– వెహికల్ ట్రాఫిక్ చెక్ పేరుతో దోపిడీ
– రోజువారీ వసూళ్లలో నాలుగు రెట్లు నొక్కివేత
– లంచాలపై వ్యామోహంతో పోటాపోటీగా డ్యూటీలు
– అడ్డాలు ఏర్పాటు చేసుకొని అడ్డగోలు దందా..
– అవినీతి ఆరోపణలతో ఖమ్మం సీటీవో-2పై చర్యలు
– దృష్టి సారించిన విజిలెన్స్, ఏసీబీ అధికారులు
– విచ్చలవిడి తనిఖీలతో వ్యాపారుల్లో ఆందోళన
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి/ కొణిజర్ల
వాణిజ్య పన్నుల శాఖ (జీఎస్టీ)లో వెహికల్ ట్రాఫిక్ చెక్ (వీటీసీ) పేరుతో దందా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రోజువారీగా రూ.50వేల నుంచి లక్ష వాహనాల తనిఖీ ద్వారా రాబట్టాలని జాయింట్ కమిషనర్, వరంగల్ నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది. దీనిని ఆసరా చేసుకొని వాణిజ్య పన్నులశాఖ సిబ్బంది తెగించారు. రోజుకు రూ.50వేల పైనే వసూలు చేస్తున్నా దీనిలో రూ.5వేల నుంచి రూ.10వేల వరకే ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. మిగిలిన మొత్తాన్ని సిబ్బందే నొక్కివేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక జిల్లా అధికారులు మరో జిల్లాలో తనిఖీలు చేపట్టాలనే ఆదేశాలు సంబంధిత శాఖ ఉన్నతాధికారుల నుంచి వచ్చాయి. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ (ఏసీటీవో) ఖమ్మంలో వాహన తనిఖీలు చేస్తున్నారు. అయితే వీరు ఖమ్మం- సూర్యాపేట మార్గంలోని కోదాడ క్రాస్‌రోడ్డు వద్ద తనిఖీలు చేపట్టాలి. కానీ ఎక్కడ పడితే అక్కడ వాహనాలను నిలిపివేసి సోదాలు చేస్తుండటంతో ఆర్టీఏ అధికారులా, పోలీసులా ఎవరో తెలియక వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. వ్యాపారులు కూడా భయబ్రాంతులకు లోనవుతున్నారు.
విజిలెన్స్, ఏసీబీ కంటపడకుండా…
చెకింగ్ పాయింట్‌ను ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేసుకొని వసూలు చేస్తున్నారు. వసూలు చేసిన మొత్తంలో కొంతమాత్రమే జమ చేస్తున్నారు. మిగిలిన మొత్తాన్ని సమీపంలో ఏదైనా షాపును అడ్డాగా ఏర్పాటు చేసుకొని అక్కడ ఉంచుతున్నారు. తనిఖీలు పూర్తయ్యాక వసూలైన సొమ్ములో కొంతమొత్తాన్ని ఆఫీస్‌కు జమ చేస్తున్నారు. డ్యూటీ దిగాక కారు డ్రైవర్ వెళ్లి ఆ అడ్డాలో ఇచ్చిన సొమ్మును కలెక్ట్ చేసుకొని వస్తున్నారు. దీనిని ఏసీటీవోలతో పాటు కార్ల్ల డ్రైవర్లు, క్లర్క్‌లు వాటాలుగా పంచుకుంటున్నట్టు సమాచారం. ఏసీబీ, విజిలెన్స్ కంటపడకుండా ఈ రకంగా అడ్డాలు ఏర్పాటు చేసుక్నుట్లు తెలుస్తోంది. ఈ దందాలో ఏసీటీవోల కంటే కూడా సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఆఫీస్ కారు డ్రైవర్లు, క్లర్క్‌లు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.
వే బిల్లులు ఉన్నా…
ఖమ్మం బైపాస్‌రోడ్డులోని ఎస్వీ మార్బుల్స్ నుంచి వెళ్తున్న టాటాఏస్ లోడ్‌ను వీటీసీ బృందం ఆపింది. వే బిల్లు చూపించమని అడిగింది. ఇంత తక్కువకు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. షాప్ యజమానికి ఫోన్ చేయమన్నారు. ఆయన వచ్చి సమాధానం ఇచ్చితే ఆ ఒక్క వాహనాన్ని వదిలారు. ఒక్కో వాహనాన్ని రెండు గంటల పాటు నిలిపి వేబిల్లులు ఉన్నా కూడా రకరకాల కొర్రీలు పెట్టి రూ.3వేల నుంచి రూ.15వేల వరకూ వసూలు చేశారని బాధితులు వాపోతున్నారు. తీసుకున్న డబ్బులకు ఎలాంటి రశీదు ఇవ్వకపోవడం గమనార్హం.
ఖమ్మంలోనే కాదు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇదే తంతు కొనసాగుతోంది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కు వచ్చే వాహనాలను జీఎస్టీ ఇన్‌చార్జి అధికారులు కూడా తనిఖీలు చేస్తూ వేధిస్తున్నారని పలువురు బాధితులు చెబుతున్నారు. కమిషనర్ కార్యాలయ అనుమతి లేకుండా సీనియర్ అసిస్టెంట్లే ఏసీటీవోలుగా చెప్పుకుంటూ వాహనాల తనిఖీలు చేస్తున్నారని, పెద్ద ఎత్తున వసూళ్లకు దిగుతున్నారని పలువురు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. వీటీసీ వాహనాల తనిఖీలకు గతంలో డీసీలను మాత్రమే అనుమతించేవారు. పలువురు వ్యాపారులు అధికారులపై ఫిర్యాదులు చేయడంతో నేరుగా కమిషనర్ కార్యాలయం నుంచి వీటీసీ తనిఖీలకు అనుమతిస్తున్నారు. కొందరు సిబ్బంది ఏండ్లతరబడి ఒకే చోట పనిచేస్తున్నా బదిలీలు చేయకపోవడంతో కూడా ఈ దందాకు అంతులేకుండా పోతుందనే చర్చ డిపార్టుమెంట్‌లోనే సాగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం డీసీటీవో కార్యాలయ డ్రైవర్ 15 ఏండ్లకు పైబడి ఇక్కడే పనిచేస్తుండటం గమనార్హం. కొందరు వాహన తనిఖీలలో నోటీసులపై వ్యాపారుల వద్ద సంతకాలు తీసుకుని సెటిల్‌మెంట్ చేసుకుంటున్నట్లు సమాచారం. సెటిల్‌మెంట్ కుదరకపోతే అప్పుడు నోటీసులు జారీ చేసి ఫెనాల్టీలు వసూలు చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. వాహన తనిఖీలపై కొత్తగూడెం డీసీటీవో మేరీని ప్రశ్నించేందుకు ‘నవతెలంగాణ’ ఫోన్‌లో ప్రయత్నించగా ఆ అధికారి స్పందించలేదు.
వంతుల వారీగా డ్యూటీలు…
రోజుకు రూ.30-40వేల పైన ఆదాయం ఉంటుండటంతో వీటీసీ డ్యూటీ కోసం డీసీటీవో కార్యాలయ సిబ్బంది పోటీలు పడుతున్నట్టు తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం డీసీటీవో కార్యాలయంలో ఐదుగురు ఏసీటీవోలు ఉన్నారు. క్లర్క్, అటెండర్లు, కారు డ్రైవర్లు ఉన్నారు. వీటీసీ విధులను వంతులవారీగా రోజుకో బ్యాచ్ చొప్పున నిర్వహిస్తోంది. ట్యాక్ ప్లేట్ కారు (టీఎస్28టీబీ 8726)లో ఏసీటీవో, డ్రైవర్, క్లర్క్ మంగళవారం కొణిజర్ల ఎంపీడీవో కార్యాలయం వద్ద వీటీసీ చేపట్టారు. అస్సలు వీరు ఎవరో తెలియక వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. మీడియా ప్రతినిధులు సైతం ఆరా తీశారు. ఆర్టీఏ ఆఫీసు సిబ్బందేమోనని అనుమానంతో ఆ కార్యాలయ అధికారులను ఆరా తీయడంతో జీఎస్టీ అధికారులని తేలింది.
కమర్షియల్ ట్యాక్స్‌లో చేతివాటం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES