ట్రంప్ తన అభిప్రాయాన్ని గతంలోనే తెలియజేశారు. ఈ కార్యక్రమం ద్వారా సమర్థవంతమైన వ్యక్తులు అమెరికాకు రావడాన్ని తాను స్వాగతిస్తానని అన్నారు.
కాగా అక్టోబర్ 2022 నుంచి సెప్టెంబర్ 2023 మధ్య యూఎస్ జారీ చేసిన మొత్తం హెచ్-1బీ వీసాలలో 70 శాతానికి పైగా భారతీయులే ఉన్నారని భారత విదేశీ వ్యవహారాల సహాయమంత్రి కీర్తి వర్ధన్ సింగ్ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వివరించారు. అమెరికా తెలిపిన వివరాల ప్రకారం 72.3 శాతం మంది భారతీయులు హెచ్-1బీ వీసాలను పొందినట్టు పేర్కొన్నారు.
భారతీయులకు హెచ్-1బీ దెబ్బ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES