మాజీ ఎమ్మెల్యే చల్లా సమక్షంలో చేరిన దుబాసి వెంకటస్వామి
గులాబీ గూటికి కాంగ్రెస్ ముఖ్య నేతలు
ప్రజా వ్యతిరేక పాలనతోనే వలసలు: చల్లా ధర్మారెడ్డి
పరకాల – నవతెలంగాణ
పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. పట్టణ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న సమన్వయ కమిటీ సభ్యులు దుబాసి వెంకటస్వామి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. శుక్రవారం పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంలో ఆయన సమక్షంలో భారీ అనుచర గణంతో కలిసి భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్)లో చేరారు. వెంకటస్వామితో పాటు కాంగ్రెస్ నేతలు బొచ్చు సతీష్, దండ్ర వెంకట్, ఒంటేరు బాబురావు, కోగిల సుధాకర్ తదితరులు కూడా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి చల్లా ధర్మారెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం
ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గాలికొదిలేసి, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ తీరుపై విసుగు చెందే వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా బిఆర్ఎస్ వైపు వస్తున్నారని పేర్కొన్నారు.నియోజకవర్గ అభివృద్ధి కేవలం బిఆర్ఎస్‌తోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయన్నారు.
కలవరంలో కాంగ్రెస్ శ్రేణులు
వరుసగా ముఖ్య నేతలు పార్టీని వీడుతుండటంతో పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణుల్లో కలవరం మొదలైంది. ఒకవైపు ప్రభుత్వంపై వ్యతిరేకత, మరోవైపు పార్టీ సంస్థాగత బలహీనతలు వెరసి ‘ప్రజా ప్రవాహం’ బిఆర్ఎస్ వైపు మళ్లుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ముఖ్య నాయకులు, యూత్ విభాగం ప్రతినిధులు మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.



