Sunday, January 11, 2026
E-PAPER
Homeచౌరస్తాహేంగ్‌ అజ్‌ క్విక్‌

హేంగ్‌ అజ్‌ క్విక్‌

- Advertisement -

రాజావారు బాల్కనీలో మెత్తటి దిండ్లున్న కుర్చీలో కూర్చుని, పనివాడిచేత మీసాలకు సంపెంగ నూనె రాయిచుకుంటున్నారు. ఆ పక్కనే మరో కుర్చీలో దిండుకానుకుని కూర్చున్న కుమార్రాజావారికి ఓ సందేహం రానే వచ్చింది ఎప్పట్లానే. నాన్న రాజావారూ ఉరి తీయడమనగానేమి? అనడిగాడు. రాజావారు ఉలిక్కిపడి పనివాడ్ని అవతలికి పొమ్మని గద్దించి వాడటుపోయేక కుమార్రాజావారూ ఏమిటీ పనికి మాలిన ప్రశ్న. అనవసరమైన డవుట్లడిగి మమ్మల్ని ఇరకాటంలో పెడతారు మరి అన్నాడు. తమరే కదా తండ్రిగారూ… తెలియంది తెలుసుకోవాలని, చూడంది చూసితీరాలని చెప్పింది. వద్దంటే తెలుసుకోడం, చూడ్డం రెండూ మానేస్తాన్లెండి అన్నాడు మూతిసున్నాలా చుట్టి, నుదుటి మీద అడ్డగీతలు నిలబెట్టి.

సరిగ్గా ఈ టయానికి వచ్చిపడ్డారు మంత్రిగారు, మెట్లు ఎక్కిరావడాన ఆయాసపడుతూ. రావోయి రా! సరిగ్గా టయానికి దిగబడతావు. మా కుమార్రాజావారికి ఎక్కడలేని ప్రశ్నలూ, సందేహాలూ వస్తయి. వాటికి జవాబు చెప్పడం కన్నా నెత్తిమీది కిరీటం ఊడబీక్కుని జుత్తు పీక్కోవడం తేలిగ్గా వుంటుంది అన్నారు రాజావారు. అప్పటికి కాస్త స్తిమితపడి స్టూల్‌ మీద కూచున్న మంత్రి గారు మీరేం వర్రీ అవకండి.. నేనున్నదీ, వచ్చిందీ అందుకే కదా! కుమార్రాజావారూ అడగండి.. ఏదైనా సరే చిటికెలో నేను చెప్పేస్తానుగా అన్నారు మంత్రిగారు. తండ్రిరాజావారిని అడిగిన ప్రశ్నే మంత్రిగారి ముఖంలోకి విసిరికొట్టారు కుమార్రాజావారు.
రాజావారిలాగానే మంత్రిగారు కూడా పుటుక్కు జరజర డుబుక్కుమే అని కంగారు పడ్డారు. కానీ మంత్రి కదా.. ఆ ఫీలింగు కనపడనీకుండా ఉరి అనగానేమిటో వివరించారు. దూలానికి తాడు వేయడం, మెడకు ఉచ్చుబిగించడం, ఉరివేయబడ్డ మనిషి కాళ్ల కింద బల్లను లాగిపెట్టి తన్నేయడం మొత్తం కళ్లకు కట్టినట్లు చెప్పేశారు. అప్పుడామనిషికి ఏమవుతుంది అని ప్రశ్నించారు కుమార్రాజావారు. మంత్రిగారు రాజావారివైపు చూస్తూ, చూశారా! చూశారా! పులి కడుపున పులే పుట్టింది అని మెచ్చుకుంటూ, ఉరితీసివాడి నాలుక బయటకు రావడం గురించి చెప్పారు. భలే! భలే! ఉరితీయడం భలేగా వుంది, సరదాగా, తమాషాగా కూడా వుంది అంటూ తండ్రి రాజావారివైపు తిరిగి, నాన్నా రాజావారూ… ఇలాగ చెప్తే వినడం కాదు, కళ్లారా చూడాలని వుంది. ఎవరినైనా ఉరి తీస్తుంటే చూడాలని వుంది డాడీ! ప్లీజ్‌ డాడీ.. ఎవరినైనా సరే ఉరితీయండి, ఈ మంత్రిగానిరైనా సరే అన్నారు కుమార్రాజావారు.
మంత్రిగారి గుండె అంగీ చింపుకు బయటకు రావడానికి సిద్ధపడింది. ఆ గుండె చప్పుడు రాజావారికి వినిపించి, గాబరా పడకండి మంత్రిగారూ! మై హూనా అంటూ అబ్బాయివైపు చూస్తూ అది మాత్రం వీలుపడదు కుమార్రాజావారూ. తమరి తాతరాజావారి హయాంలోనే మన రాజ్యంలో ఉరిశిక్షను రద్దుచేశారు అన్నారు.
ఊహూ.. నేను చూసి తీరాల్సిందే. ఇంత మంది ప్రజలున్నారు రాజ్యంలో. ఒక్కడ్ని పట్టుకు వచ్చి ఉరివేయలేరా నాకోసం. మీ ముద్దుల కుమార్రాజావారి కోసం అంటూ ఏడుపు మొగం పెట్టారు కుమార్రాజావారు. ఈ విషయం మేం ఆలోచిస్తాం గానీ కుమార్రాజావారూ తమరు తోటలోకి వెళ్లి ఆడుకునే టైం అయింది అన్నాడు మంత్రి.

గండం గట్టెంక్కించే ప్రయత్నం చేసిన మంత్రిగారివైపు మెచ్చుకోలుగా చూశారు రాజావారు. కుమార్రాజావారు అక్కడ్నించి వెళ్లిపోతూ రద్దు అయిన ఉరిశిక్షను మళ్లీ ప్రవేశపెట్టండి. నేను చూడడం కోసమైనా నాన్నా రాజావారూ… అని అరిచాడు.
కుమార్రాజావారి మొండితనం, పెంకితనం, మంకుపట్టు మనకు తెల్సిందే కద రాజావారూ! మనకై మనం ఎవరికీ ఉరిశిక్ష వెయ్యలేం కానీ ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉరి వేయించుకోడానికి సిద్ధపడితే, వేయవచ్చు ఆలోచించండి అన్నారు మంత్రిగారు.
స్వచ్ఛందంగా ఎవరు ముందుకు వస్తారు? ఇది అయ్యేదేం కాదు అన్నారు రాజావారు విచారంగా. అలా డీలా పడకండి రాజావారూ ‘ధనంమూలం ఇదం జగత్‌’ అన్నారు. చచ్చేవారు చచ్చినా బతికున్నోళ్ల సుఖం కోసం ఆ మాత్రం త్యాగం చేయని వారుంటారా? నేను ఊరూరా దండోరా వేయిస్తా. సోషల్‌ మీడియాలో ప్రకటనలిప్పిస్తా. మీరు ‘ఊ’ అనండి అన్నారు మంత్రి గారు. ఇంకేం అనాలో తెలీక రాజావారు ‘ఊ’ అనే అన్నారు.
దండోరా ఊరూరా వేయించి వారం గడిచినా ‘నన్ను ఉరి తీయండి ప్రభూ’ అని ఎవరూ ముందుకు రాలేదు. కుమార్రాజావారు తండ్రిరాజావారిని ఇంకెప్పుడు? ఇంకెప్పుడు? ఉరి ఎప్పుడు? అని ఒకటే నస పెట్టసాగారు. ఒకనాడు సింహాసనం మీద కూచుని, సమస్య ‘సాల్వు’ అవుతుందా లేదా అని వేళ్ల గోళ్లు కొరుక్కుంటున్న రాజావారికి ‘ప్రభూ నన్ను ఉరితీయండి ప్రభూ!’ అన్న అరుపులు వినిపించాయి. రాజావారు భయం పోవడానికి జబ్బచరుకుని, ఎవడ్రా నువ్వు? నిజంగానే ఉరి తీయమంటావా? మా అబ్బాయి ఉరి తీయడాన్ని చూద్దామని మారం చేస్తున్నాడు కనుక తప్పడం లేదు. ఇంతకూ ఉరి తీయమని స్వచ్ఛందంగా ముందుకు వచ్చావు. ఎందుకో? అన్నార్రాజావారు.
భయమెందుకు ప్రభూ! నిండా మునిగాక చలేమిటి? ఎలాగూ ఆత్మహత్య చేసుకు చద్దామనుకున్నా. ఉరితీస్తే డబ్బు వస్తుంది కదా అని ఇలా వచ్చాను. చెక్కా, క్యాషా. ఉరితీశాక ఇస్తారా? ఇవ్వరా. నమ్మకమేనా? అన్నాడు ఉరికి సిద్ధపడ్డవాడు. మంత్రిగారు ఆ మనిషిని ఎగాదిగా చూస్తూ నువ్వు మన ఆస్థానంలో వుద్యోగం చేశావు కదా! అన్నాడు.

అవును మినిష్టర్‌ సార్‌. వుద్యోగం చేసి మూదు దశబ్దాలు ప్రభుత్వ సేవ చేసి విశ్రాంత ఉద్యోగినయ్యాను. ఆ తర్వాత నాకు రావలసిన భరణం, నేను ఖజానాలో దాచుకున్న సొమ్ము, విశ్రాంత వేతనం ఎవీరాకపోవడం వల్ల, గుండె మీద కుంపటిలా వున్న కూరుతు వివాహం జరిపించడానికి ఈ ‘ఉరి’కి సిద్ధపడ్డాను. నన్ను ఉరి తీయండి ప్రభూ అని ఆ మనిషి అంటూ వుండగానే, మరొకడు సభలోకి పరుగెత్తుకు వచ్చి, ప్రభూ! ఉరితీయండి… నన్ను ఉరితీయండి అని అరవసాగాడు.
ఎవడ్రా నువ్వు? చావడానికి సిద్ధపడి వచ్చావు అన్నారు రాజావారు. నేనూ తమరి దివాణంలో ఉద్యోగినే ప్రభూ. రిటైరయ్యాక రావలసిన సొమ్ము చేతికందక, దాచుకున్న సొమ్మంతా నాకు వచ్చిన మాయదారి జబ్బుకు తగలేసి, చావు తప్ప మరో దిక్కు లేకుండా పోవడంతో ఇలా వచ్చాను. నన్ను ఉరితీసి మా వాళ్లకు రావల్సింది ఇప్పిస్తే, వాళ్లయినా రెండు పూటలా అన్నం తింటారు అన్నాడా బక్కచిక్కిన మనిషి.
కుమార్రాజావారి సరదా తీర్చడానికి ఒక్కడు చాలు. ఇద్దరైతే డబ్బు దండగ అని రాజావారు ఆలోచిస్తుంటే, ఒక గుంపు లోపలికి తోసుకువచ్చింది. వచ్చిన వాల్లంతా వయోవృద్ధులు, విశ్రాంత ఉద్యోగులే. అందరివీ వ్యధలే. కన్నీటి కథలే. ‘ప్రభూ ఉన్ను ఉరి తీయండి, ఉరి తీయండి ప్రభూ’ అని గోలగోలగా జనం అరుస్తుంటే రాజావారికి బుర్ర తిరుగుతున్నదో, కళ్లు తిరుగుతున్నవో అర్థం అవలేదు.
తమకు రావలసిన బకాయిలు అందక, రకరకాల సమస్యలు పరిష్కరించుకోలేక, ఆత్మహత్యలకు సిద్ధపడ్డవాళ్లంతా తమ తమ కుటుంబాల సంక్షేమం కోసం స్వచ్ఛందంగా ఉరి వేయించుకోడానికి వచ్చారు. వచ్చిన వాళ్ల ‘హేంగ్‌ అజ్‌ క్విక్‌’ అన్న కేకలకు సభా భవనం దద్దరిల్లిపోయింది.

– చింతపట్ల సుదర్శన్‌
9299809212

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -