నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మహిళాలోకానికి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు సామాజిక సంపద సృష్టికర్తలనీ, దేశాభివృద్ధిలో పురుషుడితో సమానంగా స్త్రీ భాగస్వామ్యం ఇమిడివున్నదని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంతానోత్పత్తి అనే అనివార్యమైన ధర్మాన్ని పాటించాల్సిన బాధ్యత స్త్రీకి ప్రకృతి కేటాయించిందనీ, మానవ మనుగడను కొనసాగించే ప్రత్యేక కర్తవ్యాన్ని అనేక కష్టాలతో నిర్వర్తిస్తున్న ఆమె త్యాగశీలి అని కొనియాడారు. ఆకాశంలో సగమై, అపారమైన శక్తి సామర్థ్యాలు కలిగివున్న మహిళా లోకానికి అన్ని రంగాల్లో పురుషునితో సమానమైన అవకాశాలను మరింతగా అందించినపుడు మాత్రమే కుటుంబాభివృద్ధి సంపూర్ణమవుతుందని తెలిపారు.
తద్వారా సమాజ, దేశ, ప్రపంచాభివృద్ధి ఫరిడవిల్లుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో, అనంతర స్వయంపాలనలో మహిళల పాత్ర గొప్పదని గుర్తు చేశారు. మహిళా సాధికారత దిశగా, వారి సంక్షేమం, ప్రగతికోసం పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో అమలు చేసిన పలు కార్యక్రమాలను ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు. మహిళా సాధికారతను మరింతగా పెంచే దిశగా ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరమున్నదని సూచించారు.
రాజమౌళి మరణం పట్ల కేసీఆర్ సంతాపం
వరంగల్ జిల్లా గంగదేవిపల్లి సర్పంచ్ కూసం రాజమౌళి మరణం పట్ల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. గ్రామ స్వరాజ్యానికి అసలైన అర్థం తెలిపి, దేశానికే ఆదర్శ గ్రామంగా నిలిచిన తెలంగాణ పల్లెగా, గంగదేవిపల్లిని తీర్చిదిద్దడంలో రాజమౌళిది కీలక పాత్ర అని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామాభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేసి, అన్ని రంగాలను అభివృద్ధి పరిచి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారని పేర్కొన్నారు. పల్లెల అభ్యున్నతికి అసలైన నిర్వచనం చెప్పిన వ్యక్తి కూసం రాజమౌళి అని కేసీఆర్ ఆయన సేవలను కొనియాడారు. ఆయన మరణం దేశ పంచాయతీరాజ్ వ్యవస్థకు తీరని లోటని తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు : కేసీఆర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



