Sunday, September 21, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిచేయి కలప….

చేయి కలప….

- Advertisement -

మిత్రుడు శీను ఉదయాన్నే ఫోన్‌ చేశాడు. ఏమైనా చెప్పు, మనోళ్లు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వకపోవడం తప్పు అన్నాడు. రివర్సులో వస్తున్నాడా అనుకున్నా ఎందుకంటే నాకు తనకు కొన్ని విషయాల్లో పడదు కాబట్టి. ఈసారి ఎందుకో మనోళ్లను బలపరచలేక పోతున్నాననీ అన్నాడు. ఇదేందిర భై నేను చెప్పే డైలాగు నువ్వే చెబితే, నీవు చెప్పేది నేను చెప్పాలా ఇప్పుడు అంటే నవ్వాడు. లేదు ఆటలు ఆటలే,రాజకీయాలు రాజకీయాలే. అందుకే నాకు నచ్చలేదని మళ్లీ తనే చెప్పాడు. అసలు ఆటలు, క్రీడలు ఎందుకు పెట్టిండ్రు? దేశాల మధ్య మంచి సంబంధాలు ఏర్పడడానికే. అటువంటిది ఆటలో చేయిచేయి కలపకుండా ఏమి సాధించినట్టు దేశం పరువు తీయడం తప్ప అన్న మా శీను మాటలు అక్షరాలా నిజం మరి.

చేయి కలపడం అన్నది ఒక మర్యాదకరమైన అలవాటు. అదొక సంస్కృతినుండి వచ్చింది. కొందరు వంగి సలాము చేయొచ్చు, ఇంకొందరు తమ టోపీ తీసి మళ్లా పెట్టుకొని నమస్కారం చెప్పొచ్చు. మనమైతే రెండు చేతులూ కలిపి నమస్కారం చేస్తాం. అదే మన ఘనమైన సంస్కృతి అని చెప్పుకోవడంలో తప్పులేదు. మరి ఆ ఘనమైన వారసత్వాన్ని ఎవరు పాటించొద్దన్నారు?మరి తప్పుచేసిన వాళ్లను సమర్ధించగలమా. చేయొక్కటి కలపలేదు కాని వాళ్ల చేత్తో వేసిన బంతుల్ని ఎలా కొట్టారు మరి, అలాగే వాళ్ల చేతుల్తో బ్యాటు పట్టుకొని ఆడుతుంటే మన చేతుల్తో ఎలా బౌలింగు చేశారని ప్రశ్నలు వేస్తే సమాధానాలు వస్తాయా?

చేయి చేయి కలిపేది ఎందుకంటే తమ చేతుల్లో ఏ మారణాయుధం లేదని అవతలి వాళ్లకి చెప్పడానికని, శాంతిని సూచించడానికని గూగుల్‌లో చూస్తే తెలిసింది. అది నమ్మకానికి, సమానత్వానికి ప్రతీక అని రాసివుంది. ఏదైనా సంబరంలో కలిసేటప్పుడు, విడిపోయేటప్పుడు ఈ షేక్‌ హ్యాండివ్వడం మామూలుగా జరిగేదే. ఆటస్థలంలో రెండు జట్లు పోటీ పడతాయి కాని యుద్ధం చేయవు. దానివెనుక ఏవేవో సఅష్టించి ఆటను యుద్ధంగా చేయడం వెనుక వ్యాపారం, రాజకీయాలు జమిలిగా కలిసిపోయి ఫలాలను అనుభవించడానికే అన్నది సుస్పష్టం. ఈ జమిలిని ప్రజలే విడగొట్టాలి. రాజకీయాలు వ్యాపార మవ్వడం, వ్యాపారస్థులు రాజకీయాల్లోకి దిగడం తర్వాత ఒకరితో ఒకరు జమిలిగా స్టెప్పులు వెయ్యడం, సంస్థల్ని పంచుకోవడం, అప్పుల్ని మాఫీ చేయడం మాత్రం బాగా చేయి కలిపి మరీ చేసుకుంటారు. ఏమైనా వ్యతిరేకంగా తమగురించి మాట్లాడితే దేశభక్తి లేదంటారు. దేశ గౌరవాన్ని కాపాడే విషయంలో ఆ భక్తి ఎక్కడికి పోయినట్టు?

చేయి కలపడం గురించి చెప్పుకునేటప్పుడు తనమాటరాకుంటే బాగా బలహీన పడిన కరోన వైరస్‌ బాధ పడుతుంది. ఇప్పుడంటే అది ఉండీ లేనట్లుంది కాని మొదటి, రెండవ విడతల్లో అది భయానకాన్ని సృష్టించినప్పుడు ఈ షేక్‌హ్యాండ్లు నిషిద్దం. డాక్టర్లే ఆ మాట కూడా చెప్పారు జాగ్రత్తగా ఉండమని. అసలు బతికినంత కాలం ఒకరితో ఒకరు కరచాలనం చేస్తామో లేదో అనుకున్నవాళ్లూ ఉన్నారు. ఇప్పుడ వన్నీ దాటుకొని ముందుకు పోతున్నామనుకునేంతలో చేతుల్తో వెనక్కు నడిచారు మనోళ్లు. పదండి ముందుకు అని చెప్పే మహాకవి మాటల్ని పెడచెవిన పెట్టి పదండి వెనక్కు అనే కాలంలో బతుకుతున్నామని మరువరాదు. ప్రాచీనకాలానికి ఇంకా ఇంకా ప్రాచీనకాలానికి మనల్ని తీసుకు పోతున్నారన్న విషయం తెలుసుకోవాలి. ప్రాచీన క్రీడల్లోనే కొత్త సాంప్రదాయాలొస్తుంటే అత్యాధునికమైన ఆటలో ఇంకెంత నూతనంగా ఉండాలి? ప్రపంచలో ప్రసిద్ధి చెందిన కంపెనీలను పిలిచి పీటవేయడంలో ఆధునికత పాటిస్తున్నప్పుడు దేశభక్తి గుర్తుకురాదు. అదే మన పరిశ్రమలను అమ్మడంలో పాటించేది ఆధునికత, ఆధునికమైన పదజాలం. ఇదో రాజకీయ క్రీడ. వ్యాపారంతో కలిసిపోయి చేసే అత్యాధునికత.

తీసుకున్న డబ్బు ఇవ్వకపోతే, లేదా ఏదైనా పని చేసిపెడతానని చెయ్యకపోతే హ్యాండిచ్చారని, చెయ్యిచ్చారని చెబుతుంటారు. ఇవ్వకపోయినా ఇచ్చాడంటారక్కడ. ఇవ్వవలసినచోట, ఆటలోని సంప్రదాయాలను పాటించే చోట పాటించకుంటే చెడ్డపేరు అందరికీ. ఇప్పుడు బంతి వాళ్ల కోర్టులో పడింది. దెబ్బతిన్నవారు సమయంకోసం, మంచిపేరు తెచ్చుకోవడంకోసం, సమయమెప్పుడొస్తుందా ఎప్పుడు దెబ్బతీద్దామా అని ఎదురుచూస్తుంటారు. ఆ అవకాశాన్ని సెప్టెంబరులో వచ్చే బంపర్‌ ఆఫర్లలాగా ఇచ్చారు మనోళ్లు. శత్రువుకు కూడా ఆయుధమిచ్చి పోరాడిన ధర్మదేశంగా చెబుతారు మనదేశం గురించి. అలాంటిది ఒక్క షేక్‌హ్యాండు ఇవ్వనందుకు మన పేరు షేక్‌ అయ్యింది కాని ప్రపంచమేమీ షేక్‌ అవ్వలేదు. మన జట్టుపై పాకిస్తాన్‌ ఫిర్యాదుల్ని అక్కడ లెక్కచేయలేదని, రెఫరీ పై ఎలాంటి చర్య తీసుకోలేదని చెప్పొచ్చు. అది మనకు బలమైన పాయింటేమీ కాదు. అసలు అలా మనోళ్లు ఎప్పుడూ ప్రవర్తించి ఉండరు. క్రీడల్లో ఎలా ఉండాలో అలాగుండాలి, అప్పుడే మనల్ని ఎవరైనా సమర్ధించగలరు.
జంధ్యాల రఘుబాబు
9849753298

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -