Monday, March 30, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంచేతులు యుద్ధరక్తంతో నిండాయి

చేతులు యుద్ధరక్తంతో నిండాయి

- Advertisement -

అలాంటివారి ప్రార్థనలను దేవుడు వినడు
తక్షణమే కాల్పుల విరమణ జరపాలి : పోప్‌ లియో
ఇరాన్‌పై దాడుల సమర్థనకు అమెరికా అధికారుల ప్రకటనలపౖౖె ఆక్షేపణ


వాటికన్‌ సిటీ : ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ యుద్ధం నెల గడిచి.. రెండో నెలలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో పోప్‌ లియో మధ్యప్రాచ్యంలో జరుగుతోన్న యుద్ధంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎవరి పేరునూ ప్రస్తావించకుండా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధాలు ప్రారంభించి రక్తంతో నిండిన చేతులతో చేసే ప్రార్థనలను దేవుడు తిరస్కరిస్తాడని అన్నారు. ప్రపంచంలోని 140 కోట్ల మంది క్యాథలిక్కులకు ఈస్టర్‌ వరకు సాగే పవిత్ర వారానికి నాంది పలికే పామ్‌ సండే రోజున, సెయింట్‌ పీటర్స్‌ స్క్వేర్‌లో పదివేల మందిని ఉద్దేశించి ప్రసంగిస్తూ పోప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సంఘర్షణను దారుణమైనదిగా అభివర్ణించారు. ఏ యుద్ధాలనూ సమర్థించడానికి యేసును ఉపయోగించలేమని అన్నారు. శాంతికి రాజైన యేసు.. యుద్ధాన్ని తిరస్కరిస్తాడనీ, యుద్ధాన్ని సమర్థించడానికి ఆయనను ఎవరూ ఉపయోగించలేరని అమెరికా మొదటి పోప్‌ అయిన లియో చెప్పారు.

”యుద్ధం చేసేవారి ప్రార్థనలను (యేసు) వినడు, కానీ వాటిని తిరస్కరిస్తూ ఇలా అంటాడు.. ‘మీరు ఎన్నో ప్రార్థనలు చేసినా, నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి’..” అని ఆయన ఒక బైబిల్‌ వాక్యాన్ని ఉటంకిస్తూ చెప్పారు. లియో ఏ ప్రపంచ నాయకుల పేర్లనూ ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. కానీ గత కొన్ని వారాలుగా ఆయన ఇరాన్‌ యుద్ధంపై విమర్శలను తీవ్రతరం చేస్తున్నారు. ఆదివారం నాటి వేడుకల ముగింపులో చేసిన ఒక విజ్ఞప్తిలో, మధ్యప్రాచ్యంలోని క్రైస్తవులు ఒక దారుణమైన సంఘర్షణ పరిణామాలను అనుభవిస్తున్నారనీ, వారు ఈస్టర్‌ పండుగను జరుపుకోలేకపోవచ్చని పోప్‌ విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘర్షణలో తక్షణమే కాల్పుల విరమణ జరపాలని పోప్‌ పదేపదే పిలుపునిచ్చారు. సైనిక వైమానిక దాడులు విచక్షణారహితమైనవని, వాటిని నిషేధించాలని అన్నారు. కాగా అమెరికా-ఇజ్రాయిల్‌ దాడులను సమర్థించుకోవడానికి కొంతమంది అమెరికా అధికారులు క్రైస్తవ సంబంధిత భాషను ప్రస్తావించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -