మా నాన్న ప్రజల కోసం పని చేస్తే..
వాళ్లిద్దరూ ఆస్తుల కోసం పని చేశారు
ఇంత జరిగాక పార్టీ ఉంటే ఎంత? పోతే ఎంత?
సీబీఐ విచారణలో కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకొస్తారు :బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మాజీ ఎంపీ జోగినేపల్లి సంతోశ్‌కుమార్ వల్లే కేసీఆర్‌కు అవినీతి మరక అంటిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. వారితోపాటు మెగా కృష్ణారెడ్డి పాత్ర కూడా ఉందని ఆమె తెలిపారు. మా నాన్న ప్రజల కోసం పని చేస్తే, వాళ్లందరూ ఆస్తులను పెంచుకునేందుకు పని చేశారని ఘాటుగా
వ్యాఖ్యానించారు. సీబీఐ విచారణలో కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకొస్తారని ధీమా వ్యక్తం చేశారు. తన అమెరికా పర్యటనను ముగించుకుని సోమవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్న కవిత… సాయంత్రం బంజారాహిల్స్‌లోని తన నివాసంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కేసీఆర్‌కు అవినీతి మరక ఎలా అంటిందనే విషయమై ఇప్పటికైనా ఆలోచించాలని బీఆర్‌ఎస్ శ్రేణులకు హితవు పలికారు. హరీశ్‌రావు, సంతోశ్‌కుమార్, మెగా కృష్ణారెడ్డి వల్లే ఈ దుస్థితి దాపురించిందని వాపోయారు. ఫలితంగా సీఎం రేవంత్ రెడ్డి… కేసీఆర్‌ను విమర్శించే పరిస్థితి తలెత్తిందని అన్నారు. తనపైన హరీశ్, సంతోశ్ ఎన్నో కుట్రలు చేశారనీ, వాటన్నింటినీ ఇప్పటిదాకా భరిస్తూ వచ్చానని చెప్పారు. ఇప్పుడేమో అవినీతి ఆనకొండలు కేసీఆర్‌ను బదనాం చేసేందుకు కంకణం కట్టుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వెనుక బీజేపీ, కాంగ్రెస్‌లు ఉన్నాయంటూ ఆ ఆనకొండలు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నాయని దుయ్యబట్టారు. తనది కేసీఆర్ బ్లడ్ అనీ, ఎవరో చెప్తే ఏదో చేసే రకాన్ని కాదని హెచ్చరించారు. తాను స్వతంత్రంగా ఉంటానని స్పష్టం చేశారు. కేసీఆర్‌లాంటి మహానేతపై సీబీఐ విచారణ చేసే పరిస్థితి వచ్చినా కూడా బీఆర్‌ఎస్‌లో ఏ ఒక్కరూ మాట్లాడటం లేదనీ, అలాంటప్పుడు పార్టీ ఉంటే ఎంత? లేకపోతే ఎంత…? అంటూ అసహనం వ్యక్తం చేశారు. తనపై సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ చేసేవారి తోలు తీస్తానంటూ కవిత ఈ సందర్భంగా హెచ్చరించారు.కాంగ్రెస్ ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ పేరిట కాలయాపన చేస్తోందని ఆమె విమర్శించారు. కేసీఆర్‌ను తలుచుకోనిదే సీఎం రేవంత్ పేరు, ఫొటో పేపర్‌లో రాదని ఎద్దేవా చేశారు. తాను ఇప్పుడు కాళేశ్వరం అవినీతితో సంబంధమున్న వారి పేర్లన్నీ చెబుతున్నాననీ, సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే వారందరిపైనా విచారణ చేయాలని సవాల్ విసిరారు. బీహార్‌లో ఎన్నికల కోసం సీఎం రేవంత్ తెలంగాణలోని బీసీలను బలి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల సాధన కోసం సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లటం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు తాము బీహార్ వెళతామనీ, ఆ పార్టీ వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని కవిత హెచ్చరించారు.
హరీశ్, సంతోశ్ వల్లే కేసీఆర్‌కు అవినీతి మరక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES