వికారాబాద్ జిల్లాలో 217 మేకలు మృత్యువాత
రూ.20 లక్షల నష్టం.. ప్రభుత్వం ఆదుకోవాలి : మేకల యజమానులు
వనపర్తి జిల్లాలో పిడుగుపాటుకు వ్యక్తి మృతి
నవతెలంగాణ-పూడూర్/ఆత్మకూర్
గత కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో కురుస్తున్న ఈదురుగాలులు, మెరుపులు, ఉరుములతో కూడిన వడగండ్ల వానతో రైతులు, ప్రజలు అల్లాడిపోతున్నారు. వడగండ్లతో వికారాబాద్ జిల్లాలో 217 మేకలు మృత్యువాతపడ్డాయి. వనపర్తిలో పిడుగులకు ఓ వ్యక్తి మృతిచెందాడు. మంచిర్యాల, కొమురం భీం అసిఫాబాద్ జిల్లాల్లో పంటలు దెబ్బతిని రైతులకు నష్టాన్ని మిగిల్చాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా కూరగాయలు, మొక్కజొన్న, వరి, పత్తి, మిరప పంటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రైతులను అకాల వర్షం నడ్డి విరిచింది. మొక్కజొన్న, పుచ్చకాయలు, ఇటుక బట్టీలు, బొగ్గు బట్టీలు వర్షానికి నీట మునిగాయి. మామిడి కాయలు నేలరాలాయి. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఉమ్మడి జిల్లాలో పది వేల ఎకరాలకుపైగా మిర్చి, మామిడి, పుచ్చకాయ, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లిందని రైతు సంఘాల నేతలు తెలిపారు.
217 మేకలు మృత్యువాత
వికారాబాద్ జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో భారీ వడగండ్ల వర్షం పడింది. ఈ సమయంలో పూడురు మండలం నిజాంపేట్-మేడిపల్లి సమీపంలో వడగండ్ల వర్షానికి 217 మేకలు మృత్యువాత పడ్డాయి. చౌడపూర్ మండలం కొత్తపల్లికి చెందిన ఇప్పాయపల్లి కేశవులు, జబ్బుల యాదయ్య, గోరింక గోపాల్, నక్కపోతు రామచంద్రయ్య, పల్లెనోని కేశవులు, 6 మంది మేకల యజమానులు 600 మేకల మందతో ప్రతి ఏటా పంటలు ముగిసే సమయంలో గ్రామం నుంచి మేకల మందతో పక్క ఊరికి వెళుతుంటారు. 12 ఏండ్లుగా ఇలాగే మేకల మందతో పక్క ఊరిలో మేపుకునేందుకు వెళ్తుంటారు. ఈ ఏడాది నాలుగు నెలల కిందటే పక్క గ్రామంలో రైతులతో మాట్లాడుకుని పొలాల్లో మందను మేపుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు.
అందులో భాగంగానే బుధవారం మేడిపల్లి సమీపంలో ఓ రైతు పొలంలో మంద వేసి నిద్రపోగా అర్ధరాత్రి ఊహించని రీతిలో వడగండ్ల వర్షం వచ్చింది. ఆ వర్షానికి సుమారు 217 మేకలు మృత్యువాత పడ్డాయని కాపలాదారులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రూ.20లక్షల ఆస్తి నష్టం జరిగిందని వాపోయారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబసభ్యులు కోరారు. కాగా, 217 మేకలు మృత్యువాత పడ్డాయన్న విషయం తెలుసుకున్న పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వడగండ్ల వర్షం దాటికి తీవ్రస్థాయిలో నష్టపోయిన మేకల రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు రామకృష్ణ కోరారు.
పిడుగుపాటుకు వ్యక్తి మృతి
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మేడేపల్లి గ్రామంలో పిడుగుపాటుకు గురై వ్యక్తి మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలల ప్రకారం.. గ్రామానికి చెందిన గొల్ల రాములు(26) మంగళవారం రాత్రి మెరుపులతో కూడిన వర్షం కురవడంతో ఆ సమయంలోనే మిర్చి తోటకు వెళ్లాడు. ఈ క్రమంలో పొలం సమీపంలోనే పిడుగుపాటుకు గురై మృతిచెందారు. బుధవారం తెల్లవారు జామున చుట్టుపక్కల పొలాల వారు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం తెలిపారు. కుటుంబ సభ్యులు గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఇంటికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.



