రేపటి నుంచి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం
నవతెలంగాణ – మల్హర్ రావు
వినాయక చవితి ఉత్సవాలు నేడు బుధవారం నుంచి నిర్వహించడానికి మట్టి గణపతులు సిద్ధం చేశారు. పర్యావరణహితంగా తయారుచేసిన మట్టి గణపతులను ప్రతిష్ఠించడానికి భక్తులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మండల కేంద్రమైన తాడిచెర్లకి చెందిన ఓజల చంద్రచారి స్థానికంగా గత పది సంవత్సరాలుగా మట్టి గణపతులను తయారు చేస్తూ పర్యావరణ ప్రేమికుల మన్ననలు పొందుతున్నారు. ఇతను వృత్తిరీత్యా వడ్రంగి పని చేస్తారు. ప్రతి వినాయక చవితికి మట్టి గణపతులను తయారు ప్రతిష్ఠించి పలువురు ప్రశంసలు పొందుతున్నాడు. బంకమట్టి, పుట్టమన్నుతో మట్టి విగ్రహాలను తయారు చేస్తున్నారు.ఈ విగ్రహాలను చెరువుల్లో నిమజ్జనం చేసిన గంటలోపే పూర్తిగా కరిగిపోతాయని, నీటిలో ఉండే జలచరాలకు ఎలాంటి ముప్పు ఉండదని తయారీదారుడు చెబుతున్నారు.
మట్టి గణపతులనే ప్రతిష్ఠించాలి..
భక్తులు పర్యావరణహితంగా ఉండే మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించాలి. గతంలో మట్టి విగ్రహాలు దొరికేవి కావు. ప్రస్తుతం తక్కువ ధరలో కావాల్సిన ఎత్తులో మట్టి విగ్రహాలు స్థానికంగానే దొరుకుతున్నాయి. ప్రతిఒక్కరూ మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలి.
నాయకుల హడావుడి..
త్వరలో గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పలువురు రాజకీయ నేతలు యువతను ప్రసన్నం చేసుకోవడానికి వినాయక చవితిని ఉపయోగించుకుంటున్నారు. విగ్రహాల తయారీ కేంద్రాల వద్ద వీరి హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది. యువకులకు సొంత ఖర్చులతో విగ్రహాలను ఇప్పిస్తున్నారు. దీంతో తయారీదారులు ఈసారి విగ్రహాల రేట్లను పెంచారు. గతంలో కన్నా ఈసారి విగ్రహాలు ఎక్కువ గానే ఉండే అవకాశం కనిపిస్తోంది.